శిశువుల పాలిట యమపురి!
రిమ్స్ క్యాంపస్, సంతకవిటి: కారణాలు ఏవైనా కావచ్చు.. ఎన్నయినా ఉండొచ్చు. కానీ ఏడాదిలో ఒక ఆస్పత్రిలో 262 మంది శిశువులు మరణించడం చిన్న విషయం కాదు. శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అందుకు తగినట్లే శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చిన్నపిల్లల అత్యవసర వార్డు(ఎస్‌ఎన్‌సీయూ లేదా ఎన్‌ఐసీయూ)లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులను నియమించినా ఇంత పెద్ద సంఖ్యలో శిశు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి?.. దీనికి ప్రధాన కారణం వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవడమే. ఇక్కడికి వచ్చేవన్నీ అత్యవసర కేసులే. తక్షణం స్పందిస్తేనే ఆ చిన్ని ప్రాణాలు నిలుస్తాయి.. కానీ దురదృష్టవశాత్తు రిమ్స్‌లో ఆ స్పందనే కరువవుతోంది. చిన్నారుల ఉసురు తీస్తోంది.
మా తప్పేం లేదు
రిమ్స్‌లో చిన్నారులకు వైద్య సేవలందిచేందుకు ఎన్.ఆర్.సి,, ఎస్.ఎన్.సి.యు విభాగాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు చిన్న పిల్లల వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. అన్నీ ఉన్నా.. కీలకమైన వైద్యసేవలు మాత్రం ఆశించిన స్థాయిలో అందడం లేదు. ఫలితంగా ఎప్పటికప్పుడు చిన్నారులు మృత్యువాత పడుతునే ఉన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తమ చేతుల్లో ఏమీ లేదని, చివరి క్షణంలో ఆస్పత్రికి తీసుకువస్తున్నారని వైద్యాధికారులు తేల్చేస్తున్నారు. శిశువు మరణిస్తే దాన్ని తమ తప్పుగా భావించటం సరికాదంటున్నారు.
గ్రీవెన్సుసెల్‌లో ఫిర్యాదు
వైద్యం అందించినా ప్రాణాలు దక్కకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. రిమ్స్‌లో సరైన వైద్య సేవలు అందించకపోవటం వల్లే తమ చిన్నారి మృతి చెందిం దంటూ కొద్ది నెలల కిందట ఆమె తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ ఒక జిల్లా స్థాయి అధికారితో విచారణ జరిపించారు. అయితే విచారణ జరిపిన సదరు అధికారి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని భావించి రిమ్స్ అధికారుల నిర్లక్ష్యాన్ని, పలు సమస్యలను గుర్తించినా వాటిని బయట పెట్టలేదు. మరోవైపు ఆస్పత్రిలో తమ పిల్లలు చనిపోయినా బయటకు చెప్పేవారు చాలా తక్కువమందే. అందువల్లే రిమ్స్‌లో నిర్లక్ష్యపు జబ్బు రోజురోజుకు పెరిగిపోతోంది.
ఆదివారం ఆటవిడుపే
ఆదివారం ఆటవిడుపు అన్న పదం రిమ్స్ వైద్యాధికారులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. ఇక్కడ పలువురు వైద్యులు సాధారణ రోజుల్లోనే అందుబాటులో ఉండరు. ఇక ఆదివారం అయితే అసలు కనిపించరు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో సగానికిపైగా విశాఖపట్నం నుంచి రోజూ రాకపోకలు సాగిస్తుం టారు. ఇక మధాహ్నం ఒంటి గంట దాటిన తరువాత ఈ విభాగంలో వైద్యులు కనిపించడం గగనమే. దాంతో మధ్యాహ్నం తర్వాత వచ్చే అత్యవసర కేసులన్నింటికీ దిగువస్థాయి సిబ్బందే తమకు తోచిన వైద్యం అందిస్తున్నారు. వారికి అర్థం కానప్పుడు సంబంధిత వైద్యులను ఫోన్‌లో సంప్రదించి వారి సూచనల ప్రకారం మందులు ఇస్తున్నారు. ఈ క్రమంలో పలు కేసులను వైజాగ్ కేజీహెచ్‌కు రిఫర్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఎస్‌ఎన్‌సీయూలో నలుగురు వైద్యులు ప్రత్యేకంగా ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉన్నారు.
మురికికూపంలా వార్డు పరిసరాలు
ఎస్‌ఎన్‌సీయూ విభాగాన్ని అపారిశుద్ధ్యం కూడా పీడిస్తోంది. ఈ విభాగంలోని చెత్తాచెదారాన్ని కిటికీల్లోంచి పక్కనే పారబోస్తుండటంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. అపారిశుద్ధ్యం కారణంగా చిన్నారులు మరింత అస్వస్థతకు గురయ్యే ప్రమాదముంది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎన్.ఆర్.సి పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ విభాగంలో మూడు ఏసీలు ఉండగా ఒకటి మాత్రమే పనిచేస్తోంది. వీరికందే పౌష్టికాహారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. చిన్నారులకు సరైన వైద్య సేవలు అందని కారణంగా చాలామంది రిమ్స్‌కు రావటానికి భయపడుతున్నారు.
బాలల హక్కుల క మిషన్‌కు ఫిర్యాదు చేస్తా : చిన్నికృష్ణ
సమాచార హక్కు చట్టం ద్వారా తనకు అందిన సమాచారం ఆధారంగా బాల ల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చిన్నికృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. తన కుమారుని విషయంలో చోటు చేసుకున్న వైద్య సేవల లోపంపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానన్నారు. రిమ్స్ ఎన్‌ఐసీయూలో వైద్యసేవలు సక్రమంగా అందడంలేదని ఆరోపించారు.