ఏమిటీ గ‘లీజు’..?
ఈ దుకాణాన్ని చూశారా..శ్రీకాకుళం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉంది. స్వప్న హెయిర్ స్టైల్స్ పేరుతో..ఓ సెలూన్‌ను నిర్వహిస్తున్నారు. దీనిని..మాజీ కౌన్సిలర్ లండ శ్రీను..మున్సిపాలిటీ నుంచి లీజుకు తీసుకున్నారు. అయితే..దీనిని ఆయన నిర్వహించకుండా..టి.నాగరాజు అనే వ్యక్తికి సబ్ లీజుకు ఇచ్చారు. ఇలా..మున్సిపాలిటీలో..సబ్ లీజుల పర్వం నడుస్తోంది. మున్సిపాలిటీ నుంచి దుకాణాలను తక్కువకు దక్కించుకుని..వాటిని సబ్ లీజులకు ఇచ్చి..అద్దెలు వసూలు చేసుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. సాక్షాత్తూ..మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే..సబ్ లీజుల దందా నడుస్తోందంటే..పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రిమ్స్‌క్యాంపస్: జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీలు,రాజాం, పాలకొండ నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో వందలాది దుకాణాలు ఉన్నాయి. వీటిని..నిరుపేద వ్యాపారుల అభ్యన్నతి కోసం లీజు ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. టెండర్ల ప్ర క్రియ ద్వారా తక్కువ అద్దెలను వసూ లు చేస్తున్నారు. ఇక్కడే కొందరు గలీ జు దారులు తమ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనకు తూట్లు పొడుస్తూ..తక్కువ అద్దెలకు దుకాణాలను అద్దెకు తీసుకుని..సబ్ లీజులకు ఇస్తున్నారు. అధిక మొత్తాల్లో అద్దెలను వసూ లు చేసుకుంటున్నారు. ఇలా..70 శాతం దుకాణాలు సబ్‌లీజులకిచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సబ్‌లీజ్‌కు దుకాణాలను ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం. అయినా..అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు.
331 దుకాణాలకు గాను..200 వరకు సబ్ లీజులే...
శ్రీకాకుళం మున్సిపాలిటీలో..ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 14 షా పింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిలో మొత్తం 402 దుకాణాలు ఉండగా..331 దుకాణాలను లీజ్‌కు ఇచ్చారు. మిగిలిన 71 ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే..లీజ్‌కు తీసుకున్న 331 దుకాణాల్లో సుమారు 200 వరకు సబ్‌లీజులకు వెళ్లినట్టు తెలుస్తోంది.ఇలా సబ్‌లీజుల వ్యవహారం నడుపుతున్న వారంతా..రాజకీయ పలుకుబడి ఉన్నవారు..మున్సిపల్ కౌన్సిలర్లుగా పనిచేసిన వారే కావడం గమనార్హం.
పత్తాలేని గుడ్‌విల్ ప్రతిపాదనలు
లీజు దుకాణాలను సబ్‌లీజులకు ఇస్తున్న వైనంపై మున్సిపల్ అధికారులు గతంలో గుడ్‌విల్ ప్రతిపాదనలు చేశారు. లీజు దారుల నుంచి సబ్ లీజుకు తీసుకుని అద్దె చెల్లిస్తున్న వారికే నేరుగా దుకాణాలను కట్టబెట్టే ఆలోచన చేశారు. వారి నుంచి కొంత గుడ్‌విల్‌ను మున్సిపాలిటీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఒక్కో దుకాణానికి సుమా రు *లక్ష వరకు తీసుకుని..దుకాణాలను కట్టబెట్టాలని ఆలోచన చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు పత్తా లేకుం డా పోయింది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారిం చి..ఈ బాగోతానికి చెక్ చెప్పాలని పలువురు కోరుతున్నారు.