సేవల్లో సిస్టర్స్ | today National Nurses Day | Sakshi
Sakshi News home page

సేవల్లో సిస్టర్స్

Published Mon, May 12 2014 1:49 AM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM

సేవల్లో సిస్టర్స్ - Sakshi

సేవల్లో సిస్టర్స్

 ఆస్పత్రికి వెళ్లగానే  అమ్మలాంటి ఓ ఆత్మీయ పలకరింపు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో  ఓ స్నేహితురాలు..  కష్టంలో భాగస్వామిగా మారే ఓ అక్క..  వైద్యులను పిలిచి సేవలందించేందుకు సహకరించే ఓ సేవకురాలు... ఇవన్నీ కలగలిపితే అందరూ సిస్టర్స్‌గా పిలిచే నర్సు. వారి సేవలు వెలకట్టలేనివి. వారి రుణం తీర్చుకోలేనిది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పటినుంచి తిరిగి డిశ్చార్జ్ అయ్యేవరకు అండగా ఉండేది.. అందుబాటులో ఉండేది నర్సు మాత్రమే. నేడు నర్సుల దినోత్సవం సందర్భంగా వారి సేవలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.
 
 రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ :నర్సులకు రాత్రి పగలు, కులం మతం, పేద ధనిక, ప్రాంతాలతో సంబంధం లేదు. అనారో గ్యంతో ఆస్పత్రిని ఆశ్రయించేవారందరినీ చేరదీస్తారు. రోగం ఎంతటి భయాంతకమైనదైనా రోగికి మనోధైర్యాన్నిస్తూ నిస్వార్థంగా సేవ చేస్తారు. రోగి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి రోగం నయమయ్యేంత వరకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలం దిస్తారు. వైద్యుల సలహా మేరకు మందులు ఇస్తారు. అమ్మలా ఆత్మీయత పంచుతారు. ఓ అక్కలా సలహాలిస్తారు. స్నేహితురాలిలా అండగా ఉం టారు. రోగులకు సేవచేయడమే జీవితపరమార్ధంగా భావించి ‘లేడీ ఆఫ్ ది ల్యాంప్’గా ఖ్యాతికెక్కిన సేవామూర్తి ఫోరెన్స్ నైటింగేల్‌కు గుర్తుగా ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ సేవలను గుర్తిస్తున్నారు.
 
 అన్నింటిలోనూ వారే...
 ‘ప్రార్థించే పెదవుల కన్నా సహాయపడే చేతులు మిన్న’ అన్న సామెతె నర్సులకు అచ్చంగా సరిపోతుంది. రోగం ఎలాంటిదైనా ఓ అక్కలా నర్సులు సేవ చేస్తుంటారు. విధులకు హాజరైనప్పటి నుంచి రోగుల యోగక్షేమాలు తెలుసుకుంటూ అవసరమైన మందులు ఇస్తూ అన్నింటిలోనూ సాయపడతారు. విధి నిర్వహణలో రోగులకు ఆత్మీయతానురాగాలను పంచిపెడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైద్యులిచ్చే మందుల కన్నా నర్సులు ఇచ్చే మనోస్థైర్యమే రోగిని బతికిస్తుంది. అందుకే చాలామంది వైద్యులు తమ క్లినిక్ లకు నర్సింగ్ హోమ్‌గా పేరు పెడతారని సమాచారం.
 
 నర్సులే లేకుంటే...
 ఆస్పత్రుల్లో నర్సులే లేకుంటే... పరిస్థితిని ఊహించలేం. ఏ ఆస్పత్రిలో చూసినా రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక్క వైద్యుడూ అందుబాటులో ఉండరు. అదే ప్రభుత్వాస్పత్రులైతే ఇక చెప్పనక్కర్లేదు. మధ్యాహ్నం ఒంటి గంటకే వైద్యులు మాయమైపోతారు. రాత్రి వేళల్లో వచ్చే రోగులకు ప్రథమ చికిత్స చేసి సేవలందించేది, ఆపద్బాంధువుల్లా ఆదుకునేది నర్సులే.  ఆ సమయంలో నర్సులు అందుబాటులో లేకుంటే ఎంతో మంది రోగు లు మృతి చెందడం ఖాయం.
 
 ఆప్యాయ పలకరింపు ఎంతో ఆనందాన్నిస్తుంది..
 రోగం నయమయ్యాక ఆ రోగి పిలిచే ఆప్యాయ పలకరింపు గొప్ప ఆనందాన్నిస్తుంది. ఆ ఆనందం ముందు ఏదైనా తక్కువే. రోగులందరినీ కుటుంబ సభ్యుల్లా భావిస్తాను. అందుకే రోగం ఎంత భయూంతకమైనదైనా సేవచేయగలుగుతున్నాను. అన్ని ఉద్యోగాలకంటే ఉన్నతమైనది నర్సు వృత్తి. సేవచేయూలన్న కోరిక ఉన్నా అది అందరికీ లభించదు.
 - పి.రూపాదేవి,  ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా కార్యదర్శి
 
 నైటింగేల్ స్ఫూర్తితో...
 రోగులకు విశిష్ట సేవలందించి నర్సులందరికీ ఆదర్శవంతంగా నిలిచిన నైటింగేల్ స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తున్నా. నర్సుగా సేవలందించే సమయంలో రోగుల కళ్లలో ఆనందం, వారు పంచే అభిమానం మరచిపోలేనిది. ఆస్పత్రికి వచ్చే రోగులందరినీ కుటుంబ సభ్యులుగా భావించి సేవలందిస్తున్నా.
 - ఎ.నిర్మలాదేవి, ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా సభ్యురాలు
 
 మనస్ఫూర్తిగా సేవలందిస్తున్నా...
 నర్సుగా విధుల్లో చేరినప్పటి నుంచి నేటి వరకు ఎంతో ఇష్టంగా రోగులకు సేవ చేశాను. ఇకపై కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తాను. ఆపదలో ఉన్నవారికి సాయంచేసే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. నర్సులందరికీ నైటింగేల్ స్ఫూర్తికావాలి. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి.
 - కె.రాంబాయి,  ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement