అందం అలవిమాలిన అసూయకు కారణమైతే..
గ్రేటర్ కార్పొరేషన్‌లో ‘లిప్‌స్టిక్ ’ గొడవ
మేయర్ దఫేదార్ బదిలీతో సర్వత్రా చర్చ
ఆడాళ్లు అనుకువగా ఉండడం అసాధ్యమంటారు పెద్దలు.. ఇది అక్షరాలా నిజం అనిపించే ఘటన చెన్నై నడిరోడ్డున కార్పొరేషన్ కార్యాలయం సాక్షిగా చోటు చేసుకుంది. ఒక ఒరలో రెండు కత్తులు.. సాధ్యం కాదనేలా.. కార్పొషన్‌ను శాసించే మేయర్‌కు.. ఆమెకు సహాయకారిగా ఉండే మహిళా దఫేదార్‌కు మధ్య ఏర్పడిన చిరు వివాదం.. చిలికిచిలికి గాలివానలా మారి రచ్చకెక్కింది. చివరికి ఒకరి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది... అదెలాగో మీరూ చూడండి!
సాక్షి, చెన్నై: నగర కార్పొరేషన్‌లో మహిళలు పెదావుల కు వేసుకునే లిప్‌స్టిక్ వ్యవహారం బుధవారం పెద్ద చర్చకే దారి తీసింది. మేయర్ ప్రియ వెన్నంటి ఉండే మహిళా దఫేదార్ మాధవి బదిలీ ఈ లిప్‌స్టిక్ గొడవను తెరమీదకు తెచ్చింది. వివరాలు.. చెన్నై కార్పొరేషన్‌లో గత 15 ఏళ్లుగా మాధవి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డీఎంకే మేయర్ ఆర్ ప్రియకు దఫేదార్‌గా ఉన్నారు. హఠాత్తుగా మాధవిని మనలి మండలానికి బదిలీ చేశారు. అలాగే ఆమెకు ఓ మెమో జారీ చేయడంతో ఈ వ్యవహారం లిప్‌స్టిక్ గొడవను తెరమీదకు వచ్చింది. మేయర్ ఆర్.ప్రియతో సమానంగా మాధవి లిప్‌స్టిక్ వేసుకుని రావడమే ఈ బదిలీకి కారణం అనే చర్చ జోరందుకుంది.
మేయర్ వేసుకునే రంగులోనే లిప్‌స్టిక్‌ను ఆమె అనేక సందర్భాలలో వేసుకుని రావడాన్ని ప్రియ పీఏలు ఖండించినట్టు సమాచారం. చిన్నతనం నుంచి తాను లిప్‌స్టిక్ వాడుతున్నాని, తనకు నచ్చిన రంగు,ఫ్లేవర్ వాడుతానని, దీనిని హఠాత్తుగా మార్చుకోమడం సబబు కాదని వారికి మాధవి సూచించిన నేపథ్యంలో ఈ బదిలీ వేటు పడటమే కాకుండా, ఆమె సరిగ్గా పనిచేయడం లే దంటూ మెమో జారీ చేసినట్టు కార్పొరేషన్‌లో చర్చ ఊ పందుకుంది. ఈ విషయంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ, తాను వేసుకునే లిప్‌స్టిక్, మేయర్ వేసుకునే లిప్‌స్టిక్ ఒకే విధంగా ఉందని పేర్కొంటున్నారని వాపోయారు.
తనకు నచ్చిన రంగు తాను వాడుతున్నానని, ఇది తన వ్యక్తిగతం అని వ్యాఖ్యలు చేశారు. పురుష దఫేదార్ ఇంటికి వెళ్లి పోయినా, తాను మాత్రం కుటుంబాన్ని సైతం వీడి మేయర్‌కు వెన్నంటి రేయింబవళ్లు శ్రమించినందుకు మంచి గుర్తింపునే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా వీరికి మరో రెండేళ్లు పదవి ఉండవచ్చునని, తాను ఓ ఉద్యోగిని అని, తన జర్నీ మరింతగా కార్పొరేషన్‌లో కొనసాగాల్సి ఉంటుందని వ్యాఖ్యనించడం కొనమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment