
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి, మార్కెటింగ్ వ్యయాలను తగ్గించుకోవడానికి, కొత్త మార్కెట్లలో విస్తరించడానికి ఈ–కామర్స్ ఎంతగానో తోడ్పడుతోందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. చిన్న వ్యాపారాలు తమ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను, టెక్నాలజీని మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన భారతీయ ఎంఎస్‌ఎంఈల సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎంఎస్‌ఎంఈలు దేశీయంగా ఉపాధి కల్పనలోనూ, తయారీ కార్యకలాపాలను విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వాటిపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వర్మ చెప్పారు.
ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వ చేయూత..
కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా చిన్న పరిశ్రమలు ఎదురొడ్డి నిల్చాయని మంత్రి తెలిపారు. కొన్ని యూనిట్లు ఆర్థిక కష్టాలతో మూతబడే పరిస్థితికి వచ్చినా ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు తోడ్పాటునివ్వడంతో గట్టెక్కాయని ఆయన చెప్పారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకే కేంద్రం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను (ఈసీఎల్‌జీఎస్) ఆవిష్కరించినట్లు మంత్రి వివరించారు. దీని కింద చిన్న సంస్థలకు రూ. 3.1 లక్ష కోట్ల మేర నిధులను కేటాయించినట్లు ఎంఎస్‌ఎంఈ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్ తెలిపారు.
డీ2సీ మార్కెట్ నివేదిక ఆవిష్కరణ..
కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రాక్సిస్, షిప్‌రాకెట్, సీఐఐ సంయుక్తంగా రూపొందించిన భారత డీ2సీ మార్కెట్ నివేదికను మంత్రి ఆవిష్కరించారు. దీని ప్రకారం ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని నేరుగా కస్టమర్లకు పంపే చాలా మటుకు డీ2సీ (డైరెక్ట్ టు కస్టమర్స్) సంస్థలకు ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రధాన సరఫరా, డిమాండ్ హబ్‌లుగా ఉంటున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో నిత్యావసరాలు మొదలైన ఉత్పత్తుల మార్కెట్ పరిమాణం 571 బిలియన్ డాలర్లుగా, ఆభరణాల మార్కెట్ 82 బిలియన్ డాలర్లు, దుస్తులు.. పాదరక్షలు 81 బిలియన్ డాలర్లు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 9.4 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment