రిమ్స్ వైద్య కళాశాల
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భయానక వాతావరణం నెలకొంటోంది. కొందరు సీనియర్లు జూనియర్లను చిత్ర హింసలకు గురిచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజులపాటు ఓ గదిలో బంధించి క్రికెట్ స్టంప్‌లతో కొట్టడంతో వారు గాయపడ్డారు. వారికి కనీసం తిండి కూడా పెట్టకుండా, దుస్తులు ఊడదీసి చిత్రహింసలకు గురిచేసినట్టు సమాచారం. భయభ్రాంతులైన వీరు సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించారు. అలాగే జరిగిన విషయాన్ని రిమ్స్ కళాశాల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇరు వర్గాలను రాజీ చేసే ప్రయత్నాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దెబ్బలు తిన్న, దాడి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, మాట్లాడి పంపించేసినట్లు కొందరు విద్యార్థులు చెబుతున్నారు.
సీనియర్లు కొట్టిన దెబ్బలకు జూనియర్ విద్యార్థుల శరీరంపై గాయాలు
రిమ్స్ కళాశాలలోనే చదువుతున్నప్పటికీ హాస్టల్‌లో ఉండడానికి అనుమతిలేని ఓ విద్యార్థి గడిచిన కొన్నేళ్లుగా హాస్టల్‌లోనే ఉంటూ కొందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడన్న ఆరోపణలువినిపిస్తున్నాయి. సదరు విద్యార్థి పరీక్షలకు హాజరు కాకుండా, వ్యసనాల బారిన పడినట్లు కూడా తెలియవచ్చింది. ఇదే విషయం రిమ్స్ అధికారులకు కూడా విద్యార్థులు చెప్పగా దానిని కూడా సర్దిచెప్పినట్లు జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యార్థి తరచూ ఎవరో ఒకరితో గొడవపడుతూ వారు తిరగబడిన పక్షంలో తన వెనుక రౌడీలు ఉన్నారని బెదిరించినట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లో కొందరు యువకులను కూడా హాస్టల్ వద్దకు తీసుకొచ్చి బెదిరించినట్లు జూనియర్లు చెబుతున్నారు. ప్రస్తుత సంఘటనలో.. ఎవరికైనా చెబితే రౌడీలతో కొట్టిస్తానని బెదిరించడంతో బాధితులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లి ప్రైవేటుగా ఉంటున్న కొందరు స్నేహితుల ఇంటిలో తలదాచుకుంటున్నారు. రిమ్స్ అధికారులు వారికి కబురుపెట్టి, దాడి చేసిన విద్యార్థి తల్లిదండ్రుల ఎదుట హాజరుపరచి రాజీ ధోరణిలో మాట్లాడినట్లు కొందరు వైద్య విద్యార్థులు చెబుతున్నారు. కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్‌లో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యే ప్రమాదముంటుందని అంటున్నారు. అనధికారికంగా ఓ విద్యార్థి హాస్టల్‌లో ఉంటున్న విషయం గుర్తించలేకపోవడాన్ని కూడా వారు ఆక్షేపిస్తున్నారు.
తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం
ఇద్దరు విద్యార్థులను సీనియర్లు కొట్టిన విషయాన్ని వారి తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాం. కొట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం. దాడి చేసిన విద్యార్థిని పంపించేశాం. ప్రస్తుతం విద్యార్థులంతా సంతోషంగానే ఉన్నారు. – డాక్టర్ కృష్ణవేణి, ప్రిన్సిపాల్, రిమ్స్ వైద్య కళాశాల
అనధికారికంగా ఉంటున్న విషయం తెలీదు
రిమ్స్ వైద్య కళాశాల హాస్టల్‌లో అనధికారికంగా ఉంటున్న విద్యార్థి విషయం విద్యార్థులు గాని, సిబ్బంది గాని నా దృష్టికి తీసుకురాలేదు. విద్యార్థులు ఫిర్యాదు చేసిన వెంటనే హాస్టల్ నుంచి పంపించేశాం. అతనిని హెచ్చరించాం. ఇక మీదట ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.– డాక్టర్ బోర ప్రసాద్, వార్డెన్
Comments
Please login to add a commentAdd a comment