న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) ఎగుమతులకు ఊతమిచ్చేందుకు అంతర్జాతీయ మార్కెట్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణె తెలిపారు. విదేశీ మార్కెట్లకు ఎగుమతుల డేటా సంబంధ సమాచారానికి ఇది కేంద్రంగా ఉండగలదని ఆయన వివరించారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఈడీఐఐ) నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.
గణాంకాల ప్రకారం.. భారత ఎగుమతుల్లో దాదాపు 45 శాతం వాటా ఎంఎస్‌ఎంఈ రంగానిదే ఉంటోంది. అయితే, విదేశీ మార్కెట్లకు సంబంధించిన విశ్వసనీయ వాణిజ్య గణాంకాలు అందుబాటులో లేకపోతుండటం వల్ల చిన్న సంస్థలు తమ సామర్థ్యాల మేరకు ఎగుమతులు చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పటిష్టం చేసేందుకు, రుణ లభ్యత పెంచేందుకు, మెరుగైన సాంకేతికత అందించేందుకు, ఎగుమతి మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి అయిన రాణె వివరించారు.
ఎంఎస్‌ఎంఈ రంగాన్ని దేశ ఎకానమీకి చోదక శక్తిగా మార్చేందుకు తగు మార్గదర్శ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత వర్గాలకు ఆయన సూచించారు. దీటుగా పోటీపడేలా చిన్న సంస్థలను తీర్చిదిద్దేందుకు మరింత అధ్యయనం, ఆవిష్కరణలు, సరికొత్త వ్యాపార ఐడియాలు అవసరమని రాణె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment