న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలు పొందడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కోరారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యామ్నాయ రుణ వితరణ నమూనాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రతిపాదిత పారిశ్రామిక పట్టణాల్లో ఎంఎస్‌ఎంఈలకు స్థలాలు కేటాయిస్తామన్నారు.
‘‘బ్యాంకు రుణాల విషయంలో ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్పండి. అధిక తనఖాలు కోరుతున్నాయా? ఎగుమతుల రుణ హామీ కార్పొరేషన్ (ఈసీజీసీ) ఉన్నప్పటికీ, బ్యాంక్‌లు తనఖా ఇవ్వాలని అడుగుతున్నాయా? ఎగుమతి రుణాల్లో వైఫల్యాలు ఎదురైతే 90 శాతం హామీ బాధ్యతను ఈసీజీసీ తీసుకుంటున్న తరుణంలో బ్యాంక్‌లు రుణాలపై ఎంత మేర వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి? అంశాల వారీ మరింత స్పష్టమైన సమాచారం పంచుకుంటే దాన్ని బ్యాంక్‌ల దృష్టికి తీసుకెళ్లగలం. ఇప్పటికీ బ్యాంక్‌లకు వెళ్లి రుణాలు తీసుకునేందుకుకే అధిక శాతం ఆసక్తి చూపిస్తున్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ రుణ నమూనా ఆలోచనల పట్ల అనుకూలంగా ఉన్నాం’’అని గోయల్ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా చెప్పారు.
స్థలాలు కేటాయిస్తాం..
ఎంఎస్‌ఎంఈలు లేకుండా పెద్ద పరిశ్రమలు మనుగడ సాగించలేవని వాణిజ్య మంత్రి గోయల్ పేర్కొన్నారు. కనుక వాటికంటూ ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో షెంద్రాబిడ్కిన్ పారిశ్రామిక టౌన్‌షిప్‌లో టయోటా రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా సుమారు 100 ఎంఎస్‌ఎంఈల అవసరం ఉంటుంది’’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment