అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ శ్రమ్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న వారి సమాచారం సేకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయం, నష్ట పరిహారం నేరుగా కార్మికులకు అందించేందుకు ఈ శ్రమ్ పోర్టల్ దోహదపడుతుంది. తుపానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం సాయం అందించాలంటే తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ తమ సిబ్బందితో ముందుగా సర్వే నిర్వహిస్తారు.
బాధిత కార్మికుల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం నష్టపరిహారం మంజూరవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ విధమైన సర్వేలో అవకతవకలు జరగడానికి, అలాగే అసలైన కార్మికులకు కాకుండా అనర్హులను జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అదే ఈ శ్రమ్ పోర్టల్‌లో అసంఘటిత కార్మికులు తమ వివరాలను నమోదు చేసుకుంటే విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో ఎంత మంది ఆసంఘటిత కార్మికులు ఉన్నారన్న విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ఉంటే కార్మికులు ప్రభుత్వ పథకాలను సులువుగా పొందవచ్చు. ఈ గుర్తింపు కార్డు దేశంలో ఎక్కడైనా పనిచేస్తుంది.
ఈ శ్రమ్ కార్డు అంటే...
ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆధార్ నంబర్‌లా దేశ వ్యాప్తంగా కార్మికుడికి ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. 12 అంకెల నంబర్‌తో గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అనేక పథకాలు ప్రారంభిస్తున్నప్పటికీ చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కానీ ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే కార్మికుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. మెరుగైన ఉపాధి అవకాశాలకు నైపుణ్యాల అభివృద్ధికి సహాయం లభిస్తుంది.
కార్డుతో ప్రయోజనాలు
- అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారికి రూ.2 లక్షల ప్రమాదబీమా సౌకర్యం లభిస్తుంది. అంగవైకల్యం పొందితే రూ.లక్ష లభిస్తుంది.
నమోదు కావాలంటే...
- ఈశ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.
- అర్హులైన వారు సమీప మీ సేవ, సీఎస్‌సీ సెంటర్లు, గ్రామ వార్డు సచివాలయాలు, పోస్టాఫీసుల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు
- ఈ పథకంలో నమోదు కొరకు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది
- కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికులు/నామిని ఖాతాకు జమ అవుతుంది.
- మరిన్ని వివరాలకు జిల్లా ఉప కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.
అసంఘటిత కార్మికులంటే ఎవరు?
ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని ప్రతి కార్మికుడు అసంఘటిత కార్మికుడే. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ రంగ కూలీలు, ఇళ్లల్లో, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి కార్మికులు, వలస కార్మికులు, డొమెస్టిక్, అగ్రికల్చర్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, ఆశ వర్కర్లు, అంగనవాడీ వర్కర్లు, మత్స్యకార్మికులు, ప్లాంటేషన్ వర్కర్స్, పాల వ్యాపారులు, చిరు వ్యాపారులు, ట్యూషన్ టీచర్లు, చేతి వృత్తుల వారు, కార్పెంటర్లు, ప్లంబర్స్ ఇలా చాలా రకాల పనులు చేసే కార్మికులు అసంఘటిత రంగంలోకి వస్తారు.
(చదవండి: గొప్ప యజ్ఞాన్ని అడ్డుకోవాలని చూశారు, కానీ.. ఆపలేకపోయారు: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment