డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో ముఖ్య నేత ఆశీస్సులు, సిఫారసులు, కాసులకే పెద్దపీట
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే... అన్నచందంగా మారింది పరిపాలనలో కీలకమైన డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారం. ముఖ్య నేత ఆశీస్సులు పొందిన వారికి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యులకు ముడుపులు సమర్పించుకున్న వారికి పనితీరు, సీనియారిటీతో సంబంధం లేకుండా మంచి పోస్టులు కట్టబెడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మిగిలిన వారికి అప్రాధాన్య పోస్టులు ఇవ్వడం... లేదా జీఏడీకి కేటాయించి ఏ పనీ చెప్పకుండా కూర్చోబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం సోమవారం రాత్రి డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించి బదిలీలు, పోస్టింగ్‌లపై రెండు జీవోలు జారీ చేసింది. అందులో సిఫారసులు చేయించినవారికి, కాసులిచ్చిన వారికి మంచి పోస్టింగ్‌లు ఇచ్చారని తెలుస్తోంది. మిగిలిన వారికి పనిష్‌మెంట్ పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆర్డీవోలుగా పనిచేసిన ఏడుగురు అధికారులకు ఇటీవల పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టిన కూటమి సర్కారు... ఇప్పుడు వారిని సీఆర్‌డీఏకి కేటాయించడం గమనార్హం.
వంద మందికి పైగా జీఏడీకి: గత నెల 24వ తేదీన 30 మందికిపైగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయగా, వారిలో 11 మందికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోసారి 70 మందికిపైగా ఆర్డీవోలు, ఇతర కీలక స్థానాల్లో ఉన్న వారిని బదిలీ చేసినప్పుడు సుమారు 30 మందిని జీఏడీకి ఎటాచ్ చేసింది. వీరందరినీ జీఏడీకి పంపడానికి రాజకీయ కారణాలే తప్ప... మరే ఇతర కారణాలు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం 100 మందికిపైగా డిప్యూటీ కలెక్టర్లు జీఏడీకి ఎటాచ్ అయి ఉన్నారు. వారి సేవలు ఉపయోగించుకోకుండా, కావాలని రాజకీయ ముద్ర వేసి పక్కనపెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు.
సిఫారసులు, కాసులతోనే: మరోవైపు సీనియారిటీ, పనితీరుతో సంబంధం లేకుండా కొందరు ముఖ్య నేతను ప్రసన్నం చేసుకుని పోస్టింగ్‌లు దక్కించుకుంటున్నారు. ఇప్పటివరకు ఎక్కడో లూప్ లైన్‌లో ఉండి హఠాత్తుగా మంచి పోస్టింగ్‌లు దక్కించుకోవడానికి అదే కారణంగా కనిపిస్తోంది. ముఖ్య నేతను కలిసి భారీగా సమర్పించుకున్న వారికి కీలక పోస్టులు దక్కాయి. జిల్లా కేంద్రాల్లోని ఆర్డీవో పోస్టుల కోసం రూ.30 లక్షలకుపైగా కొందరు ఖర్చు చేసి పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. కొన్ని కీలకమైన ఆర్డీవో సీట్లకు అయితే ఏకంగా రూ.కోటి నుంచి రూ.మూడు కోట్లు కూడా ఖర్చు పెట్టి పోస్టింగ్‌లు దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో కీలకమైన ఆర్డీవో, ఇతర ముఖ్యమైన పోస్టింగుల్లో డిప్యూటీ కలెక్టర్లను నియమించడానికి భారీగా డబ్బు తీసుకుని సిఫారసులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment