వైద్యమో.. రామచంద్రా! | Rims will be transferred to the regular doctors | Sakshi
Sakshi News home page

వైద్యమో.. రామచంద్రా!

Published Mon, Sep 22 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

వైద్యమో.. రామచంద్రా!

వైద్యమో.. రామచంద్రా!

 రిమ్స్ క్యాంపస్: రాత్రి 9 గంటలు: జాతీయ రహదారిపై పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108లో రిమ్స్‌కు తీసుకొచ్చారు,9:20:  డ్యూటీలో ఉన్న క్యాజువాల్టీ డాక్టర్ వారిని పరిశీలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో సంబంధిత వైద్యులను ఫోన్ చేసి పిలిచారు.9:45: వైద్యులు హుటహుటిన రిమ్స్‌కు చేరుకుని వైద్య సేవలందించి క్షతగాత్రుల ప్రాణాలు కాపాడారు...వారు స్థానికంగానే నివసిస్తున్న రెగ్యులర్ వైద్యులు కావడం వల్లే అత్యవసర సమయంలో క్షణాల్లో ఆస్పత్రిలో వాలిపోయి చికిత్స అందించారు. ప్రాణాలు పోకుండా కాపాడారు. మిగతా వైద్యుల్లో చాలా వరకు విశాఖ, తదితర దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నవారే. ఈ రెగ్యులర్ వైద్యుల సేవలు 20 రోజుల్లో దూరం కానున్నాయి. చుట్టపుచూపు వైద్యమే గత్యంతరం కానుంది. అదేంటి అంటారా..
 
 785 జీవోతో షాక్
 జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఐదేళ్లకుపైగా సర్వీసు ఉన్న వైద్యులను బదిలీ చేయనుండటంతో వైద్యం కోసం డాక్టర్లను వెత్తుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడనుం ది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 785 ప్రకారం రాష్ట్రంలో వైద్య కళాశాలలను ఎ, బి, సి కేటగిరీలుగా  విభజించారు. వీటిలో ఐదేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న వైద్యులను బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ ప్రకారం చూస్తే పాత జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి ప్రస్తుత రిమ్స్‌లోనూ కొనసాగుతున్న 17 మంది రెగ్యులర్ వైద్యులు ఈ కోవలోకి వస్తారు. దాంతో వీరి బదిలీకి రంగం సిద్ధమైంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ బదిలీల ఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే సెమీ అటానమస్ సంస్థగా ఉన్న రిమ్స్ కళాశాల వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల నుంచి స్ధానికంగా ఉంటూ రాత్రి పగలు అన్న తేడా లేకుండా రోగులకు వైద్యం అందిస్తున్న రెగ్యులర్ డాక్టర్లను బదిలీ చేయాలన్న నిర్ణయం  చర్చనీయాంశమైంది.
 
 విశాఖ వైద్యులు వస్తే అంతే..
 ఈ 17 మంది వైద్యులను బదిలీ చేస్తే వారి స్థానంలో ఎక్కువ మంది విశాఖపట్నం నుంచే వచ్చే అవకాశముంది. విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలల్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులను కూడా బదిలీ చేయనుండటమే దీనికి కారణం. వారు తమ అప్షన్‌గా అత్యంత చేరువలో ఉన్న శ్రీకాకుళం రిమ్స్‌నే ఎంచుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే విశాఖ నుంచి బదిలీపై వచ్చే వారు స్థానికంగా ఉండే పరిస్ధితి లేదు. విశాఖపట్నంలో ఉన్నవారంతా ప్రైవే ట్ ఆస్పత్రుల్లో పని చేస్తుండటమో.. సొంతంగా క్లినిక్‌లు నడుపుకోవడమో చేస్తున్నారు. వారు ఇక్కడికి బదిలీ అయినా వాటిని వదులుకోకుండా రోజూ విశాఖ నుంచి రాకపోకలు సాగించడం తథ్యం. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో రిమ్స్‌లో పని చేస్తున్న చాలా మంది విశాఖ వైద్యులు స్ధానికంగా ఉండకుండా నిత్యం రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్థానిక వైద్యుల స్థానంలో విశాఖ డాక్టర్లు వస్తే.. దాదాపు వైద్యులందరూ అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. రోగులకు తిప్పలు తప్పవు.
 
 దీర్ఘకాలిక సెలవులు ఖాయం
 కాగా బదిలీ అయ్యే రెగ్యులర్ వైద్యులు లాంగ్‌లీవ్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటికీ కాదంటే రాజీనామాలు చేసేందకు కూడా వారు సిద్ధంగా ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా తెలిసింది. తమను బదిలీ చేయడం అన్యాయమన్న భావనలో ఉన్న వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
 
 ప్రభుత్వ నిర్ణయం దారుణం
 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి స్థానికంగా ఉంటూ ఏ సమయంలోనైనా వైద్య సేవలందిస్తున్న వైద్యులను బదిలీ చేయాలన్న నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇప్పటికే రిమ్స్‌లో అంతంత మాత్రంగా సేవలందుతున్నాయన్న చెడ్డపేరుంది, ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని స్థానికంగా ఉంటున్న వైద్యుల బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం.
 -డాక్టర్ అప్పలనాయుడు,
  డాక్టర్ లూకలపు ప్రసన్నకుమార్,
 ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష,
 కార్యదర్శులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement