న్యూఢిల్లీ: టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన పోర్టల్ (వెబ్‌సైట్)ను కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో ‘ఆపరేషన్స్ గ్రీన్’ పథకం కింద ప్రభుత్వం సకాలంలో స్పందించి.. అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్ స్టోరేజ్‌లకు తరలించేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది.
లేదా మిగులు ఉత్పత్తిని డిమాండ్ ఉన్న చోటుకు తరలించేందుకు సాయమందిస్తుంది’’ అని మంత్రి బాదల్ తెలిపారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ప్రభుత్వం రూపొం దించిన ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఎంఐఈడబ్ల్యూఎస్) అనే పోర్టల్ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుందని నాఫెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌కే సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment