న్యూఢిల్లీ: దివంగత జనరల్ బిపిన్ రావత్ స్థానంలో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) నియామక ప్రక్రియ మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన జనరల్ బిపిన్ రావత్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సీనియర్ కమాండర్లతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఈ ప్యానెల్ ప్రతిపాదించిన పేర్లతో కూడిన జాబితా త్వరలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు అందుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తదుపరి ఈ జాబితా కేబినెట్ నియామకాల కమిటీకి పరిశీలనకు అందుతుంది. ఆ కమిటీ అంతిమంగా సీడీఎస్ పేరును ఖరారు చేస్తుంది. అత్యున్నత స్థాయి ఈ పోస్టుకు అత్యంత సీనియర్ అయిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జనరల్ నరవణె వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇద్దరూ కూడా ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్‌లలో బాధ్యతలు స్వీకరించారు.
ఒక వేళ సీడీఎస్‌గా జనరల్ నరవణెను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే, తదుపరి సీడీఎస్‌గా ఎవరిని నియమించాల్సింది కూడా ఇప్పుడే నిర్ణయించాల్సి ఉంటుంది. తదుపరి ఆర్మీ చీఫ్‌గా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతి, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందిన సీనియర్ మోస్ట్ కమాండర్లు. ఇద్దరూ కూడా జనవరి 31వ తేదీన రిటైర్ కావాల్సి ఉంది. దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా గత ఏడాది జనవరి ఒకటో తేదీన జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment