అడిగితే.. కడిగేస్తా! | rims recruitment was done in wrong way | Sakshi
Sakshi News home page

అడిగితే.. కడిగేస్తా!

Published Sat, Jan 25 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

అడిగితే.. కడిగేస్తా!

అడిగితే.. కడిగేస్తా!

 నిన్న నా దగ్గరకొచ్చావు.. ఇప్పుడు సూపరింటెండెంట్ వద్దకు వెళ్లావు.. నీకింకేం పని లేదా?.. ఏమైనా అంటే ఏడ్చేస్తున్నావు.. నీకు కాకుండా వేరొకరికి ఉద్యోగం వచ్చిందని సహించలేకపోతున్నావా లేక కడుపు మంటా?!.. అన్ని అర్హతలున్నా తనకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వచ్చిన ఒక అభ్యర్థినికి ఎదురైన ఎత్తిపొడుపులు.. ఈసడింపులు ఇవి. ఆమెకు జరిగిన అన్యాయమేమిటో సావకాశంగా విని.. పరిశీలించి.. వీలుంటే న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారే ఇలా విరుచుకుపడటంతో బిక్కచచ్చిపోవడం ఆ అభ్యర్థిని వంతైంది. రిమ్స్ ట్రామాకేర్ పోస్టుల  విషయంలో గత కొన్నాళ్లుగా డిప్యూటీ డెరైక్టర్ సృజన తీరు ఇలాగే ఉంది.
 
 రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: జిల్లా పెద్దాస్పత్రి రిమ్స్ ట్రామాకేర్ విభాగంలో పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిన తప్పులను సరిదిద్ది, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడానికి ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న ఉన్నతాధికారులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. మొదటి నుంచి ఈ నియామకాల్లో జరిగిన తప్పులను వార్తా కథనాల రూపంలో ‘సాక్షి’ ఎత్తిచూపుతున్న విషయం తెలిసిందే. మెరిట్, ఎంపిక జాబితాలను చూసి తమకు అన్యాయం జరిగిందని తెలుసుకుని, అధికారులకు విన్నవించుకునేందుకు వస్తున్న అభ్యర్థులను వారు కసురుకుంటున్నారు. కన్నీళ్లు పెట్టించి మరీ వెనక్కు పంపుతున్నారు. శుక్రవారం ‘న్యూస్‌లైన్ ఎదుటే డీడీ సృజన ఒక అభ్యర్థినిపై విరుచుకుపడ్డారు. ఎంతమందికి చెప్పుకొన్నా ఇంక ఉద్యోగం ఇచ్చేదిలేదని మొహం మీదే కొట్టినట్లు చెప్పారు.
 
 అసలేం జరిగింది?
 పాతపట్నం మండలం కాగువాడకు  చెందిన చిట్టివలస నాగమ్మ బీసీ-ఏ కేటగిరీలో ట్రామాకేర్ స్టాఫ్ నర్సు పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. వెయిటెజీతో కలిపి 74.67 శాతం మార్కులతో మెరిట్ జాబితాలో 21వ స్థానంలో నిలిచింది. మొత్తం 19 పోస్టులకు గాను 19, 20 స్థానాల్లో ఒకే అభ్యర్థి పేరు ఉండటంతో ఒక నెంబర్ తగ్గి నాగమ్మ 20వ స్థానంలో ఉండాలి. ఇదిలా ఉంటే  ఇదే కేటగిరీలో కొడూరు రాఘవమ్మ అనే అభ్యర్థిని 77.37 శాతంతో మెరిట్ జాబితాలో 4వ స్థానంలో ఉంది. ఈమె కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థి కావటంతో తొలుత నాన్‌లోకల్‌గా పరిగణించారు. కానీ ఏం జరిగిందో గానీ ఈమెను ఎంపిక చేస్తూ తుది జాబితాలో పేరు పెట్టేశారు.
 
  వాస్తవానికి స్టాఫ్ నర్సు పోస్టులకు రీజీయన్ యూనిట్‌గా తీసుకోవాలి. ఆ ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల అభ్యర్థులనే లోకల్‌గా పరిగణించాలి. మిగతా జిల్లాల వారిని నాన్ లోకల్‌గా పరిగణించి వారికి కేటాయించిన 15 శాతం కింద మెరిట్ జాబితాలో మొదట ఉన్న ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయాలి. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోకూడదు. దీనికి విరుద్ధంగా నాలుగో స్థానంలో ఉన్న రాఘవమ్మను లోకల్‌గా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసేశారు. మరోవైపు రాఘవమ్మ డేట్ ఆఫ్ పాసింగ్ కూడా తప్పని తెలిసింది. 2012లో జీఎన్‌ఎమ్ ఉత్తీర్ణత సాధించగా, 2008లో ఉత్తీర్ణురాలైనట్లు మెరిట్ జాబితాలో చూపించి ఐదు మార్కులు వెయిటేజి ఇచ్చి 77.37 శాతంగా పేర్కొన్నారు. అదే 2012 నుంచి లెక్క వేస్తే ఒక్క మార్కు వెయిటెజీతో కలిపి ఆమె సాధించిన మార్కులు 73.37 శాతంగానే ఉండేది. ఫలితంగా లోకల్ అభ్యర్థి అయిన నాగమ్మ ముందువరుసలోకి వచ్చి తుది జాబితాలో చేరేది. ఉద్యోగం ఖచ్చితంగా వచ్చేది.
 
 న్యాయం చేయమంటే నిప్పులు చెరిగారు
 రాఘవమ్మ విషయంలో జరిగిన తప్పులు.. ఫలితంగా తనకు జరిగిన అన్యాయాన్ని పై లెక్కలతో సహా గురువారం డీడీ సృజనను కలిసి నాగమ్మ వివరించింది. న్యాయం చేయాలని అభ్యర్థించింది. డీడీ మాత్రం కనీసం సానుభూతి అయినా చూపకపోగా సూటిపోటి మాటలతో విరుచుకుపడ్డారు. వేరొకరికి ఉద్యోగం వస్తే నీకు కడుపు మంటా.. మీకేం పనిలేదా అంటూ ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. దీంతో కన్నీరు మున్నీరైన నాగమ్మ బయటకు వచ్చేసింది. పక్కన కార్యాలయంలో ఉన్న ఓ గుమస్తా నాగమ్మ వివరాలను పరిశీలించి, ఖచ్చితంగా ఉద్యోగం రావల్సి ఉందని చెప్పటంతో మిణుకు మిణుకుమంటున్న ఆశలతో శుక్రవారం మళ్లీ రిమ్స్‌కు వచ్చి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్‌ను కలిశారు. వెంటనే ఆయన డీడీ సృజనకు ఫోన్ చేసి నాగమ్మ వివరాలను తెలియజేయగా.. ‘మిమ్మల్ని ఆ అభ్యర్థి తప్పుదోవ పట్టిస్తోందని’ చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత ఐదు నిమిషాల వ్యవధిలోనే డీడీ స్వయంగా సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న అభ్యర్థిని నాగమ్మపై మళ్లీ విరుచుకుపడ్డారు. ‘నువ్వు నిన్ననే నా దగ్గరకు వచ్చావు, మళ్లీ ఈ రోజు కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చావా. నీకేమీ పని లేదా..’ అని కసురుకున్నారు.
 
 మెరిట్ జాబితా తొలగింపు
 ఆ సమయంలో అక్కడే ఉన్న ‘న్యూస్‌లైన్’ కల్పించుకొని అక్కడే గోడకు అతికించి ఉన్న మెరిట్ జాబితాను డీడీ, సూపరింటెండెంట్లకు చూపించి జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపడంతో వారిద్దరూ కంగుతిన్నారు. వెంటనే డీడీ అటెండర్‌ను పిలిచి జాబితాను చించేయాలని ఆదేశించారు. దానికి ‘న్యూస్‌లైన్’ అభ్యంతరం చెబుతూ జాబితాను ఫొటో తీసుకుంటామని చెబుతున్నా వినిపించుకోకుండా తనే స్వయంగా జాబితాను చించేసి విస్మయానికి గురి చేశారు. అక్కడితో ఆగకుండా ఈమెకు ఉద్యోగం ఏవిధంగా వస్తుంది?.. వాస్తవంగా రావాల్సి ఉన్నా ఇప్పుడు రాదని స్పష్టం చేశారు.
 
 కలెక్టరే చెప్పారు.. ఇంకివ్వం!
 
 ఇప్పుడు ఇంకేం చేయలేం. తప్పులు జరిగాయని అభ్యంతరం చెప్పే వారిని పక్కనే పెట్టేసి.. జాబితా లో ఉన్న వారికే ఉద్యోగాలిచ్చేయాలని కలెక్టర్‌గారే చెప్పారు.. ఇదీ డీసీ సృజన నిష్కర్షగా చెప్పిన మాట. మెరిట్ జాబితా ప్రకారం లోకల్ అయిన నాగమ్మకు ఉద్యోగం రావాలి కదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వీళ్లకు ఉద్యోగాలివ్వాలంటే అదో పెద్ద పని, ఇప్పుడు అదంతా చేయడం కుదరదు అని సెలవిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement