అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ | Filling up of posts of Gurukulas in descending order | Sakshi
Sakshi News home page

అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ

Published Tue, Apr 11 2023 4:31 AM | Last Updated on Tue, Apr 11 2023 4:31 AM

Filling up of posts of Gurukulas in descending order - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఒకేసారి 9,231 కొలువుల భర్తీకి ఒకే దఫా 9 నోటిఫికేషన్లు జారీ చేసిన బోర్డు.. నూరు శాతం ఉద్యోగాల్లో నియామకాలు జరిపేలా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం భర్తీ చేయనున్న పోస్టులన్నీ బోధన రంగానికి సంబంధించినవే.

కాగా ఒక అభ్యర్థి మూడు నుంచి నాలుగు పోస్టులకు (వేర్వేరు సబ్జెక్టులకు) దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ పరీక్షలన్నీ వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తుండటంతో ఇలాంటి వారంతా  వివిధ పరీక్షలకు హాజరై అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టకుంటే ఖాళీలు ఎక్కువగా మిగిలేపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అవరోహణ (డిసెండింగ్‌ ఆర్డర్‌)విధానాన్ని అమలు చేయాలని టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్ణయించింది. ఈ పద్ధతిలో నియామకాలు చేపడితే పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేపట్టవచ్చని బోర్డు అంచనా వేస్తోంది. 

తొమ్మిది కేటగిరీల్లో కొలువులు... 
ఐదు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో గురుకుల డిగ్రీ కాలేజీలు, జూనియర్‌ కాలేజీలు, పాఠశాలల్లో 9,231 పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో డిగ్రీ లెక్చరర్‌ (డీఎల్‌), జూనియర్‌ లెక్చరర్‌(జేఎల్‌), ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్, లైబ్రేరియన్‌ పోస్టులున్నాయి.

కొన్ని పోస్టులు కాలేజీలు, స్కూళ్లలో ఉండడంతో రెండింటికీ దాదాపుగా ఒకే అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే డిగ్రీ లెక్చరర్‌కు అర్హతలున్న అభ్యర్థులు, జూనియర్‌ లెక్చరర్‌తో పాటు పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

అవరోహణ పద్ధతి ఇలా.. 
ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను నియామక సంస్థలు ఒక క్రమ పద్ధతిలో చేపడతాయి. ఇష్టానుసారంగా చేపడితే అన్ని పోస్టులూ భర్తీకాక తిరిగి ప్రకటనలు జారీ చేసి నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. తాజాగా గురుకుల నియామకాల బోర్డు పరిధిలో 9 వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన అంతా బోర్డు పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించినప్పటికీ నియామకాల కౌన్సెలింగ్‌ను మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు.

ప్రస్తుతం 9 కేటగిరీల్లో కొలువులున్నాయి. వీటిని పైస్థాయి నుంచి కింది స్థాయికి అవరోహణ క్రమంలో  విభజించిన తర్వాత వాటికి కౌన్సెలింగ్‌ నిర్వహించి నియామకాలు చేపడతారు. అంటే ముందుగా డిగ్రీ కాలేజీల్లో కొలువులు భర్తీ చేసిన తర్వాత జూనియర్‌ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేస్తారు. ఆ తర్వాత పాఠశాలల్లో పైస్థాయి పోస్టులైన పీజీటీ, టీజీటీ తర్వాత ఇతక కేటగిరీ పోస్టుల్లో నియామకాలు చేపడతారు. దీంతో ప్రకటించిన పోస్టులన్నీ పూర్తిస్థాయిలో భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇలా కాకుండా కిందిస్థాయి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎంపికైన అభ్యర్థి, ఆ తర్వాత పైస్థాయి పోస్టుకు ఎంపికైతే కిందిస్థాయి పోస్టును వదిలేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ ఖాళీ భర్తీ కాకుండా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement