రూ. 500 కోట్లపైన వ్యయాలపై నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ మూలధన వ్యయాల వేగవంతంపై కేంద్రం దృష్టి సారించింది. రూ. 500 కోట్లకు మించిన వ్యయానికి సంబంధించిన నిబంధనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సడలించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 11.11 లక్షల కోట్ల క్యాపెక్స్‌ను(మూలధన వ్యయం) బడ్జెట్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే ఇది 11.1 శాతం ఎక్కువ. సార్వత్రిక ఎన్నికల కారణంగా కొన్ని నెలలపాటు మందగించిన ప్రభుత్వ వ్యయాలను తిరిగి వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 15 నెలల కనిష్ట స్థాయిలో 6.7 శాతంగా నమోదుకావడానికి ఎన్నికల సందర్భంగా మూలధన వ్యయాల్లో నెమ్మదే కారణమన్న విశ్లేషణలు వచ్చిన సంగతి తెలిసిందే. మూలధన వ్యయాలకు సంబంధించి అనుమతించిన తాజా సడలింపులను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్‌ఎన్‌ఏ), సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సీఎన్‌ఏ), మంత్లీ ఎక్స్‌పెండిచర్ ప్లాన్ (ఎంఈపీ), స్కీమ్ అలాగే నాన్–స్కీమ్ ఖర్చుల కోసం మంత్రిత్వ శాఖలు రూపొందించిన త్రైమాసిక వ్యయ ప్రణాళిక (క్యూఈపీ)లు సీలింగ్‌ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.
క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలు
మరోవైపు రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్), టెలికాం శాఖ కోసం బడ్జెట్ మూలధన వ్యయాలపై జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వివిధ మంత్రిత్వ శాఖలు క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరమని అన్నారు. సంవత్సరంలో మిగిలిన నెలల్లో వ్యయాలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ క్యాపెక్స్ కేటాయింపులు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.42 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుత 2024–25లో 90% వృద్ధితో రూ. 2.72 లక్షల కోట్లకు ఎగశాయి. 2024–25కు సంబంధించిన క్యాపెక్స్ ప్రణా ళికల గురించి ఎంఓఆర్‌టీహెచ్ సెక్రటరీ కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వివిధ చర్యల ద్వారా ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆస్తుల రీసైక్లింగ్ లక్ష్యాలను కూడా చేరుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్థికమంత్రికి సెక్రటరీ తెలియజేసినట్లు సమాచారం. క్యాపెక్స్ వ్యయాల వేగవంతంపై ఆర్థిక మంత్రి వివిధ మంత్రిత్వశాఖలు, సమావేశమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment