విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక సాయం లేదు | no financial aid for students in Andhra pradesh | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక సాయం లేదు

Published Wed, Nov 20 2024 5:19 AM | Last Updated on Wed, Nov 20 2024 5:20 AM

no financial aid for students in Andhra pradesh

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్‌ సమాధానం

2019–24 మధ్య జరిగిన మేలు చెప్పడానికి ఇష్టపడని సర్కారు

‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అంటూ సమాధానం దాటవేత

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు తమ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయడంలేదని మంత్రి లోకేశ్‌ ఓ పక్క స్పష్టంగా చెబుతున్నారు. పోనీ, 2019–24 మధ్య గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఎటువంటి మేలు జరిగిందో చెప్పడానికి కూటమి సర్కారుకు నోరు రావడంలేదు. అసలు సమాధానం చెప్పడానికే అంగీకరించలేదు. మంగళవారం శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం అనుసరించిన తీరిది. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, బి.విరూపాక్షి, డాక్టర్‌ దాసరి సుధ, ఎం. విశ్వేశ్వరరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సభలో చర్చించనేలేదు.

రాతపూర్వకంగా సమాధానమిచ్చి ‘చెప్పినట్టే’ భావించాలని పేర్కొన్నారు. 2019–24 మధ్య కాలంలో లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలు, విడుదల చేసిన మొత్తం ఎంతో చెప్పాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగానూ వివరాలు ఇవ్వలేదు. ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అంటూ సమాధానం దాటవేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ శాసన సభకు వివరించారు. తల్లికి వందనం అనే కొత్త పథకాన్ని రూపొందిస్తున్నామని, త్వరలో వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వంలో డ్వాక్రాకు రూ.3,541.27 కోట్లు
గత ఆర్ధిక సంవత్సరంలో సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలు చేసే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన జవాబు ఇవ్వలేదు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏడాది పాటు సకాలంలో రుణాలు చెల్లించే వారికి ఏప్రిల్‌ నెలలో వడ్డీ డబ్బులు జమ చేసేది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ వడ్డీ డబ్బులు చెల్లించలేదు.

దీనిపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సభలో సమాధానం చెప్పకుండా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. వడ్డీ లేని రుణాల అమలుకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.950 కోట్లు సమకూర్చినట్టు చెప్పారు. 2019–24 మధ్య ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ.3,541.27 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 2023–24లో రూ.1,400 కోట్లు చెల్లించాల్సి ఉండగా, నిధులు విడుదల కాలేదన్నారు.

అంతర్‌ రాష్ట్ర ఉద్యోగుల మార్పిడిపై రెండు కమిటీలు: మంత్రి పయ్యావుల కేశవ్‌
అంతర్‌ రాష్ట్ర ఉద్యోగుల మార్పిడిలో ఇబ్బందులను అధిగమించేందుకు ఇరు రాష్ట్రాల సీనియర్‌ అధికారులు, మంత్రులతో రెండు కమిటీలు వేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. వన్‌ టైం చర్యలో భాగంగా అంతర్‌ రాష్ట్ర బదిలీ కోసం తెలంగాణ ప్రభుత్వ సమ్మతి కోరామని, స్పందన రావాల్సి ఉందని అన్నారు. తెలంగాణ నుంచి 1,447 మంది ఉద్యోగులు ఏపీకి వచ్చేందుకు విల్లింగ్‌ ఇచ్చారని, ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్లేందుకు 1,942 మంది అంగీకరించగా, అక్కడి స్థానికత గలవారు 1,042 మంది ఉన్నట్టు చెప్పారు.

రూ.284 కోట్లతో కాల్వల నిర్వహణ: జలవనరులశాఖ మంత్రి నిమ్మల
గత ఐదేళ్లలో ప్రాజెక్టులు, డ్రెయిన్స్‌ సరిగా నిర్వహించలేదని, విధ్వంసం జరిగిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సాగు నీటి కాల్వలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. రిపేర్లు, అత్యవసర గండ్లు పూడ్చడం, గట్లు బలోపేతం చేపట్టలేదని, పులిచింతల గేట్లు, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకు పోయాయని, అన్నమయ్యప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 42 మంది ప్రాణాలు పోయాయన్నారు. లస్కర్లకు ఏడాది నుంచి జీతాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 1,040 లిఫ్టు పథకాలు ఉంటే 450 మూతపడ్డాయన్నారు.

వీటి నిర్వహణకు ఏడాదికి రూ.983 కోట్లు కేటాయించాలని ప్లానింగ్‌ కమిషన్‌ సూచిస్తే ఐదేళ్లలో రూ.125 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 2014–19 మధ్య క్యాపిటల్‌ హెడ్, మెయింటెనెన్స్‌ ఇతరత్రాకు రూ.5,091 కోట్లు కేటాయిస్తే గత ఐదేళ్లలో రూ.1,340 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రూ. 284.04 కోట్లతో సాగునీటి కాల్వల నిర్వహణ చేపడతామని తెలిపారు. అడవిపల్లి రిజర్వాయర్‌పై ప్రాజెక్టు పూర్తయిందని, కానీ, రిజర్వాయర్‌కు నీటిని తీసుకొచ్చే కాల్వల పనులను గత ప్రభుత్వం చేపట్టలేదని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.

గిరిజన డ్వాక్రా సంఘాలకు బకాయిల్లేవు : మంత్రి సంధ్యారాణి
ఐటీడీఏల పరిధిలోని డ్వాక్రా గ్రూపులకు 2019–24 మధ్య ప్రభుత్వం నుంచి ఎలాంటి బకాయిలు లేవని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్‌రాజు, డాక్టర్‌ వాల్మీకి పార్థసారధి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం గిరిజన యువతకు శిక్షణ ఇవ్వలేదని, కాఫీని ప్రోత్సహించలేదని అన్నారు.

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు: మంత్రి వాసంశెట్టి సుభాష్‌
రాష్ట్రంలోని 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తెలిపారు. వీరి నుంచి రూ.100 చొప్పున కార్మిక సంక్షేమ మండలికి చెల్లిస్తారని, ప్రస్తుతం బోర్డులో రూ.40.89 కోట్లు ఉన్నాయని తెలిపారు. 2007నుంచి  క్లెయిమ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని, రూ.7.38 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిని పరిశీలించి ఇవ్వాలన్నారు. 

చేనేతకు గత టీడీపీ పథకాలన్నీఅమలు చేస్తాం: మంత్రి సవిత
గత ఐదేళ్లలో చేనేత కార్మికుల పరిస్థితి బాగాలేదని, కొన్నిచోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత చెప్పారు. చేనేత కార్మికులకు నూలు, విద్యుత్, ఇంధనం, షెడ్ల నిర్మాణానికి రాయితీలు, శిక్షణ, ముడి సరుకు సరఫరా, అమ్మకాలు, మార్కెటింగ్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. చేనేతకు గత టీడీపీ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. 2019 తర్వాత వైఎస్‌ జగన్‌ నేతన్నలను మోసం చేశారన్నారు. 86 వేల మందికి నేతన్న నేస్తం అందించారని, అవన్నీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారన్నారు.

ఆక్వాకు ఇంధన సబ్సిడీ ఇవ్వలేం: మంత్రి గొట్టిపాటి రవికుమార్‌
ఆక్వా రైతులకు షరతుల్లేకుండా విద్యుత్‌ సబ్సిడీని వర్తింపజేసే ప్రతిపాదన ఏదీ లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్‌ రూ.1.50 కే విద్యుత్‌ ఇవ్వడంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని, ప్రస్తుతం డిస్కంలు రూ.1.12 లక్షల కోట్ల అప్పులతో ఉన్నాయని తెలిపారు. 2019 నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ఆక్వా రైతుల నుంచి అందనంగా డబ్బులు వసూలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జీవోలతో గందరగోళం సృష్టించిందన్నారు. డిస్కంలకు రూ.1,990 కోట్లు బాకీ పెట్టారని చెప్పారు. 2018–19లో 46,329 మంది రైతులకు విద్యుత్‌ సబ్సిడీ ఇస్తే.. 2022–23లో 31 వేల మందికి తగ్గిపోయిందన్నారు.

మీరు కట్టింది ఏ చీర?
ఎమ్మెల్యేని ఆరా తీసిన డిప్యూటీ స్పీకర్‌ చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలపై మంత్రి సవిత సమాధానం చెప్పిన అనంతరం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అనుబంధ ప్రశ్నపై మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ముడి సరుకుల ధరలు పెరిగిపోయాయని, ఉత్పత్తుల ధరలు పెరగట్లేదని అన్నారు. 50 శాతం మగ్గాలు మూతపడ్డాయన్నారు. నేతన్నలకు నెలకు నికర ఆదాయం రూ.10 వేలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ముడిసరుకుపై సబ్సిడీ పెంచాలని, నేత కార్మికుల షెడ్లకు బడ్జెట్‌ ఇవ్వాలంటూ పలు సూచనలు చేశారు. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు వారిస్తూ.. ప్రశ్నోత్తరాల సమయంలో సూచనలు ఇవ్వొద్దని అన్నారు. ఇప్పటికే ఎక్కువ చేశారంటూ అడ్డుకున్నారు. నెలలో ఒక రోజు చేనేత వస్త్రాలు వేసుకునేలా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సూచనలు చేయా­లని మాధవి సూచించగా.. డిప్యూటీ స్పీకర్‌ మాట్లాడుతూ ‘మీరు సభకు ఇప్పు­డు చేనేత వేసుకున్నారా? మీ శారీ చేనేతేనా?’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ‘చేనేతే’ అని బదులివ్వడంతో ‘సంతోషం’అంటూ నిట్టూర్చారు.

ఎంతమంది పిల్లలున్నా సహకార ఎన్నికల్లో పోటీ! 
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌), జిల్లా సహకారం కేంద్రం బ్యాంక్‌ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (డీసీఎంఎస్‌) ఎన్నికల్లో పోటీకి అర్హత కలి్పస్తూ ఏపీ సహకార సంఘాల చట్టంలో సవరణలు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం శాసన సభలో ప్రకటించారు. అదే విధంగా సహకార చట్టంలో రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేసినట్లు వివరించారు. ఈ సవరణలకు సంబంధించిన ఏపీ సహకార సంఘాల సవరణ బిల్‌–2024ను శాసన సభలో అచ్చెన్న ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. అదే విధంగా ఏపీ ఎక్సైజ్‌ సవరణ బిల్‌–2024, ఏపీ(ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్, ఫారిన్‌ లిక్కర్‌ ట్రేడ్‌ రెగ్యులేషన్‌) సవరణ బిల్‌–2024, ఏపీ మద్య నిషేధ సవరణ బిల్‌–2024ను అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement