RIMS campus
-
రిమ్స్‌లో భయానక వాతావరణం..
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భయానక వాతావరణం నెలకొంటోంది. కొందరు సీనియర్లు జూనియర్లను చిత్ర హింసలకు గురిచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజులపాటు ఓ గదిలో బంధించి క్రికెట్ స్టంప్లతో కొట్టడంతో వారు గాయపడ్డారు. వారికి కనీసం తిండి కూడా పెట్టకుండా, దుస్తులు ఊడదీసి చిత్రహింసలకు గురిచేసినట్టు సమాచారం. భయభ్రాంతులైన వీరు సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించారు. అలాగే జరిగిన విషయాన్ని రిమ్స్ కళాశాల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇరు వర్గాలను రాజీ చేసే ప్రయత్నాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దెబ్బలు తిన్న, దాడి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, మాట్లాడి పంపించేసినట్లు కొందరు విద్యార్థులు చెబుతున్నారు. సీనియర్లు కొట్టిన దెబ్బలకు జూనియర్ విద్యార్థుల శరీరంపై గాయాలు రిమ్స్ కళాశాలలోనే చదువుతున్నప్పటికీ హాస్టల్లో ఉండడానికి అనుమతిలేని ఓ విద్యార్థి గడిచిన కొన్నేళ్లుగా హాస్టల్లోనే ఉంటూ కొందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడన్న ఆరోపణలువినిపిస్తున్నాయి. సదరు విద్యార్థి పరీక్షలకు హాజరు కాకుండా, వ్యసనాల బారిన పడినట్లు కూడా తెలియవచ్చింది. ఇదే విషయం రిమ్స్ అధికారులకు కూడా విద్యార్థులు చెప్పగా దానిని కూడా సర్దిచెప్పినట్లు జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యార్థి తరచూ ఎవరో ఒకరితో గొడవపడుతూ వారు తిరగబడిన పక్షంలో తన వెనుక రౌడీలు ఉన్నారని బెదిరించినట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లో కొందరు యువకులను కూడా హాస్టల్ వద్దకు తీసుకొచ్చి బెదిరించినట్లు జూనియర్లు చెబుతున్నారు. ప్రస్తుత సంఘటనలో.. ఎవరికైనా చెబితే రౌడీలతో కొట్టిస్తానని బెదిరించడంతో బాధితులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లి ప్రైవేటుగా ఉంటున్న కొందరు స్నేహితుల ఇంటిలో తలదాచుకుంటున్నారు. రిమ్స్ అధికారులు వారికి కబురుపెట్టి, దాడి చేసిన విద్యార్థి తల్లిదండ్రుల ఎదుట హాజరుపరచి రాజీ ధోరణిలో మాట్లాడినట్లు కొందరు వైద్య విద్యార్థులు చెబుతున్నారు. కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్‌లో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యే ప్రమాదముంటుందని అంటున్నారు. అనధికారికంగా ఓ విద్యార్థి హాస్టల్లో ఉంటున్న విషయం గుర్తించలేకపోవడాన్ని కూడా వారు ఆక్షేపిస్తున్నారు. తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం ఇద్దరు విద్యార్థులను సీనియర్లు కొట్టిన విషయాన్ని వారి తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాం. కొట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం. దాడి చేసిన విద్యార్థిని పంపించేశాం. ప్రస్తుతం విద్యార్థులంతా సంతోషంగానే ఉన్నారు. – డాక్టర్ కృష్ణవేణి, ప్రిన్సిపాల్, రిమ్స్ వైద్య కళాశాల అనధికారికంగా ఉంటున్న విషయం తెలీదు రిమ్స్ వైద్య కళాశాల హాస్టల్లో అనధికారికంగా ఉంటున్న విద్యార్థి విషయం విద్యార్థులు గాని, సిబ్బంది గాని నా దృష్టికి తీసుకురాలేదు. విద్యార్థులు ఫిర్యాదు చేసిన వెంటనే హాస్టల్ నుంచి పంపించేశాం. అతనిని హెచ్చరించాం. ఇక మీదట ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.– డాక్టర్ బోర ప్రసాద్, వార్డెన్ -
ఎంబీబీఎస్.. మ.. మ.. మాస్!
వారంతా రేపటి ప్రాణదాతలు.. నాడిని పరీక్షించాల్సిన భావి వైద్యులు. రోగులు దైవంగా భావించే వృత్తిని చేపట్టా ల్సిన వారు. కానీ, పరీక్షల సమయంలోనే పెడదారి పట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం దుర్వినియోగపర్చారు. సెల్ఫోన్ల సాయంతో ఎంచక్కా మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. నిబంధనలకు కాలదన్ని పరీక్ష హాల్లోకి స్మార్ట్ఫోన్లు తెచ్చారు. వాట్సప్ ద్వారా ప్రశ్నలను స్నేహితులకు పంపి, జవాబులు తెప్పించుకొని మరీ రాస్తున్నారు. ఇది తప్పని చెప్పాల్సిన వైద్య కళాశాల అధికారులే వారికి సహకరించారు. ఒంగోలు రిమ్స్ వెద్య కళాశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ తంతు సోమవారం కొత్త అబ్జర్వర్ రాకతో బట్టబయలైంది. వెంటనే అప్రమత్తమైన కళాశాల అధికారులు విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అజ్జర్వర్ నోటికి సైతం తాళం వేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు ఇలా పరీక్షల్లోనే కాపీ కొడితే ఇక ప్రజల ప్రాణాలేం కాపాడతారు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. సాక్షి, ఒంగోలు సెంట్రల్: జిల్లా కేంద్రం ఒంగోలులోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గత నాలుగు రోజులుగా ఎంబీబీఎస్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి మొత్తం మూడు బ్యాచ్‌ల విద్యార్థులు ఎంబీబీఎస్ థియరీ సప్లిమెంటరీ, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు 19 మంది, సెకండ్ ఇయర్లో ఒక విద్యార్థి, మూడో సంవత్సరం విద్యార్థులు ఏడుగురు తాము ఫెయిల్ అయిన పరీక్షలను రాస్తున్నారు. మొత్తం 27 మంది వైద్య విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలను రాస్తున్నారు. సోమవారం ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫోరెన్సిక్, ఈఎన్టి, పీడియాట్రిక్ పరీక్షలు జరిగాయి. వైద్య కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపల్ వీటిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్ యూనివర్సిటీ నుంచి సోమవారం నెల్లూరుకు చెందిన ఒక ప్రొఫెసర్ అబ్జర్వర్‌గా వచ్చారు. అబ్జర్వర్ రాకతో పట్టుబడిన వైద్య విద్యార్థులు ఈనెల 21వ తేదీ నుంచి వైద్య పరీక్షలు జరుగుతున్నా, ఎక్సటర్నల్ పరీక్షల అబ్జర్వర్ సోమవారం రావడంతో వైద్య విద్యార్థుల కాపీయింగ్ గుట్టు రట్టయింది. ఈ పరీక్షలలో ఫైనల్ ఇయర్‌కు చెందిన ఎనిమిది మంది కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు నెల్లూరు నుంచి వచ్చిన యూనివర్సిటీ అబ్జర్వర్ గుర్తించారు. ఆయన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విద్యార్థుల నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్ ద్వారా విద్యార్థులు ప్రశ్న పత్రాలను బయట వారి స్నేహితులకు పంపి, అక్కడి నుంచి సమాధానాలను తిరిగి పొందుతున్నట్లు గుర్తించారు. కొంత మంది విద్యార్థుల వద్ద కాపీయింగ్ స్లిప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొదట ఓ విద్యార్థి వద్ద సెల్‌ఫోన్‌ను చూసిన అబ్జర్వర్, ఇతర విద్యార్థులను తనిఖీ చేయగా ఇంకొందరి వద్ద కూడా సెల్ఫోన్లు ఉన్నాయి. దీంతో అబ్జర్వర్ వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. ఎరేజర్ పై కాపీ రాసిన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి, అప్రమత్తమైన వైద్య కళాశాల అధికారులు అబ్జర్వర్‌తో మాట్లాడి, కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థులను డీబార్ కాకుండా కాపాడారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లా.. సెల్ఫోన్లను పరీక్ష హాలులోకి తీసుకు రాకూడదనే నిబంధన ఉన్నా వైద్య కళాశాల అధికారులు, నిబంధనలను తుంగలో తొక్కారు. సెల్ఫోన్లను పరీక్షల గదిలోకి అనుమతించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. పరీక్షల గదిలో సీసీ కెమెరాలు ఉన్నా కాపీయింగ్ విషయం వాటి కంట పడకుండా అధికారులు మేనేజ్ చేసినట్లు సమాచారం. విద్యార్థుల నుంచి డబ్బు దండుకుని వైద్య కళాశాల అధికారులే ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారే సోమవారం కాపీయింగ్‌ను గుర్తించిన అబ్జర్వర్‌ను బతిమాలి చర్యలు లేకుండా చూశారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో రోజూ ఇదే తంతు కొనసాగిందని వైద్య కళాశాలలోని కొందరు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. స్పందించని ప్రిన్సిపల్.. పరీక్షల్లో వైద్య విద్యార్థులు కాపీయింగ్ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ప్రిన్సిపల్ అందుబాటులోకి రాలేదు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున నగదు చేతులు మారిన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. -
'పల్స్‌పోలియో' విజయవంతానికి ఏర్పాట్లు
రిమ్స్‌క్యాంపస్: జాతీయ ఇమ్యూనైజేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రెడ్డి శ్యామల తెలిపారు. సోమ, మంగళవారాల్లో కూడా ఇంటింటికీ సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి కూడా చుక్కలు వేస్తారని చెప్పారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణపై శనివారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 27,48,177 మంది జనాభా ఉన్నారని, వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులు 2,42,897 మంది ఉన్నట్టు చెప్పారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ప్రాంతంలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1606 కేంద్రాలు, సంచార కేంద్రాలపై శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. పోలియో వ్యాక్సిన్, బ్యానర్ల పంపిణీ 95 శాతం పూర్తయ్యిందన్నారు. హై రిస్క్ ఏరియాను కూడా కవర్ చేసినట్టు చెప్పారు. పోలియో చుక్కలు వేయించుకున్న పిల్లలకు ఏదైనా సమస్య వస్తే ఫోన్ : 08942-229945 నంబరులో వైద్యశాఖాధికారిని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారుల సెల్ : 9963994336, 9963994337 నంబర్లలో సంప్రదించాలన్నారు. జిల్లాలో పోలియో సమస్యాత్మాక ప్రాంతాల్లో 5,739 మంది బాలబాలికలను గుర్తించినట్టు చెప్పారు. వారికి చుక్కలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాఖ ప్రాంతీయ సంచాలకులు గోపాలకృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ జగన్నాథరావు, ఏడీఎం సీహెచ్ శారద, తదితరులు పాల్గొన్నారు. -
వైద్యమో.. రామచంద్రా!
రిమ్స్ క్యాంపస్: రాత్రి 9 గంటలు: జాతీయ రహదారిపై పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108లో రిమ్స్‌కు తీసుకొచ్చారు,9:20: డ్యూటీలో ఉన్న క్యాజువాల్టీ డాక్టర్ వారిని పరిశీలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో సంబంధిత వైద్యులను ఫోన్ చేసి పిలిచారు.9:45: వైద్యులు హుటహుటిన రిమ్స్‌కు చేరుకుని వైద్య సేవలందించి క్షతగాత్రుల ప్రాణాలు కాపాడారు...వారు స్థానికంగానే నివసిస్తున్న రెగ్యులర్ వైద్యులు కావడం వల్లే అత్యవసర సమయంలో క్షణాల్లో ఆస్పత్రిలో వాలిపోయి చికిత్స అందించారు. ప్రాణాలు పోకుండా కాపాడారు. మిగతా వైద్యుల్లో చాలా వరకు విశాఖ, తదితర దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నవారే. ఈ రెగ్యులర్ వైద్యుల సేవలు 20 రోజుల్లో దూరం కానున్నాయి. చుట్టపుచూపు వైద్యమే గత్యంతరం కానుంది. అదేంటి అంటారా.. 785 జీవోతో షాక్ జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఐదేళ్లకుపైగా సర్వీసు ఉన్న వైద్యులను బదిలీ చేయనుండటంతో వైద్యం కోసం డాక్టర్లను వెత్తుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడనుం ది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 785 ప్రకారం రాష్ట్రంలో వైద్య కళాశాలలను ఎ, బి, సి కేటగిరీలుగా విభజించారు. వీటిలో ఐదేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న వైద్యులను బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ ప్రకారం చూస్తే పాత జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి ప్రస్తుత రిమ్స్‌లోనూ కొనసాగుతున్న 17 మంది రెగ్యులర్ వైద్యులు ఈ కోవలోకి వస్తారు. దాంతో వీరి బదిలీకి రంగం సిద్ధమైంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ బదిలీల ఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే సెమీ అటానమస్ సంస్థగా ఉన్న రిమ్స్ కళాశాల వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల నుంచి స్ధానికంగా ఉంటూ రాత్రి పగలు అన్న తేడా లేకుండా రోగులకు వైద్యం అందిస్తున్న రెగ్యులర్ డాక్టర్లను బదిలీ చేయాలన్న నిర్ణయం చర్చనీయాంశమైంది. విశాఖ వైద్యులు వస్తే అంతే.. ఈ 17 మంది వైద్యులను బదిలీ చేస్తే వారి స్థానంలో ఎక్కువ మంది విశాఖపట్నం నుంచే వచ్చే అవకాశముంది. విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలల్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులను కూడా బదిలీ చేయనుండటమే దీనికి కారణం. వారు తమ అప్షన్‌గా అత్యంత చేరువలో ఉన్న శ్రీకాకుళం రిమ్స్‌నే ఎంచుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే విశాఖ నుంచి బదిలీపై వచ్చే వారు స్థానికంగా ఉండే పరిస్ధితి లేదు. విశాఖపట్నంలో ఉన్నవారంతా ప్రైవే ట్ ఆస్పత్రుల్లో పని చేస్తుండటమో.. సొంతంగా క్లినిక్‌లు నడుపుకోవడమో చేస్తున్నారు. వారు ఇక్కడికి బదిలీ అయినా వాటిని వదులుకోకుండా రోజూ విశాఖ నుంచి రాకపోకలు సాగించడం తథ్యం. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో రిమ్స్‌లో పని చేస్తున్న చాలా మంది విశాఖ వైద్యులు స్ధానికంగా ఉండకుండా నిత్యం రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్థానిక వైద్యుల స్థానంలో విశాఖ డాక్టర్లు వస్తే.. దాదాపు వైద్యులందరూ అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. రోగులకు తిప్పలు తప్పవు. దీర్ఘకాలిక సెలవులు ఖాయం కాగా బదిలీ అయ్యే రెగ్యులర్ వైద్యులు లాంగ్‌లీవ్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటికీ కాదంటే రాజీనామాలు చేసేందకు కూడా వారు సిద్ధంగా ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా తెలిసింది. తమను బదిలీ చేయడం అన్యాయమన్న భావనలో ఉన్న వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం దారుణం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి స్థానికంగా ఉంటూ ఏ సమయంలోనైనా వైద్య సేవలందిస్తున్న వైద్యులను బదిలీ చేయాలన్న నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇప్పటికే రిమ్స్‌లో అంతంత మాత్రంగా సేవలందుతున్నాయన్న చెడ్డపేరుంది, ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని స్థానికంగా ఉంటున్న వైద్యుల బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. -డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ లూకలపు ప్రసన్నకుమార్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు -
ఏమిటీ గ‘లీజు’..?
ఈ దుకాణాన్ని చూశారా..శ్రీకాకుళం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉంది. స్వప్న హెయిర్ స్టైల్స్ పేరుతో..ఓ సెలూన్‌ను నిర్వహిస్తున్నారు. దీనిని..మాజీ కౌన్సిలర్ లండ శ్రీను..మున్సిపాలిటీ నుంచి లీజుకు తీసుకున్నారు. అయితే..దీనిని ఆయన నిర్వహించకుండా..టి.నాగరాజు అనే వ్యక్తికి సబ్ లీజుకు ఇచ్చారు. ఇలా..మున్సిపాలిటీలో..సబ్ లీజుల పర్వం నడుస్తోంది. మున్సిపాలిటీ నుంచి దుకాణాలను తక్కువకు దక్కించుకుని..వాటిని సబ్ లీజులకు ఇచ్చి..అద్దెలు వసూలు చేసుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. సాక్షాత్తూ..మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే..సబ్ లీజుల దందా నడుస్తోందంటే..పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రిమ్స్‌క్యాంపస్: జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీలు,రాజాం, పాలకొండ నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో వందలాది దుకాణాలు ఉన్నాయి. వీటిని..నిరుపేద వ్యాపారుల అభ్యన్నతి కోసం లీజు ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. టెండర్ల ప్ర క్రియ ద్వారా తక్కువ అద్దెలను వసూ లు చేస్తున్నారు. ఇక్కడే కొందరు గలీ జు దారులు తమ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనకు తూట్లు పొడుస్తూ..తక్కువ అద్దెలకు దుకాణాలను అద్దెకు తీసుకుని..సబ్ లీజులకు ఇస్తున్నారు. అధిక మొత్తాల్లో అద్దెలను వసూ లు చేసుకుంటున్నారు. ఇలా..70 శాతం దుకాణాలు సబ్లీజులకిచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సబ్‌లీజ్‌కు దుకాణాలను ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం. అయినా..అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. 331 దుకాణాలకు గాను..200 వరకు సబ్ లీజులే... శ్రీకాకుళం మున్సిపాలిటీలో..ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 14 షా పింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిలో మొత్తం 402 దుకాణాలు ఉండగా..331 దుకాణాలను లీజ్‌కు ఇచ్చారు. మిగిలిన 71 ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే..లీజ్‌కు తీసుకున్న 331 దుకాణాల్లో సుమారు 200 వరకు సబ్‌లీజులకు వెళ్లినట్టు తెలుస్తోంది.ఇలా సబ్‌లీజుల వ్యవహారం నడుపుతున్న వారంతా..రాజకీయ పలుకుబడి ఉన్నవారు..మున్సిపల్ కౌన్సిలర్లుగా పనిచేసిన వారే కావడం గమనార్హం. పత్తాలేని గుడ్‌విల్ ప్రతిపాదనలు లీజు దుకాణాలను సబ్‌లీజులకు ఇస్తున్న వైనంపై మున్సిపల్ అధికారులు గతంలో గుడ్‌విల్ ప్రతిపాదనలు చేశారు. లీజు దారుల నుంచి సబ్ లీజుకు తీసుకుని అద్దె చెల్లిస్తున్న వారికే నేరుగా దుకాణాలను కట్టబెట్టే ఆలోచన చేశారు. వారి నుంచి కొంత గుడ్‌విల్‌ను మున్సిపాలిటీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఒక్కో దుకాణానికి సుమా రు *లక్ష వరకు తీసుకుని..దుకాణాలను కట్టబెట్టాలని ఆలోచన చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు పత్తా లేకుం డా పోయింది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారిం చి..ఈ బాగోతానికి చెక్ చెప్పాలని పలువురు కోరుతున్నారు. -
రిమ్స్‌లో ప్రచ్ఛన్న యుద్ధం!
రిమ్స్‌క్యాంపస్: ఎవరైనాతప్పు చేస్తే వారిని మందలించటం సహజం. మరీ అవసరమైతే చర్యలు తీసుకోవటం ఏ శాఖలోనైనా పరిపాటే. తప్పు చేసిన వారు కూడా ఒక్కోసారి తలవంచుకుపోతారు. అదే తప్పు చేయకుండానే ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమైతే? కిందిస్థాయి సిబ్బందిలో ఆగ్రహావేశాలు ముంచుకొస్తాయి. కొద్దిసేపు సహనం వహిస్తారు. అప్పటికీ అధికారుల తీరు మారకపోతే ఆందోళనకు సిద్ధమవుతారు. ఇదే పరిస్థితి జిల్లాకు తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకొంది. కొద్దిరోజులుగా ఏదో ఒక విషయంలో రిమ్స్‌లో నెలకొంటున్న విభేదాలు మరోసారి తారస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలో సుమారు 250 మంది స్టాఫ్ నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి విధులను నర్సిం గ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారు. ఎవరైన విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే నర్సింగ్ సూపరింటెండెంట్ చర్యలు తీసుకుంటారు. అయితే ఇక్కడ పరిస్థితి తారుమారైంది. నర్సింగ్ స్టాఫ్ పై రిమ్స్ డెరైక్టర్ అజమాయిషీ చెలాయించేందుకు చూస్తున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. రిమ్స్ మొత్తానికి ఉన్నతాధికారిగా ఆయనకు అధికారం ఉన్నప్పటికీ లేనిపోని తప్పులను చూపించడాన్ని మాత్రం నర్సింగ్ స్టాఫ్ తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల వార్డు ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వార్డులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రోగులకు ఏ విధమైన సేవ లు అందుతున్నాయి, దొంగతనాలు జరుగకుండా ఇలా వీటి ద్వారా అధికారులు పరిశీలించి తెలుసుకుంటున్నారు. అయితే స్టాఫ్ నర్సులు రోగులకు సేవలందించిన తరువాత సంబంధిత రికా ర్డు వర్క్, డైట్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాఫ్ నర్సులు వార్డులో వారికి కేటాయించిన చోట కూర్చొని విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల ఓ వార్డులో స్టాఫ్ నర్సులు ఒకే దగ్గర కూర్చొని ఉండటాన్ని సీసీ కెమెరాలో చూసిన రిమ్స్ డెరైక్టరు వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెమోలివ్వాలంటూ ఆదేశాలు స్టాఫ్ నర్సులంతా ఒకచోట కూర్చొని ఉండటాన్ని తప్పుబట్టిన డెరైక్టర్ ఆ సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో వారికి మెమోలివ్వాలంటూ నర్సింగ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలను జారీ చేశారు. అయితే రికార్డు వర్క్ చేసుకుంటున్న వారికి ఏ విధంగా మెమోలిస్తామంటూ సూపరింటెండెం ట్లు డెరైక్టరుకు వివరించారు. డెరెక్టర్ మాత్రం వీరి మాటలను పట్టించుకోలేదు. వారికి మెమోలివ్వకుంటే నేను మీకు మెమోలిస్తానంటూ హెచ్చరించి నట్టు సమాచారం. తప్పు చేయని స్టాఫ్ నర్సులకు మెమోలివ్వలేక, డెరైక్టరు మాటకు ఎదురు చెప్పలేక ఓ నర్సింగ్ సూపరింటెండెంట్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిసింది. ఆందోళన ఆలోచనలో నర్సింగ్ స్టాఫ్ ! డెరైక్టర్ తీరు మార్చుకోకపోతే ఆందోళనకు సిద్ధం కావాలననే ఆలోచనలో స్టాఫ్ నర్సులు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు కొంతమంది గురువారం సమావేశమై చర్చించినట్టు ఆస్పత్రి వ ర్గాలు చెబుతున్నాయి. నిజంగా తప్పు చేసి ఉంటే ఆధారాలతో సహా రుజువు చేసి చర్య తీసుకోవాలంటున్నారు. మెమోలివ్వమన్న మాట వాస్తవమే విధులు సక్రమంగా నిర్వహించటం లేదంటూ కొంత మంది స్టాఫ్ నర్సుల కు మెమోలను ఇవ్వమని డెరైక్టర్ చెప్పటం వాస్తవమేనని గ్రేడ్-2 నర్సిం గ్ సూపరింటెండెంట్ దుర్గాంబ ‘సాక్షి’కి చెప్పారు. తొలుత మెమోలు ఇవ్వమని చెప్పినా.. ఆ తరువాత వాటిని రద్దు చేయమని చెప్పడంతో ప్రస్తుతం ఎవ్వరికి మెమోలు ఇవ్వలేదన్నారు. ఇదే విషయాన్ని రిమ్స్ సూపరింటెండెంట్ ఎల్.వేణుగోపాల్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా నర్సింగ్ స్టాఫ్ చాలా సమయం ఒకే చోటకూర్చొని ఉంటున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో స్టాఫ్ నర్సులను డెరైక్టరు మందలించినట్టు చెప్పారు. మెమోల విషయం తనకు తెలియదన్నారు. -
శిశువుల పాలిట యమపురి!
రిమ్స్ క్యాంపస్, సంతకవిటి: కారణాలు ఏవైనా కావచ్చు.. ఎన్నయినా ఉండొచ్చు. కానీ ఏడాదిలో ఒక ఆస్పత్రిలో 262 మంది శిశువులు మరణించడం చిన్న విషయం కాదు. శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అందుకు తగినట్లే శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చిన్నపిల్లల అత్యవసర వార్డు(ఎస్ఎన్సీయూ లేదా ఎన్ఐసీయూ)లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులను నియమించినా ఇంత పెద్ద సంఖ్యలో శిశు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి?.. దీనికి ప్రధాన కారణం వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవడమే. ఇక్కడికి వచ్చేవన్నీ అత్యవసర కేసులే. తక్షణం స్పందిస్తేనే ఆ చిన్ని ప్రాణాలు నిలుస్తాయి.. కానీ దురదృష్టవశాత్తు రిమ్స్‌లో ఆ స్పందనే కరువవుతోంది. చిన్నారుల ఉసురు తీస్తోంది. మా తప్పేం లేదు రిమ్స్‌లో చిన్నారులకు వైద్య సేవలందిచేందుకు ఎన్.ఆర్.సి,, ఎస్.ఎన్.సి.యు విభాగాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు చిన్న పిల్లల వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. అన్నీ ఉన్నా.. కీలకమైన వైద్యసేవలు మాత్రం ఆశించిన స్థాయిలో అందడం లేదు. ఫలితంగా ఎప్పటికప్పుడు చిన్నారులు మృత్యువాత పడుతునే ఉన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తమ చేతుల్లో ఏమీ లేదని, చివరి క్షణంలో ఆస్పత్రికి తీసుకువస్తున్నారని వైద్యాధికారులు తేల్చేస్తున్నారు. శిశువు మరణిస్తే దాన్ని తమ తప్పుగా భావించటం సరికాదంటున్నారు. గ్రీవెన్సుసెల్‌లో ఫిర్యాదు వైద్యం అందించినా ప్రాణాలు దక్కకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. రిమ్స్‌లో సరైన వైద్య సేవలు అందించకపోవటం వల్లే తమ చిన్నారి మృతి చెందిం దంటూ కొద్ది నెలల కిందట ఆమె తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ ఒక జిల్లా స్థాయి అధికారితో విచారణ జరిపించారు. అయితే విచారణ జరిపిన సదరు అధికారి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని భావించి రిమ్స్ అధికారుల నిర్లక్ష్యాన్ని, పలు సమస్యలను గుర్తించినా వాటిని బయట పెట్టలేదు. మరోవైపు ఆస్పత్రిలో తమ పిల్లలు చనిపోయినా బయటకు చెప్పేవారు చాలా తక్కువమందే. అందువల్లే రిమ్స్‌లో నిర్లక్ష్యపు జబ్బు రోజురోజుకు పెరిగిపోతోంది. ఆదివారం ఆటవిడుపే ఆదివారం ఆటవిడుపు అన్న పదం రిమ్స్ వైద్యాధికారులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. ఇక్కడ పలువురు వైద్యులు సాధారణ రోజుల్లోనే అందుబాటులో ఉండరు. ఇక ఆదివారం అయితే అసలు కనిపించరు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో సగానికిపైగా విశాఖపట్నం నుంచి రోజూ రాకపోకలు సాగిస్తుం టారు. ఇక మధాహ్నం ఒంటి గంట దాటిన తరువాత ఈ విభాగంలో వైద్యులు కనిపించడం గగనమే. దాంతో మధ్యాహ్నం తర్వాత వచ్చే అత్యవసర కేసులన్నింటికీ దిగువస్థాయి సిబ్బందే తమకు తోచిన వైద్యం అందిస్తున్నారు. వారికి అర్థం కానప్పుడు సంబంధిత వైద్యులను ఫోన్లో సంప్రదించి వారి సూచనల ప్రకారం మందులు ఇస్తున్నారు. ఈ క్రమంలో పలు కేసులను వైజాగ్ కేజీహెచ్‌కు రిఫర్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఎస్‌ఎన్‌సీయూలో నలుగురు వైద్యులు ప్రత్యేకంగా ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. మురికికూపంలా వార్డు పరిసరాలు ఎస్ఎన్సీయూ విభాగాన్ని అపారిశుద్ధ్యం కూడా పీడిస్తోంది. ఈ విభాగంలోని చెత్తాచెదారాన్ని కిటికీల్లోంచి పక్కనే పారబోస్తుండటంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. అపారిశుద్ధ్యం కారణంగా చిన్నారులు మరింత అస్వస్థతకు గురయ్యే ప్రమాదముంది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎన్.ఆర్.సి పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ విభాగంలో మూడు ఏసీలు ఉండగా ఒకటి మాత్రమే పనిచేస్తోంది. వీరికందే పౌష్టికాహారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. చిన్నారులకు సరైన వైద్య సేవలు అందని కారణంగా చాలామంది రిమ్స్‌కు రావటానికి భయపడుతున్నారు. బాలల హక్కుల క మిషన్‌కు ఫిర్యాదు చేస్తా : చిన్నికృష్ణ సమాచార హక్కు చట్టం ద్వారా తనకు అందిన సమాచారం ఆధారంగా బాల ల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చిన్నికృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. తన కుమారుని విషయంలో చోటు చేసుకున్న వైద్య సేవల లోపంపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానన్నారు. రిమ్స్ ఎన్ఐసీయూలో వైద్యసేవలు సక్రమంగా అందడంలేదని ఆరోపించారు. -
సేవల్లో సిస్టర్స్
ఆస్పత్రికి వెళ్లగానే అమ్మలాంటి ఓ ఆత్మీయ పలకరింపు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఓ స్నేహితురాలు.. కష్టంలో భాగస్వామిగా మారే ఓ అక్క.. వైద్యులను పిలిచి సేవలందించేందుకు సహకరించే ఓ సేవకురాలు... ఇవన్నీ కలగలిపితే అందరూ సిస్టర్స్‌గా పిలిచే నర్సు. వారి సేవలు వెలకట్టలేనివి. వారి రుణం తీర్చుకోలేనిది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పటినుంచి తిరిగి డిశ్చార్జ్ అయ్యేవరకు అండగా ఉండేది.. అందుబాటులో ఉండేది నర్సు మాత్రమే. నేడు నర్సుల దినోత్సవం సందర్భంగా వారి సేవలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం. రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ :నర్సులకు రాత్రి పగలు, కులం మతం, పేద ధనిక, ప్రాంతాలతో సంబంధం లేదు. అనారో గ్యంతో ఆస్పత్రిని ఆశ్రయించేవారందరినీ చేరదీస్తారు. రోగం ఎంతటి భయాంతకమైనదైనా రోగికి మనోధైర్యాన్నిస్తూ నిస్వార్థంగా సేవ చేస్తారు. రోగి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి రోగం నయమయ్యేంత వరకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలం దిస్తారు. వైద్యుల సలహా మేరకు మందులు ఇస్తారు. అమ్మలా ఆత్మీయత పంచుతారు. ఓ అక్కలా సలహాలిస్తారు. స్నేహితురాలిలా అండగా ఉం టారు. రోగులకు సేవచేయడమే జీవితపరమార్ధంగా భావించి ‘లేడీ ఆఫ్ ది ల్యాంప్’గా ఖ్యాతికెక్కిన సేవామూర్తి ఫోరెన్స్ నైటింగేల్‌కు గుర్తుగా ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ సేవలను గుర్తిస్తున్నారు. అన్నింటిలోనూ వారే... ‘ప్రార్థించే పెదవుల కన్నా సహాయపడే చేతులు మిన్న’ అన్న సామెతె నర్సులకు అచ్చంగా సరిపోతుంది. రోగం ఎలాంటిదైనా ఓ అక్కలా నర్సులు సేవ చేస్తుంటారు. విధులకు హాజరైనప్పటి నుంచి రోగుల యోగక్షేమాలు తెలుసుకుంటూ అవసరమైన మందులు ఇస్తూ అన్నింటిలోనూ సాయపడతారు. విధి నిర్వహణలో రోగులకు ఆత్మీయతానురాగాలను పంచిపెడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైద్యులిచ్చే మందుల కన్నా నర్సులు ఇచ్చే మనోస్థైర్యమే రోగిని బతికిస్తుంది. అందుకే చాలామంది వైద్యులు తమ క్లినిక్ లకు నర్సింగ్ హోమ్‌గా పేరు పెడతారని సమాచారం. నర్సులే లేకుంటే... ఆస్పత్రుల్లో నర్సులే లేకుంటే... పరిస్థితిని ఊహించలేం. ఏ ఆస్పత్రిలో చూసినా రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక్క వైద్యుడూ అందుబాటులో ఉండరు. అదే ప్రభుత్వాస్పత్రులైతే ఇక చెప్పనక్కర్లేదు. మధ్యాహ్నం ఒంటి గంటకే వైద్యులు మాయమైపోతారు. రాత్రి వేళల్లో వచ్చే రోగులకు ప్రథమ చికిత్స చేసి సేవలందించేది, ఆపద్బాంధువుల్లా ఆదుకునేది నర్సులే. ఆ సమయంలో నర్సులు అందుబాటులో లేకుంటే ఎంతో మంది రోగు లు మృతి చెందడం ఖాయం. ఆప్యాయ పలకరింపు ఎంతో ఆనందాన్నిస్తుంది.. రోగం నయమయ్యాక ఆ రోగి పిలిచే ఆప్యాయ పలకరింపు గొప్ప ఆనందాన్నిస్తుంది. ఆ ఆనందం ముందు ఏదైనా తక్కువే. రోగులందరినీ కుటుంబ సభ్యుల్లా భావిస్తాను. అందుకే రోగం ఎంత భయూంతకమైనదైనా సేవచేయగలుగుతున్నాను. అన్ని ఉద్యోగాలకంటే ఉన్నతమైనది నర్సు వృత్తి. సేవచేయూలన్న కోరిక ఉన్నా అది అందరికీ లభించదు. - పి.రూపాదేవి, ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా కార్యదర్శి నైటింగేల్ స్ఫూర్తితో... రోగులకు విశిష్ట సేవలందించి నర్సులందరికీ ఆదర్శవంతంగా నిలిచిన నైటింగేల్ స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తున్నా. నర్సుగా సేవలందించే సమయంలో రోగుల కళ్లలో ఆనందం, వారు పంచే అభిమానం మరచిపోలేనిది. ఆస్పత్రికి వచ్చే రోగులందరినీ కుటుంబ సభ్యులుగా భావించి సేవలందిస్తున్నా. - ఎ.నిర్మలాదేవి, ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా సభ్యురాలు మనస్ఫూర్తిగా సేవలందిస్తున్నా... నర్సుగా విధుల్లో చేరినప్పటి నుంచి నేటి వరకు ఎంతో ఇష్టంగా రోగులకు సేవ చేశాను. ఇకపై కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తాను. ఆపదలో ఉన్నవారికి సాయంచేసే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. నర్సులందరికీ నైటింగేల్ స్ఫూర్తికావాలి. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. - కె.రాంబాయి, ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు -
దరఖాస్తు.. అవస్థల మస్తు
నమూనా ఫారం నుంచి ప్రతిదానికీ డబ్బులతో లింకు ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికే రూ.800 వరకు ఖర్చు దరఖాస్తు ఫీజులు భారీగా పెంచేసిన ప్రభుత్వ సంస్థలు యూజర్ చార్జీల పేరుతో మరింత వాత పెడుతున్న రిమ్స్ ఆన్లైన్ విధానంతో మరికొంత భారం ఆందోళన చెందుతున్న పేద నిరుద్యోగులు రిమ్స్‌క్యాంపస్: గతంలో ఉద్యో గాలకు దరఖాస్తు చేయడానికి రూ.50.. అంతకుమించి మహా అయితే రూ.100 లోపే సరిపోయేది. దరఖాస్తు ఫారం, దానితోపాటు చెల్లించాల్సిన ఫీజలు చాలా తక్కువగా ఉండేవి. కొన్ని ఉద్యోగాలకు ఫీజులు కూడా ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నా.. వాటికి దరఖాస్తు చేయడమే నిరుద్యోగులకు పెద్ద సమస్యగా మారింది. దరఖాస్తు ఫారం నుంచి దానికి జత చేయాల్సిన ధ్రువపత్రాలు పొందడానికి యూజర్ చార్జీలు, దరఖాస్తు ఫీజు..ఇలా ఒక్కో దరఖాస్తుకు రూ.700 నుం చి రూ.వెయ్యి వరకు చేతి చుమురు వదిలించుకోవాల్సి వస్తోంది. ఎన్ని ఉద్యోగాలకు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు.. అఫ్కోర్స్..ఇప్పుడు మహిళలకు కూడా అదే లక్షణం అబ్బిందనుకోండి.. అది వేరే విషయం. చదువు పూర్తికాగానే.. ఏదో ఒక ఉద్యోగంలో చేరి.. నాలుగు రాళ్లు సంపాదించడం ద్వారా కుటుంబానికి ఆర్థిక ఆసరా కల్పించాలని పేద, మధ్య తరగతి వర్గాల యువత తాపత్రయపడటం సహజం. ఉద్యోగం రావాలంటే ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఏముంది.. దరఖాస్తు చేసుకోవడమే కదా!.. ఒక తెల్ల కాగితం మీద మన బయోడేటా పూర్తిగా రాసి పంపితే సరిపోతుంది కదా? అనుకోవడానికి లేదు. ఇది గత కాలం ముచ్చట. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ ప్రక్రియే పెద్ద ఖర్చుతో కూడిన పనిగా మారింది. ఆర్థిక భారంగా పరిణమించింది. -
అడిగితే.. కడిగేస్తా!
నిన్న నా దగ్గరకొచ్చావు.. ఇప్పుడు సూపరింటెండెంట్ వద్దకు వెళ్లావు.. నీకింకేం పని లేదా?.. ఏమైనా అంటే ఏడ్చేస్తున్నావు.. నీకు కాకుండా వేరొకరికి ఉద్యోగం వచ్చిందని సహించలేకపోతున్నావా లేక కడుపు మంటా?!.. అన్ని అర్హతలున్నా తనకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వచ్చిన ఒక అభ్యర్థినికి ఎదురైన ఎత్తిపొడుపులు.. ఈసడింపులు ఇవి. ఆమెకు జరిగిన అన్యాయమేమిటో సావకాశంగా విని.. పరిశీలించి.. వీలుంటే న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారే ఇలా విరుచుకుపడటంతో బిక్కచచ్చిపోవడం ఆ అభ్యర్థిని వంతైంది. రిమ్స్ ట్రామాకేర్ పోస్టుల విషయంలో గత కొన్నాళ్లుగా డిప్యూటీ డెరైక్టర్ సృజన తీరు ఇలాగే ఉంది. రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: జిల్లా పెద్దాస్పత్రి రిమ్స్ ట్రామాకేర్ విభాగంలో పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిన తప్పులను సరిదిద్ది, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడానికి ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న ఉన్నతాధికారులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. మొదటి నుంచి ఈ నియామకాల్లో జరిగిన తప్పులను వార్తా కథనాల రూపంలో ‘సాక్షి’ ఎత్తిచూపుతున్న విషయం తెలిసిందే. మెరిట్, ఎంపిక జాబితాలను చూసి తమకు అన్యాయం జరిగిందని తెలుసుకుని, అధికారులకు విన్నవించుకునేందుకు వస్తున్న అభ్యర్థులను వారు కసురుకుంటున్నారు. కన్నీళ్లు పెట్టించి మరీ వెనక్కు పంపుతున్నారు. శుక్రవారం ‘న్యూస్‌లైన్ ఎదుటే డీడీ సృజన ఒక అభ్యర్థినిపై విరుచుకుపడ్డారు. ఎంతమందికి చెప్పుకొన్నా ఇంక ఉద్యోగం ఇచ్చేదిలేదని మొహం మీదే కొట్టినట్లు చెప్పారు. అసలేం జరిగింది? పాతపట్నం మండలం కాగువాడకు చెందిన చిట్టివలస నాగమ్మ బీసీ-ఏ కేటగిరీలో ట్రామాకేర్ స్టాఫ్ నర్సు పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. వెయిటెజీతో కలిపి 74.67 శాతం మార్కులతో మెరిట్ జాబితాలో 21వ స్థానంలో నిలిచింది. మొత్తం 19 పోస్టులకు గాను 19, 20 స్థానాల్లో ఒకే అభ్యర్థి పేరు ఉండటంతో ఒక నెంబర్ తగ్గి నాగమ్మ 20వ స్థానంలో ఉండాలి. ఇదిలా ఉంటే ఇదే కేటగిరీలో కొడూరు రాఘవమ్మ అనే అభ్యర్థిని 77.37 శాతంతో మెరిట్ జాబితాలో 4వ స్థానంలో ఉంది. ఈమె కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థి కావటంతో తొలుత నాన్‌లోకల్‌గా పరిగణించారు. కానీ ఏం జరిగిందో గానీ ఈమెను ఎంపిక చేస్తూ తుది జాబితాలో పేరు పెట్టేశారు. వాస్తవానికి స్టాఫ్ నర్సు పోస్టులకు రీజీయన్ యూనిట్‌గా తీసుకోవాలి. ఆ ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల అభ్యర్థులనే లోకల్‌గా పరిగణించాలి. మిగతా జిల్లాల వారిని నాన్ లోకల్‌గా పరిగణించి వారికి కేటాయించిన 15 శాతం కింద మెరిట్ జాబితాలో మొదట ఉన్న ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయాలి. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోకూడదు. దీనికి విరుద్ధంగా నాలుగో స్థానంలో ఉన్న రాఘవమ్మను లోకల్‌గా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసేశారు. మరోవైపు రాఘవమ్మ డేట్ ఆఫ్ పాసింగ్ కూడా తప్పని తెలిసింది. 2012లో జీఎన్ఎమ్ ఉత్తీర్ణత సాధించగా, 2008లో ఉత్తీర్ణురాలైనట్లు మెరిట్ జాబితాలో చూపించి ఐదు మార్కులు వెయిటేజి ఇచ్చి 77.37 శాతంగా పేర్కొన్నారు. అదే 2012 నుంచి లెక్క వేస్తే ఒక్క మార్కు వెయిటెజీతో కలిపి ఆమె సాధించిన మార్కులు 73.37 శాతంగానే ఉండేది. ఫలితంగా లోకల్ అభ్యర్థి అయిన నాగమ్మ ముందువరుసలోకి వచ్చి తుది జాబితాలో చేరేది. ఉద్యోగం ఖచ్చితంగా వచ్చేది. న్యాయం చేయమంటే నిప్పులు చెరిగారు రాఘవమ్మ విషయంలో జరిగిన తప్పులు.. ఫలితంగా తనకు జరిగిన అన్యాయాన్ని పై లెక్కలతో సహా గురువారం డీడీ సృజనను కలిసి నాగమ్మ వివరించింది. న్యాయం చేయాలని అభ్యర్థించింది. డీడీ మాత్రం కనీసం సానుభూతి అయినా చూపకపోగా సూటిపోటి మాటలతో విరుచుకుపడ్డారు. వేరొకరికి ఉద్యోగం వస్తే నీకు కడుపు మంటా.. మీకేం పనిలేదా అంటూ ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. దీంతో కన్నీరు మున్నీరైన నాగమ్మ బయటకు వచ్చేసింది. పక్కన కార్యాలయంలో ఉన్న ఓ గుమస్తా నాగమ్మ వివరాలను పరిశీలించి, ఖచ్చితంగా ఉద్యోగం రావల్సి ఉందని చెప్పటంతో మిణుకు మిణుకుమంటున్న ఆశలతో శుక్రవారం మళ్లీ రిమ్స్‌కు వచ్చి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్‌ను కలిశారు. వెంటనే ఆయన డీడీ సృజనకు ఫోన్ చేసి నాగమ్మ వివరాలను తెలియజేయగా.. ‘మిమ్మల్ని ఆ అభ్యర్థి తప్పుదోవ పట్టిస్తోందని’ చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత ఐదు నిమిషాల వ్యవధిలోనే డీడీ స్వయంగా సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న అభ్యర్థిని నాగమ్మపై మళ్లీ విరుచుకుపడ్డారు. ‘నువ్వు నిన్ననే నా దగ్గరకు వచ్చావు, మళ్లీ ఈ రోజు కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చావా. నీకేమీ పని లేదా..’ అని కసురుకున్నారు. మెరిట్ జాబితా తొలగింపు ఆ సమయంలో అక్కడే ఉన్న ‘న్యూస్‌లైన్’ కల్పించుకొని అక్కడే గోడకు అతికించి ఉన్న మెరిట్ జాబితాను డీడీ, సూపరింటెండెంట్లకు చూపించి జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపడంతో వారిద్దరూ కంగుతిన్నారు. వెంటనే డీడీ అటెండర్‌ను పిలిచి జాబితాను చించేయాలని ఆదేశించారు. దానికి ‘న్యూస్‌లైన్’ అభ్యంతరం చెబుతూ జాబితాను ఫొటో తీసుకుంటామని చెబుతున్నా వినిపించుకోకుండా తనే స్వయంగా జాబితాను చించేసి విస్మయానికి గురి చేశారు. అక్కడితో ఆగకుండా ఈమెకు ఉద్యోగం ఏవిధంగా వస్తుంది?.. వాస్తవంగా రావాల్సి ఉన్నా ఇప్పుడు రాదని స్పష్టం చేశారు. కలెక్టరే చెప్పారు.. ఇంకివ్వం! ఇప్పుడు ఇంకేం చేయలేం. తప్పులు జరిగాయని అభ్యంతరం చెప్పే వారిని పక్కనే పెట్టేసి.. జాబితా లో ఉన్న వారికే ఉద్యోగాలిచ్చేయాలని కలెక్టర్‌గారే చెప్పారు.. ఇదీ డీసీ సృజన నిష్కర్షగా చెప్పిన మాట. మెరిట్ జాబితా ప్రకారం లోకల్ అయిన నాగమ్మకు ఉద్యోగం రావాలి కదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వీళ్లకు ఉద్యోగాలివ్వాలంటే అదో పెద్ద పని, ఇప్పుడు అదంతా చేయడం కుదరదు అని సెలవిచ్చారు. -
పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) సకాలంలో తెరుచుకొని.. సిబ్బంది అందుబాటులో ఉండేందుకు వీలుగా ఆ శాఖ అధికారు లు చర్యలు చేపడుతున్నారు. రిజిస్టర్లలో హాజ రు నమోదు చేసే ప్రక్రియ స్థానంలో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 20 పీహెచ్‌సీల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో వైద్యాధికారులతో సహా సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. హాజరు పట్టీల్లో మాత్రం సంతకాలు ఉంటున్నాయి. సమయపాలన లేకపోవడం వల్ల పేదలకు వైద్యం అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిని నివారించి రోగులకు సకాలంలో వైద్యం అందేలా చూసేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసే బయో మెట్రిక్ యంత్రాల్లో అక్కడి వైద్యాధికారితో సహా సిబ్బంది అందరూ వేలిముద్ర వేయాల్సిందే. అప్పుడే వారి హాజరు, సమయం నమోదవుతాయి. సీసీ కెమెరాల ఏర్పాటు సన్నాహాలు బయో మెట్రిక్ విధానం నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే అది అమల్లో ఉన్న ఇతర శాఖలు, కార్యాలయాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేలి ముద్ర వేసే నెపంతో యంత్రాన్ని గట్టిగా నొక్కడం, ఇష్టానుసారం స్వీచ్‌లు నొక్కేసి యంత్రం పాడయ్యేలా చేయడం చాలా చోట్ల జరుగుతోందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేయనున్న బయోమెట్రిక్ యంత్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆన్లైన్ ద్వారా డీఎంహెచ్‌వో కార్యాలయంలో రికార్డు అయ్యేవిధంగా ఏర్పాట్లు చేయనున్నారు. దీని వల్ల బయోమెట్రిక్ యంత్రాన్ని ఎవరు పాడు చేసినా తెలిసిపోతుంది. తొలి విడతలో అమలయ్యే పీహెచ్‌సీలు జిల్లాలో తొలి విడతగా 20 పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. ఈ పీహెచ్‌సీలను కూడా అధికారులు ఖరారు చేశారు. మాకివలస, తిలారు, పోలాకి, గుప్పెడుపేట, ఉర్లాం, జలుమూరు, అచ్చుతాపురం, సారవకోట, దూసి, తొగరాం, గుత్తావల్లి, ఎల్.ఎన్.పేట, అక్కులపేట, సరుబుజ్జిలి, ఎచ్చెర్ల, పొన్నాడ, సింగుపురం, గార, కళింగపట్నం, శ్రీకూర్మం ఆరోగ్య కేంద్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. త్వరలోనే అమలు:డీఎంహెచ్‌వో జిల్లాలోని 20 పీహెచ్‌సీల్లో తొలివిడతగా బయోమెట్రిక్ విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్న విషయాన్ని డీఎంహెచ్‌వో గీతాంజలి ధ్రువీకరించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తునామన్నారు. యంత్రాల కోసం ఇండెంట్ పెట్టామని, అవి రాగానే అమర్చి పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. -
కలెక్టర్ వస్తున్నారని..
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్:హీరో తన తల్లిదండ్రులకు తనో గొప్ప వైద్యుడ్నినని, హాస్పటల్ కూడా ఉందని అబద్ధం చెప్పుకొస్తాడు. హీరో ఉన్నచోటకు కన్నవారు వస్తున్నారని తెలిసిన వెంటనే హడవుడిగా లేని ఆస్పత్రిని తాత్కలికంగా సెట్ చేసి చూపిస్తూ మోసం చేస్తుంటాడు.. ఈ సన్నివేశం శంకరదాదా ఎంబీబీఎస్ చిత్రంలోనిది. ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా! అక్కడ హీరో తల్లిదండ్రులను ఏలా మోసం చేశాడో.. జిల్లాకే తలమానకమైన రిమ్స్ అస్పత్రి అధికారులు కూడా కలెక్టర్‌ను అలాగే మోసం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ బుధవారం రిమ్స్‌కు వస్తున్నారని తెలిసి తాత్కాలికంగా అప్పటికప్పుడే పలు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని ఫ్లెక్సీల ద్వారా ఏర్పాటు చేసేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రిమ్స్ ఆస్పత్రిని పరిశీలించిన ప్రతిసారి కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. అయితే వాటిని అమలు చేయకపోవటం.. మరోసారి ఆస్పత్రిని సందర్శించే సమయంలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. అయితే ఈసారి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ల్లాగా రిమ్స్ అధికారులు వ్యవహరించారు. ఓపీ విభాగం వద్ద అందరికీ కనిపించేలా సిటిజన్ చార్టును ఏర్పాటు చేయాలని, ఓపీ సమయాలను తెలియజేస్తూ బోర్డును ఉంచాలని రిమ్స్ అధికారులను ఇటీవల కలెక్టర్ ఆదేశించినప్పటికీ పట్టించుకోలేదు. ఇదే క్రమంలో గత నెల 28వ తేదీన ఆస్పత్రి పరిశీలనకు వచ్చిన కలెక్టర్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఓపీ విభాగం ఫొటోను తన సెల్‌తో తీశారు. తాను మరల వచ్చే సమయానికి ఇక్కడ పూర్తి సమాచారాన్ని తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలని సీరియస్‌గా చెప్పారు. అయితే ఆయన అధికారులను రిమ్స్ అధికారులు గాలికొదిలేశారు. బుధవారం రిమ్స్‌కు కలెక్టర్ వస్తున్నారని తెలుసుకొని హడావుడిగా పలు విభాగాలకు సంబంధించిన సమాచారంతో కూడిన ఫ్లెక్సీలను అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. సిటిజన్ చార్టును ఫ్లెక్సీ వేసి ఓపీ విభాగంపైన కలెక్టర్ రావటానికి అరగంట ముందు కట్టారు. ఓపీ సమయాలను తెలియజేస్తూ ఓ ఫ్లెక్సీని బోర్డుపై అంటించేశారు. ఆ బోర్డు కూడా తాత్కలికంగా ఓ బల్లపై పెట్టి కలెక్టరును మోసగించారు. మరుగుదొడ్లను పరిశీలిస్తారేమోనని భావించి మరుగుదొడ్లకు దారి అంటూ జిరాక్స్ కాగితాన్ని గోడకు అంటించారు. అసలు విషయం తెలియని కలెక్టర్ నిజంగా తన అదేశాలను రిమ్స్ అధికారులు అమలు చేశారనుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోసారి కలెక్టర్ వచ్చేసరికి ఈ తాత్కలిక ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతాయో లేదో వేచిచూడాలి.