సహానా కేసులో దళిత అధికారికి బదిలీ కానుక | Transfer to officer in Sahana case | Sakshi
Sakshi News home page

సహానా కేసులో దళిత అధికారికి బదిలీ కానుక

Published Sun, Oct 27 2024 5:23 AM | Last Updated on Sun, Oct 27 2024 5:23 AM

Transfer to officer in Sahana case

చెప్పినట్టు నడుచుకోలేదని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై వేటు

వైఎస్‌ జగన్‌ వచ్చేలోపే సహానా భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని ప్రభుత్వ పెద్దల ఆదేశం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేంద్ర మంత్రి పెమ్మ­సాని చంద్రశేఖర్‌ అనుచరుడైన రౌడీషీటర్‌ నవీన్‌ చేతిలో హతమైన తెనాలి యువతి మధిర సహానా (25) కేసులో తాము చెప్పిన పనిని సకాలంలో చేయ­లేదన్న అక్కసుతో గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ ఏకుల కిరణ్‌కుమార్‌పై కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. 

దళితుడైన కిరణ్‌­కుమార్‌ బదిలీ ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం అయ్యిందని, నేడోరేపో బదిలీ ఆదేశాలు వచ్చే అవ­కా­శం ఉందని సమాచారం. ప్రభుత్వ ఆదే­శాల ప్రకా­రం ఆయన నడుచుకోలేదని, సీఎంఓ కార్యాలయం నుంచి చెప్పినా వినలేదనే ఆరో­పణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సీటు నుంచి ఆయనను తొల­గిస్తూ సీఎం కార్యాలయం ఆమోద ముద్ర వేసింది. 

అసలు కారణం ఇదీ..
రౌడీషీటర్‌ నవీన్‌ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్ప­టికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీ­యూలో ఉంచి ఆస్పత్రి అ«ధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్‌ చేతిలో దారు­ణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేప­ట్టారు.

దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యు­లను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్‌ నవీన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు. 

ఆమెకు మరుసటి రోజు ఉదయం 6గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమా­ర్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికా­రులు భావించారు. ఆ మేరకు జీజీ­హెచ్‌ సూపరింటెండెంట్‌ ఏకుల కిరణ్‌­కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీ­లించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. 

సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్‌ ఎం­డగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభు­త్వ పెద్దలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై సీరియస్‌ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement