portal website
-
సుప్రీంకోర్టు ఆర్టీఐ పోర్టల్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గురువారం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)పోర్టల్‌ను ప్రారంభించింది. ‘‘సుప్రీంకోర్టు ఆర్టీఐ పోర్టల్ సిద్ధమైంది. ఒక వేళ ఏమైనా సమస్యలు ఉంటే సరిచేస్తాం’’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్టీఐ దరఖాస్తుల ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్, మాస్టర్/వీసా క్రెడిట్ డెబిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లించొచ్చు. దరఖాస్తు ఖరీదు రూ.10. భారతీయ పౌరులు మాత్రమే దీనిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అపారమైన పని భారంతో సతమతమవుతున్నారని ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. వచ్చే వారంలో 13 బెంచ్‌ల ముందు 525 అంశాలు జాబితా చేయాల్సి ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘‘న్యాయమూర్తులు ఒత్తిడికి లోనవుతున్నారనే విషయాన్ని నమ్మాలి. ప్రతి బెంచ్ ముందు సుమారు 45 నుంచి 50 కేసులు ఉంటున్నాయి’’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం ఉమ్మడి పోర్టల్
న్యూఢిల్లీ: వ్యవసాయం, ఆహార శుద్ధి శాఖలు అమలు చేస్తున్న మూడు ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి ఉమ్మడి పోర్టల్.. ఆహార శుద్ధి పరిశ్రమలో సూక్ష్మ యూనిట్లకు మేలు చేస్తుందని కేంద్ర ఆహార శుద్ధి శాఖ ప్రకటించింది. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం, ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై) పథకాలను ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాలు ఆహార శుద్ధి రంగంలో సూక్ష్మ యూనిట్లకు సాయంగా నిలుస్తాయన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. పీఎంఎఫ్ఎంఈ, పీఎంకేఎస్‌వై పథకాల కింద అర్హత కలిగిన లబ్ధిదారులు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీకితోడు.. 3 శాతం వడ్డీ రాయితీ పొందొచ్చని ఆహార శుద్ధి శాఖ తెలిపింది. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద అందిస్తున్న 35 శాతం సబ్సిడీకి ఇది అదనమని పేర్కొంది. ఈ రెండు పథకాల కింద ప్రాజెక్టుల ఆమోదానికి దరఖాస్తులను ఏఐఎఫ్ ఎంఐఎస్ పోర్టల్ నుంచి స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్ పెట్టిన మార్క్ జుకర్‌బర్గ్! -
కార్మికుల సంక్షేమానికి ఈ–శ్రమ్
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ శ్రమ్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న వారి సమాచారం సేకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయం, నష్ట పరిహారం నేరుగా కార్మికులకు అందించేందుకు ఈ శ్రమ్ పోర్టల్ దోహదపడుతుంది. తుపానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం సాయం అందించాలంటే తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ తమ సిబ్బందితో ముందుగా సర్వే నిర్వహిస్తారు. బాధిత కార్మికుల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం నష్టపరిహారం మంజూరవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ విధమైన సర్వేలో అవకతవకలు జరగడానికి, అలాగే అసలైన కార్మికులకు కాకుండా అనర్హులను జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అదే ఈ శ్రమ్ పోర్టల్‌లో అసంఘటిత కార్మికులు తమ వివరాలను నమోదు చేసుకుంటే విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో ఎంత మంది ఆసంఘటిత కార్మికులు ఉన్నారన్న విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ఉంటే కార్మికులు ప్రభుత్వ పథకాలను సులువుగా పొందవచ్చు. ఈ గుర్తింపు కార్డు దేశంలో ఎక్కడైనా పనిచేస్తుంది. ఈ శ్రమ్ కార్డు అంటే... ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆధార్ నంబర్లా దేశ వ్యాప్తంగా కార్మికుడికి ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. 12 అంకెల నంబర్‌తో గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అనేక పథకాలు ప్రారంభిస్తున్నప్పటికీ చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కానీ ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే కార్మికుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. మెరుగైన ఉపాధి అవకాశాలకు నైపుణ్యాల అభివృద్ధికి సహాయం లభిస్తుంది. కార్డుతో ప్రయోజనాలు అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారికి రూ.2 లక్షల ప్రమాదబీమా సౌకర్యం లభిస్తుంది. అంగవైకల్యం పొందితే రూ.లక్ష లభిస్తుంది. నమోదు కావాలంటే... ఈశ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులైన వారు సమీప మీ సేవ, సీఎస్సీ సెంటర్లు, గ్రామ వార్డు సచివాలయాలు, పోస్టాఫీసుల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు ఈ పథకంలో నమోదు కొరకు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికులు/నామిని ఖాతాకు జమ అవుతుంది. మరిన్ని వివరాలకు జిల్లా ఉప కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. అసంఘటిత కార్మికులంటే ఎవరు? ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని ప్రతి కార్మికుడు అసంఘటిత కార్మికుడే. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ రంగ కూలీలు, ఇళ్లల్లో, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి కార్మికులు, వలస కార్మికులు, డొమెస్టిక్, అగ్రికల్చర్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, ఆశ వర్కర్లు, అంగనవాడీ వర్కర్లు, మత్స్యకార్మికులు, ప్లాంటేషన్ వర్కర్స్, పాల వ్యాపారులు, చిరు వ్యాపారులు, ట్యూషన్ టీచర్లు, చేతి వృత్తుల వారు, కార్పెంటర్లు, ప్లంబర్స్ ఇలా చాలా రకాల పనులు చేసే కార్మికులు అసంఘటిత రంగంలోకి వస్తారు. (చదవండి: గొప్ప యజ్ఞాన్ని అడ్డుకోవాలని చూశారు, కానీ.. ఆపలేకపోయారు: సీఎం జగన్) -
తెలంగాణలో భూముల ధరల పెంపు ఎఫెక్ట్.. ‘ధరణి’ డౌన్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యాప్తంగా ‘ధరణి’ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటు మీసేవ సెంటర్లలో స్లాట్ బుకింగ్‌లు సైతం నిలిచి పోయాయి. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయే తర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలు ఫిబ్రవరి ఒకటి నుంచి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో భూ, ఇతర స్థిరాస్తుల క్రయవిక్రయదారులు తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. 4,5 రోజులుగా ఈ పరిస్థితి నెలకొంది. అయితే గురువారం పెద్దసంఖ్యలో రిజిస్ట్రేషన్లు ఉండ డం, స్లాట్ బుక్‌చేసుకునే వారు సైతం మీసేవ సెంటర్లకు భారీగా తరలిరావడంతో ధరణి సర్వర్‌పై ప్రభావం చూపింది. ఎక్కువ లోడ్ పడడంతో సర్వర్ మొరాయించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6:30 తర్వాత ధరణి వెబ్సైట్ పనిచేయడంతో తహసీల్దార్ కార్యాల యాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టగా.. పలు చోట్ల రాత్రి 10:30గంటల వరకు కొనసాగింది. ఒక్కసారిగా పెరిగిన రిజిస్ట్రేషన్లు.. మరో నాలుగు రోజుల్లో వ్యవసాయ, వ్యవ సాయేతర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలు వల సవరణ అమల్లోకి రానుండడంతో ఇప్ప టికే భూములు కొనుగోలు చేసుకుని రిజి స్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నవారు మీసేవ సెం టర్లకు పరుగులు పెడుతున్నారు. స్లాట్ బుకిం గ్ల సంఖ్య పెరగడంతో రిజిస్ట్రేషన్, తహసీ ల్దార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. సాధారణ రోజుల్లో జరిగే రిజిస్ట్రేషన్లకు సుమారు మూడింతలు పెరిగినట్లు తెలుస్తోంది. వచ్చే రెండు, మూడు రోజులు సైతం ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇదీ పరిస్థితి ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాధారణ రోజుల్లో 500 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యేవి. గురువారం ఒక్కరోజే 1,290 వరకు కావడం విశేషం. ► ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజువారీ 72 స్లాట్లు బుక్ చేస్తుండగా.. అన్ని డాక్యుమెంట్లను అధికారులు రిజిస్ట్రేషన్ చేసేవారు. గురువారం 120కిపైగా స్లాట్లు బుక్కయ్యాయి. ► కరీంనగర్ పట్టణంలో 97 డాక్యుమెంట్లకు సంబంధించి చలాన్లు తీసుకోవడానికి సర్వర్ మొరాయించడంతో సుమారు 60 వరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అలాగే 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 550 రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం. దాదాపుగా 145 మీసేవ కేంద్రాల్లోనూ సర్వర్ సమస్యతో స్లాట్ బుక్‌కాలేదు. తహసీల్దార్ కార్యాలయాల్లో సైతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవాంతరాలు ఎదురయ్యాయి. ► వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 30 – 40 వరకు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. గురువారం 200కుపైబడి వచ్చాయి. దీంతో రాత్రి 10.30 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. ప్రభుత్వం మరింత సమయమివ్వాలి రిజిస్ట్రేషన్లకు సంబంధించి చలానా తీద్దామని వెళ్తే సర్వర్ మొరాయించింది. మూడు గంటల పాటు ఇబ్బందిపెట్టింది. రేపు చూద్దామని ఇంటికొచ్చేశా. ఆస్తుల విలువలు పెంచేందుకు ప్రభుత్వం మరింత గడువివ్వాలి. ఇలా పెంచుకుంటూ పోతే రిజిస్ట్రేషన్లంటేనే భయపడాల్సిన పరిస్థితి. – వేల్పుల వెంకటేష్, వ్యాపారి, కరీంనగర్ (27ఎంబీఎన్ఆర్ఎల్13) సర్వర్ పనిచేయట్లేదు ఈ రెండ్రోజులు రైతులు, భూ వ్యాపారులు క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల కోసం ఎక్కువగా వస్తున్నారు. రెట్టింపు సంఖ్యలో దరఖాస్తుదారులు ఉండడంతో రిజిస్ట్రేషన్ల సర్వర్ సరిగా పనిచేయట్లేదు. – అశోక్, మీసేవ నిర్వాహకుడు, కోడేరు, నాగర్‌కర్నూల్ (27ఎంబీఎన్ఆర్ఎల్14) -
ఆర్థికమంత్రి హెచ్చరికలు.. ఒత్తిడిలో ఇన్ఫోసిస్.. నేడు ఆఖరు!
Infosys-Income Tax Portal: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్‌కంట్యాక్స్ పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇన్ఫోసిస్‌కి కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి. సామాన్య ట్యాక్స్ పేయర్ల నుంచి ఆర్థిక మంత్రి వరకు ప్రతీ ఒక్కరు పోర్టల్‌లో ఇబ్బందులపై ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇన్ఫోసిస్‌పై ఒత్తిడి పెరిగింది. నేడే ఆఖరు ఆన్లైన్లో ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపులు చేయవచ్చంటూ కేంద్రం గొప్పగా ప్రకటించింది. అందుకు తగ్గట్టే పోర్టల్‌ని 2021 జూన్ 7న ప్రారంభించింది. అయితే తొలి రోజు నుంచే ఇ ఫైలింగ్ పోర్టల్ ద్వారా పన్ను చెల్లింపులు చేయడం కత్తి మీద సాములా మారింది. చీటికి మాటికి సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామటూ ఆర్థిక మంత్రి పలు మార్లు ప్రకటించారు. కానీ రెండు నెలలు గడిచినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆగస్టు 19న ఇన్పోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌ని ఢిల్లీకి పిలిపించారు మంత్రి నిర్మలా సీతారామన్. సెప్టెంబరు 15వ తేదీలోగా ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలంటూ గట్టిగా చెప్పారు. 750 మంది నిపుణులు ఐటీ పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు 750 మంది నిపుణులు మూడు వారాలుగా అహర్నిషలు పని చేస్తున్నారు. ఇన్ఫోసిస్ సీనియర్ అధికారి ప్రవీణ్‌రావు దగ్గకరుండి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబరు 15తో అయినా ఐటీ పోర్టల్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయా ? లేద మరోసారి పాత కథనే పునరావృతం అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు తరచుగా రావడం, అది దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇన్ఫోసిస్‌కి ఇబ్బందిగా మారింది. 2019లో ప్రారంభం గతంలో ఆధార్ కార్డుకు సంబంధించిన టెక్నికల్ వర్క్ ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలోనే జరిగింది. దీంతో ఇ ఫైలింగ్ పోర్టల్ రూపొందించే బాధ్యతలను కేంద్రం ఇన్ఫోసిస్‌కి 2019లో అప్పగించింది. ప్రస్తుతం ఇ ఫైలింగ్ పోర్టల్‌లో చాలా సమస్యలు కొలిక్కి వచ్చాయని ఇన్ఫోసిస్ అంటోంది. చదవండి: ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు -
అసైన్డ్‌కు ‘ధరణి’ చిక్కులు.. ఆప్షన్లు రాలేదా? మరి ఎలా?
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో అసైన్డ్ భూములకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు. అసైన్డ్ భూములను అమ్ముకునేందుకు, దానం చేసేందుకు వీలు లేని నేపథ్యంలో ఆ మేరకు లావాదేవీలపై మాత్రమే నిషేధం విధించాల్సి ఉండగా ధరణి పోర్టల్‌లో అసైన్డ్ భూములకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు బంద్ అయ్యాయి. కనీసం అసైనీ చనిపోతే సదరు లబ్ధిదారుని వారసునికి ఆ భూమిపై హక్కులు బదిలీ చేసుకునేందుకు కూడా వీలు లేకుండాపోవడంతో రాష్ట్రంలోని పేద రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అయితే, తమ చేతిలో ఏమీ లేదని, సీసీఎల్ఏ స్థాయిలో రావాల్సిన ఆప్షన్లు ఇంకా ఇవ్వలేదని తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. అన్నీ సమస్యలే.. వాస్తవానికి, రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు దాదాపు 25 లక్షల ఎకరాలను అసైన్డ్ చట్టం కింద పంపిణీ చేశారు. ఈ భూముల్లో కొన్ని కబ్జాలకు గురికాగా, రైతుల చేతిలో ఉన్న భూములకు కూడా లావాదేవీలు జరగక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించి దాదాపు 30 శాతం లబ్ధిదారులకు పాస్‌పుస్తకాలు లేవని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. లబ్ధిదారుల పేర్లు ధరణి పోర్టల్‌లో నమోదయ్యాయి కానీ, పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ల డిజిటల్ సంతకాలకు అవకాశం లేకుండా పోయింది. పాస్‌పుస్తకాలు లేని కారణంగా పేద రైతాంగానికి ప్రభుత్వం అందజేసే రైతుబంధు రావడం లేదు. ఈ రైతులు పంటలు సాగు చేసుకునేందుకు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితి. అసైన్డ్ మార్టిగేజ్ ఆప్షన్ అందుబాటులోకి రాకపోవడంతో కోఆపరేటివ్ సొసైటీల్లో తనఖా పెట్టి రుణాలు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. వీటికితోడు రికార్డుల్లో తప్పుల సవరణ, మార్పులుచేర్పుల ఆప్షన్‌ను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. క్రమబద్ధీకరణ ఎప్పుడో? అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధ) చట్టం–1977 ప్రకారమే రాష్ట్రంలోని 6–7 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను అమ్ముకునే వీలుందని భూ చట్టాల నిపుణులు చెపుతున్నారు. ఈ చట్టంలోనే ఆరు రకాల మినహాయింపులు ఇచ్చారని, ఆ భూములను అమ్ముకునే వీలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం కూడా అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై గతంలో ఆలోచన చేసింది. అసైన్డ్ భూముల్లో ఎంత మేరకు లబ్ధిదారుల చేతుల్లో ఉన్నాయి? ఎన్ని ఎకరాలు థర్డ్ పార్టీల చేతుల్లో ఉన్నాయి? తదితర వివరాలను ఏడాది క్రితమే తెప్పించుకుంది. కానీ, క్రమబద్ధీకరణపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ, నిషేధిత చట్టం వర్తించని భూములను అమ్ముకునే అవకాశం కల్పించడంతోపాటు ధరణి పోర్టల్ ద్వారా అసైన్డ్ భూముల లావాదేవీలు గాడిలో పడేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది. -
ధరణి సేవలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: ధరణి సేవలు షురూ అయ్యాయి. దాదాపు 2 నెలలుగా నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ సోమవారం లాంఛనంగా ప్రారంభమ య్యాయి. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో సెప్టెంబర్ 9న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసింది. ధరణి పోర్టల్‌నే భూరికార్డుగా పరిగణిస్తూ సాగు భూముల రిజిస్ట్రేషన్ల సేవలను తహసీల్దారు కార్యాలయంలోనే నిర్వహించేలా గత సెప్టెంబర్‌లో భూహక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం –2020(ఆర్వోఆర్)ను ప్రభుత్వం తెచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించేందుకు తలపెట్టిన ధరణి పోర్టల్‌ను గతనెల 29న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే సాంకేతిక సమస్యలన్నిం టినీ అధిగమించి సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు ఉదయం 10.30 గంటలకే 946 మంది రిజిస్ట్రేషన్ల కోసం ఫీజులు చెల్లించగా... 888 మంది స్లాట్‌బుక్ చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషా బాద్ మండలంలో తొలి రిజిస్ట్రేషన్ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కొనుగోలుదారుకు అందించారు. మండలానికి చెందిన మంచాల ప్రభాకర్ తన భార్య ప్రశాంతి పేరుతో 4 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన భార్యకు డిజిటల్ సంతకంతో కూడిన రిజిస్ట్రేషన్ పత్రాలను సోమేశ్‌కుమార్ అందజేశారు. స్మార్ట్‌గా స్లాట్ బుకింగ్... ధరణి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. స్మార్ట్ ఫోన్ ఉన్న వారెవరైనా నేరుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇది వరకు రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్‌ను సంప్రదించి, కొంత నగదును కమిషన్ రూపంలో ఇస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరితంగా అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొనుగోలు/అమ్మకందారుడెవరైనా నేరుగా స్మార్ట్‌ఫోన్ ద్వారా స్లాట్‌బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కొనుగోలుదారు, అమ్మకందారులిరువురితోనే పూర్తయ్యేలా ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. అలాగే మీసేవా కేంద్రాల్లో కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 1.48 ఎకరాలకు సంబంధించి 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం చేశారు. రిజిస్ట్రేషన్ల సమయంలో ఫింగర్ ప్రింట్ ఎంట్రీలో ఇబ్బందులు తలెత్తితే కంటి చూపు (ఐరిస్) ద్వారా వివరాలు అప్డేట్ చేసేలా వెసులుబాటు కల్పించారు. పారదర్శకంగా పోర్టల్: సోమేశ్‌కుమార్ ధరణి పోర్టల్ పారదర్శకంగా ఉంది. భూముల క్రయవిక్రయదారులు ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా, స్వేచ్ఛగా ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ఉన్న చోట తహసీల్దార్లు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. సాంకేతిక నిపుణులు వాటిని వెంటనే పరిష్కరిస్తారు. రెండుమూడు రోజుల్లో సమస్యలను పూర్తిగా పరిష్కరించి రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై త్వరలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. -
29న ‘ధరణి’ ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ముహూర్తా న్ని ఖరారు చేసింది. ఈ నెల 29న మధ్యా హ్నం 12.30కు సీఎం కేసీఆర్ ఈ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఈ నెల 25న దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని తొలుత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సాంకేతిక సమస్యలు, వరద సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నం కావడంతో ముహూర్తాన్ని 29కు మార్చారు. ఆ రోజు నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసా య భూముల రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నా యి. ప్రస్తుతానికి సాగుభూముల రిజి స్ట్రేషన్లే ప్రారంభించనున్న సర్కారు.. రాష్ట్ర వ్యాప్తంగా 570 మండ లాల్లో దీనికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్‌లో వ్యవసాయ భూములు లేనం దున.. దీని నుంచి మినహాయించారు. -
టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు
న్యూఢిల్లీ: టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన పోర్టల్ (వెబ్సైట్)ను కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో ‘ఆపరేషన్స్ గ్రీన్’ పథకం కింద ప్రభుత్వం సకాలంలో స్పందించి.. అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్ స్టోరేజ్‌లకు తరలించేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది. లేదా మిగులు ఉత్పత్తిని డిమాండ్ ఉన్న చోటుకు తరలించేందుకు సాయమందిస్తుంది’’ అని మంత్రి బాదల్ తెలిపారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ప్రభుత్వం రూపొం దించిన ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఎంఐఈడబ్ల్యూఎస్) అనే పోర్టల్ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుందని నాఫెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే సింగ్ తెలిపారు. -
మొబైల్ పోయిందా? కేంద్రం గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారా? అయితే మీకు ఊరటనిచ్చే వార్త. తస్కరించిన ఫోన్ల ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చుట్టింది. దొంగిలించబడిన మొబైల్స్ రిపోర్టింగ్ కోసం కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ www.ceir.gov.in అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఇఐఆర్) పేరుతో మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా, బిఎస్ఎన్ఎల్ సహకారంతో దీన్ని ప్రారంభించారు. మొబైల్ ఫోన్ల, రీగ్రామింగ్‌తో సహా భద్రత, దొంగతనం, ఇతర సమస్యలను పరిష్కరించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) దీన్ని చేపట్టింది.కోల్పోయిన లేదా కొట్టేసిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను అన్ని నెట్ వర్క్‌లలో బ్లాక్ చేయడం, మొబైల్ ఫోన్లలో కీలకమైన నకిలీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నిరోధించడం, నకిలీ మొబైల్ పరికరాల ఉపయోగాన్ని నిరోధించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యాలు. సీఈఐఆర్ గ్లోబల్ ఐఎమ్ఈఐ డేటాబేస్ కు అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా డేటాబేస్‌లో ఉన్న ఇతర ఐఎంఈఐ సంఖ్యలతో పోల్చి నకిలీ హ్యాండ్సెట్లను గుర్తించడానికి అనుమతిస్తుంది. ఫోన్ పోతే ఫిర్యాదు ఎలా చేయాలి మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా అది ఎవరైనా దొంగిలించినా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆపై 14422 హెల్ప్‌లైన్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్)కి తెలియజేయాలి. దీంతో సత్త్వరమే డాట్ మీ ఫోన్‌ను బ్లాక్ చేస్తుంది. తద్వారా దొంగిలించిన వ్యక్తి లేదా మహిళ ఆ పరికరాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో దీన్ని ఉపయోగించడం కుదరదు. ఈ వ్యవహారంలో బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ డాట్‌కు సహకరిస్తాయి. -
ఆన్లైన్లోనే ఎన్ఆర్ఐ భర్తలకు నోటీసులు
న్యూఢిల్లీ: భార్యలను వేధిస్తున్న, పరారీలో ఉన్న ఎన్ఆర్ఐ భర్తలకు సమన్లు జారీచేసేందుకు పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఒకవేళ నిందితుడు స్పందించకుంటే, అతడిని ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించి, అతడి ఆస్తులను అటాచ్ చేస్తామని తెలిపారు. పోర్టల్ ఏర్పాటుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందన్నారు. పోర్టల్‌లో పొందుపరచిన వారెంట్లను నిందితుడికి జారీచేసినట్లుగానే భావించాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఏర్పాటైన అంతర మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సుల మేరకు 8 మంది నిందితులకు సమన్లు జారీచేసి, వారి పాస్‌పోర్టులు రద్దుచేశామని వెల్లడించారు. -
పద్మ అవార్డులు: సంపూర్ణంగా లేని పోర్టల్ ప్రయోగం
-
ఇంటి నుంచే పౌరసేవలు
విజయనగరం కంటోన్మెంట్: ఇక నుంచి కాగితం, పెన్నూ తీసుకుని దరఖాస్తు రాసి లైన్లో నుంచోవక్కరలేదు. ఇంటి నుంచే మీక్కావాల్సిన సమాచారాన్ని, పౌరసేవలనూ పొందొచ్చు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ రూపొందిస్తున్న వెబ్‌సైట్‌లోకెళ్తే చాలు మీక్కావల్సిన సమాచారం వస్తుంది. పలు సేవలకోసం అప్లై చేసుకోవచ్చు. లేదా నేరుగా పలు పౌరసేవలను కూడా పొందవచ్చు. అంతే కాకుండా టూరిజంకు సంబంధించిన అన్ని వివరాలనూ పొందవచ్చు. అన్ని రకాల సేవలనూ ఈ పోర్టల్ ద్వారా పొందేవిధంగా తయారు చేస్తున్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల పేరున పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందు పరుస్తారు. దీనికి సంబంధించి ప్రస్తుతం డేటా సేకరణ జరుగుతోంది. కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ బి రామారావు, డీఆర్వో హేమసుందర్‌లను ఆర్బివా టెక్నాలజీస్ మేనేజర్ ప్రభాకర రావు గురువారం కలిసి పోర్టల్ సమగ్ర స్వరూపాన్ని వారికి వివరించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని శాఖల సమాచారాన్ని పొందడానికి అనుమతుల కోసం వచ్చామని ఆయన తెలిపారు. దీని ప్రోమోను కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ బి రామారావులకు చూపించారు. దీంతో కలెక్టర్ డేటా సమకూర్చే బాధ్యతను డీఆర్వోకు అప్పగించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ పోర్టల్ ద్వారా ఆధార్ నమోదు, ఈ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని మేనేజర్ ప్రభాకరరావు తెలిపారు.