హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులో టెక్నాలజీ సంస్థ టెక్ మహీంద్రాకు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌కు చెందిన రూ.822 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను జప్తు చేయాలన్న ఈడీ ఆదేశాలను నిలుపుదల చేస్తూ హైదరాబాద్ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. మనీ లాండరింగ్ కేసులో 2012లో అప్పటి సత్యం కంప్యూటర్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్తంభింపజేస్తూ ఈడీ తాత్కాలిక ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ మార్గంలో వచ్చిన సొమ్ము అన్న ఆరోపణలతో ఈ మొత్తాన్ని ఈడీ జప్తు చేసింది. జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల బెంచ్ ఈడీ ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చారు.
ఆ సమయంలో నిధులేవి?
టెక్ మహీంద్రా తరఫు న్యాయవాది వివేక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘2009లో టెక్ మహీంద్రా కొనుగోలు చేసిన సమయంలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌లో నిధులే లేవు. పైగా సత్యంను తిరిగి గాడిలో పెట్టేందుకు మహీంద్రా గ్రూప్ నిధులు వెచ్చించాల్సి వచ్చింది. టెక్ మహీంద్రా టేక్ ఓవర్ చేసిన సమయంలో సత్యం కంప్యూటర్స్‌కు ఆదాయమే లేదు. నెగటివ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అక్రమ ఆదాయం అన్న ప్రశ్నే తలెత్తదు’ అని అన్నారు. ఇదిలావుంటే, బి.రామలింగ రాజు, ఆయన అనుచరులు అక్రమంగా కంపెనీ షేరు ధరను పెంచి, వాటిని విక్రయంతోపాటు తనఖా పెట్టారని ఈడీ చెబుతోంది. బినామీ కంపెనీల నుంచి పొందిన రూ.2,171.45 కోట్ల రుణాల్లో రూ.822 కోట్లు సత్యం కంప్యూటర్స్‌లోకి వచ్చిచేరాయి. వీటిని రోజువారీ వ్యయాలు, వేతనాలకు ఖర్చు చేసినట్టుగా ఈడీ గుర్తించింది.
సుప్రీంకు వెళతాం..
హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉందని ఈడీ తరఫు న్యాయవాది పి.వి.పి.సురేష్ కుమార్ వెల్లడించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు రామలింగ రాజు, ఆయన సోదరులను దోషులుగా బోనులో నిలబెట్టడాన్ని బలమైన కారణంగా ఉన్నత న్యాయ స్థానం ముందు చూపెడతామని అన్నారు. ‘దోషిగా నిలబెట్టడం విషయంలో ఐపీసీ నిబంధనలకు, మనీ లాండరింగ్ యాక్టుకు మధ్య ప్రతికూలతలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయి. ఇదే సరైనది కూడా’ అని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. కాగా, కేసు పూర్వాపరాలు ఏమంటే.. ఈడీ అటాచ్‌మెంట్ ఆర్డర్‌పై సింగిల్ బెంచ్ జడ్జ్ గతంలో స్టే విధించారు. దీనిని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ముందు ఈడీ రిట్ అప్పీల్ చేసింది. ఈడీ విన్నపం నిబంధనలకు విరుద్ధమంటూ 2014 డిసెంబరు 31న కేసును కొట్టివేసింది.
ఈడీ కేసులో టెక్ మహీంద్రాకు ఊరట
Published Tue, Jan 1 2019 1:32 AM | Last Updated on Tue, Jan 1 2019 1:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment