హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్నాళ్ల కిందటి దాకా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ఒక స్థాయికి మించి చేపట్టని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్... మళ్లీ వాటిపై దృష్టిపెట్టింది. సంక్లిష్టమైన జనరిక్స్, అధిక విలువ ఉండే ఔషధాలను రూపొందించేందుకు పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) వ్యయాలను భారీగా పెంచింది. ఇందుకోసం దాదాపు రూ.1,000 కోట్లు పైగా వెచ్చించబోతోంది. ఎందుకంటే కంపెనీ తన ఆదాయంలో 7-8 శాతాన్ని ఆర్‌అండ్‌డీపై వెచ్చించనున్నట్లు 2012-13 వార్షిక నివేదికలో పేర్కొంది. గడిచిన మూడేళ్లుగా చూసినా సంస్థ తన ఆదాయంలో 6-7 శాతం మధ్య ఆర్ అండ్ డీపై వెచ్చిస్తోంది. ఇక ఆదాయానికి వస్తే సగటున 20 శాతం వృద్ధితో ఈసారి రూ.13,951 కోట్లు ఆర్జించవచ్చని అంచనా. దీన్లో 8 శాతం అంటే దాదాపు 1,116 కోట్లు. తద్వారా ఆర్ అండ్ డీపై వెయ్యి కోట్లకు పైగా వెచ్చిస్తున్న దేశీ ఫార్మా దిగ్గజంగా డీఆర్‌ఎల్ మారుతుంది. ఇటీవల విడుదల చేసిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఇప్పటికే ఆర్‌అండ్‌డీపై రూ.243 కోట్లు ఖర్చు చేసింది.
బయోసిమిలర్స్‌పై దృష్టి..: రాబోయే కొన్నాళ్లలో అమెరికా, యూరప్‌లలో పలు బయోఫార్మా డ్రగ్స్ పేటెంట్ గడువు ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై డీఆర్‌ఎల్ దృష్టి సారిస్తోంది. బయోఫార్మా ఔషధాలకు జనరిక్స్ అయిన బయోసిమిలర్స్ తయారీలో పటిష్టంగా ఎదిగేందుకు యత్నిస్తోంది. డీఆర్‌ఎల్ ఇప్పటికే దేశీ మార్కెట్లో రెడిటక్స్, గ్రాఫీల్ తదితర 4 బయోసిమిలర్స్‌ని ప్రవేశపెట్టింది. కొత్త ఉత్పత్తుల రూపకల్పన కోసం జర్మనీకి చెందిన మెర్క్ సంస్థతో కూడా డీఆర్‌ఎల్ చేతులు కలిపింది. గడచిన అయిదేళ్లలో బయోసిమిలర్స్ సహా వివిధ ఔషధాల ఉత్పత్తి కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై రూ. 3,600 కోట్ల పైగా వెచ్చించింది. మరోవైపు, తమ కార్యకలాపాలకు అనుగుణంగా ఉండే సంస్థల కొనుగోలుపై కూడా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దృష్టి సారిస్తోంది. 2017 ఆర్థిక సంవత్సరం నాటికి సుమా రు 40% ఆదాయాలను వివిధ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా సాధించాలని నిర్దేశించుకుంది.
పరిశోధనకు రూ. 1,000 కోట్లు
Published Sat, Aug 10 2013 2:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement