Rims Tramaker
-
అడిగితే.. కడిగేస్తా!
నిన్న నా దగ్గరకొచ్చావు.. ఇప్పుడు సూపరింటెండెంట్ వద్దకు వెళ్లావు.. నీకింకేం పని లేదా?.. ఏమైనా అంటే ఏడ్చేస్తున్నావు.. నీకు కాకుండా వేరొకరికి ఉద్యోగం వచ్చిందని సహించలేకపోతున్నావా లేక కడుపు మంటా?!.. అన్ని అర్హతలున్నా తనకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వచ్చిన ఒక అభ్యర్థినికి ఎదురైన ఎత్తిపొడుపులు.. ఈసడింపులు ఇవి. ఆమెకు జరిగిన అన్యాయమేమిటో సావకాశంగా విని.. పరిశీలించి.. వీలుంటే న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారే ఇలా విరుచుకుపడటంతో బిక్కచచ్చిపోవడం ఆ అభ్యర్థిని వంతైంది. రిమ్స్ ట్రామాకేర్ పోస్టుల విషయంలో గత కొన్నాళ్లుగా డిప్యూటీ డెరైక్టర్ సృజన తీరు ఇలాగే ఉంది. రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: జిల్లా పెద్దాస్పత్రి రిమ్స్ ట్రామాకేర్ విభాగంలో పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిన తప్పులను సరిదిద్ది, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడానికి ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న ఉన్నతాధికారులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. మొదటి నుంచి ఈ నియామకాల్లో జరిగిన తప్పులను వార్తా కథనాల రూపంలో ‘సాక్షి’ ఎత్తిచూపుతున్న విషయం తెలిసిందే. మెరిట్, ఎంపిక జాబితాలను చూసి తమకు అన్యాయం జరిగిందని తెలుసుకుని, అధికారులకు విన్నవించుకునేందుకు వస్తున్న అభ్యర్థులను వారు కసురుకుంటున్నారు. కన్నీళ్లు పెట్టించి మరీ వెనక్కు పంపుతున్నారు. శుక్రవారం ‘న్యూస్‌లైన్ ఎదుటే డీడీ సృజన ఒక అభ్యర్థినిపై విరుచుకుపడ్డారు. ఎంతమందికి చెప్పుకొన్నా ఇంక ఉద్యోగం ఇచ్చేదిలేదని మొహం మీదే కొట్టినట్లు చెప్పారు. అసలేం జరిగింది? పాతపట్నం మండలం కాగువాడకు చెందిన చిట్టివలస నాగమ్మ బీసీ-ఏ కేటగిరీలో ట్రామాకేర్ స్టాఫ్ నర్సు పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. వెయిటెజీతో కలిపి 74.67 శాతం మార్కులతో మెరిట్ జాబితాలో 21వ స్థానంలో నిలిచింది. మొత్తం 19 పోస్టులకు గాను 19, 20 స్థానాల్లో ఒకే అభ్యర్థి పేరు ఉండటంతో ఒక నెంబర్ తగ్గి నాగమ్మ 20వ స్థానంలో ఉండాలి. ఇదిలా ఉంటే ఇదే కేటగిరీలో కొడూరు రాఘవమ్మ అనే అభ్యర్థిని 77.37 శాతంతో మెరిట్ జాబితాలో 4వ స్థానంలో ఉంది. ఈమె కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థి కావటంతో తొలుత నాన్‌లోకల్‌గా పరిగణించారు. కానీ ఏం జరిగిందో గానీ ఈమెను ఎంపిక చేస్తూ తుది జాబితాలో పేరు పెట్టేశారు. వాస్తవానికి స్టాఫ్ నర్సు పోస్టులకు రీజీయన్ యూనిట్‌గా తీసుకోవాలి. ఆ ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల అభ్యర్థులనే లోకల్‌గా పరిగణించాలి. మిగతా జిల్లాల వారిని నాన్ లోకల్‌గా పరిగణించి వారికి కేటాయించిన 15 శాతం కింద మెరిట్ జాబితాలో మొదట ఉన్న ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయాలి. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోకూడదు. దీనికి విరుద్ధంగా నాలుగో స్థానంలో ఉన్న రాఘవమ్మను లోకల్‌గా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసేశారు. మరోవైపు రాఘవమ్మ డేట్ ఆఫ్ పాసింగ్ కూడా తప్పని తెలిసింది. 2012లో జీఎన్ఎమ్ ఉత్తీర్ణత సాధించగా, 2008లో ఉత్తీర్ణురాలైనట్లు మెరిట్ జాబితాలో చూపించి ఐదు మార్కులు వెయిటేజి ఇచ్చి 77.37 శాతంగా పేర్కొన్నారు. అదే 2012 నుంచి లెక్క వేస్తే ఒక్క మార్కు వెయిటెజీతో కలిపి ఆమె సాధించిన మార్కులు 73.37 శాతంగానే ఉండేది. ఫలితంగా లోకల్ అభ్యర్థి అయిన నాగమ్మ ముందువరుసలోకి వచ్చి తుది జాబితాలో చేరేది. ఉద్యోగం ఖచ్చితంగా వచ్చేది. న్యాయం చేయమంటే నిప్పులు చెరిగారు రాఘవమ్మ విషయంలో జరిగిన తప్పులు.. ఫలితంగా తనకు జరిగిన అన్యాయాన్ని పై లెక్కలతో సహా గురువారం డీడీ సృజనను కలిసి నాగమ్మ వివరించింది. న్యాయం చేయాలని అభ్యర్థించింది. డీడీ మాత్రం కనీసం సానుభూతి అయినా చూపకపోగా సూటిపోటి మాటలతో విరుచుకుపడ్డారు. వేరొకరికి ఉద్యోగం వస్తే నీకు కడుపు మంటా.. మీకేం పనిలేదా అంటూ ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. దీంతో కన్నీరు మున్నీరైన నాగమ్మ బయటకు వచ్చేసింది. పక్కన కార్యాలయంలో ఉన్న ఓ గుమస్తా నాగమ్మ వివరాలను పరిశీలించి, ఖచ్చితంగా ఉద్యోగం రావల్సి ఉందని చెప్పటంతో మిణుకు మిణుకుమంటున్న ఆశలతో శుక్రవారం మళ్లీ రిమ్స్‌కు వచ్చి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్‌ను కలిశారు. వెంటనే ఆయన డీడీ సృజనకు ఫోన్ చేసి నాగమ్మ వివరాలను తెలియజేయగా.. ‘మిమ్మల్ని ఆ అభ్యర్థి తప్పుదోవ పట్టిస్తోందని’ చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత ఐదు నిమిషాల వ్యవధిలోనే డీడీ స్వయంగా సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న అభ్యర్థిని నాగమ్మపై మళ్లీ విరుచుకుపడ్డారు. ‘నువ్వు నిన్ననే నా దగ్గరకు వచ్చావు, మళ్లీ ఈ రోజు కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చావా. నీకేమీ పని లేదా..’ అని కసురుకున్నారు. మెరిట్ జాబితా తొలగింపు ఆ సమయంలో అక్కడే ఉన్న ‘న్యూస్‌లైన్’ కల్పించుకొని అక్కడే గోడకు అతికించి ఉన్న మెరిట్ జాబితాను డీడీ, సూపరింటెండెంట్లకు చూపించి జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపడంతో వారిద్దరూ కంగుతిన్నారు. వెంటనే డీడీ అటెండర్‌ను పిలిచి జాబితాను చించేయాలని ఆదేశించారు. దానికి ‘న్యూస్‌లైన్’ అభ్యంతరం చెబుతూ జాబితాను ఫొటో తీసుకుంటామని చెబుతున్నా వినిపించుకోకుండా తనే స్వయంగా జాబితాను చించేసి విస్మయానికి గురి చేశారు. అక్కడితో ఆగకుండా ఈమెకు ఉద్యోగం ఏవిధంగా వస్తుంది?.. వాస్తవంగా రావాల్సి ఉన్నా ఇప్పుడు రాదని స్పష్టం చేశారు. కలెక్టరే చెప్పారు.. ఇంకివ్వం! ఇప్పుడు ఇంకేం చేయలేం. తప్పులు జరిగాయని అభ్యంతరం చెప్పే వారిని పక్కనే పెట్టేసి.. జాబితా లో ఉన్న వారికే ఉద్యోగాలిచ్చేయాలని కలెక్టర్‌గారే చెప్పారు.. ఇదీ డీసీ సృజన నిష్కర్షగా చెప్పిన మాట. మెరిట్ జాబితా ప్రకారం లోకల్ అయిన నాగమ్మకు ఉద్యోగం రావాలి కదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వీళ్లకు ఉద్యోగాలివ్వాలంటే అదో పెద్ద పని, ఇప్పుడు అదంతా చేయడం కుదరదు అని సెలవిచ్చారు. -
దురుద్దేశంతోనే..
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రిమ్స్ ట్రామాకేర్ విభాగం పోస్టుల భర్తీ బాధ్యతను రిమ్స్ అధికారులు దురుద్దేశంతోనే స్వీకరించారని సమాచారం. వాస్తవానికి ఈ బాధ్యత జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి(డీసీహెచ్ఎస్)ది. అయితే పోస్టులను సుదీర్ఘఠ కాలంగా భర్తీ చేయడం లేద నే సాకుతో రిమ్స్ అధికారులు జిల్లా ఉన్నతాధికారులను ఒప్పించి ఆ బాధ్యతను తమ భుజానికెత్తుకున్నారు. దీనివెనుక జిల్లాకు చెందిన ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో రిమ్స్‌లో జరిగిన పలు పోస్టుల భర్తీలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వీటిని పట్టించుకోకుండా తాజా నియామకాల బాధ్యతను జిల్లా అధికారులు వారికి అప్పగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల బేఖాతరు తమను కట్టడి చేసేవారెవరూ లేకపోవటంతో రిమ్స్ అధికారులు మంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. గతంలో ఆడియాలజిస్ట్గా ఓ మహిళను నియమించాలని స్వయంగా కలెక్టర్ ఆదేశించినా, రాష్ట్ర వైద్య విద్యామంత్రి సూచించినా దానిని అమలు చేయలేదు. ఆరు నెలల డిప్లమా పూర్తిచేసిన ఓ వ్యక్తిని ఆడియాలజిస్ట్ పోస్టులో కొనసాగిస్తున్నారు. ఆడియాలజీలో నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన మహిళను ఆ పోస్టులో నియమించాలని ఆదేశించినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. చివరకు చేసేది లేక కలెక్టరే.. సదరం ద్వారా ఆ మహిళను నియమించి రిమ్స్‌కు కేటాయించారు. డిప్లమా పూర్తిచేసిన వ్యక్తి రూ.పదివేలకుపైగా జీతం పొందుతుండగా సదరం ద్వారా నియమితురాలైన మహిళకు రూ.5 వేలే ఇస్తుండటం గమనార్హం. తాము చేస్తున్న పనుల్లో ఎందరికో భాగస్వామ్యం ఉందని కొందరు రిమ్స్ అధికారులు బహిరంగంగా చెబుతుండటం విశేషం. -
రిమ్స్‌లో అదే డ్రామా!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రిమ్స్‌లోని ట్రామాకేర్ విభాగంలో 43 పోస్టుల భర్తీకి అధికారులు చేపట్టిన ప్రక్రియలో డ్రామా కొనసాగుతున్నట్టు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు చోటు చేసుకున్న అవకతవకలను ‘డ్రామా’కేర్!, ‘రోస్టర్ రచ్చ’ అనే శీర్షికలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కంగుతిన్న అధికారులు ఎంపికైన అభ్యర్థులకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించకుండా కేవలం ధ్రువపత్రాల పరిశీలనతో సరిపెట్టారు. ఈ సందర్భంగా డైరక్టర్ టి.జయరాజ్ మాట్లాడుతూ నియామకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ముందుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తామని, వచ్చిన అభ్యంతరాలను కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు నివేదిస్తామని వివరించారు. దీనివల్ల నియామకాల్లో మరో 10 రోజులు జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. అనుమానాలకు కారణాలివీ.. అన్ని విభాగాల మెరిట్ అభ్యర్థులను పిలవకుండా కొంతమంది ధ్రువపత్రాలను మాత్రమే గురువారం పరిశీలించారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గతంలో పలు అభియోగాలు ఎదుర్కొన్న సిబ్బంది ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొనటంపై మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 43 పోస్టులకు 1848 దరఖాస్తులు రాగా పోస్టులను ఇప్పటికే జిల్లా చెందిన ఓ మంత్రి సోదరుడు, రిమ్స్‌లోని ముగ్గురు అధికారులు, జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి పంచుకున్నారని, అందుకే ఇన్ని అభియోగాలు వస్తున్నా స్పష్టమైన హామీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని పలువురు అభ్యర్థులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలనలో డెరైక్టర్ జయరాజ్తోపాటు సూపరింటెండెంట్ అరవింద్, డీన్ ప్రసాద్, ప్రొఫెసర్ సుజన, ఎస్.శ్రీనివాసరావు, ఎం.ఇంద్రాణి, జి.నీలాద్రి, జి.వెంకటరావు, రాజేశ్వరి పాల్గొన్నారు. ఇవీ అభ్యంతరాలు డ్రైవర్ పోస్టుకు సంబంధించి తనకు అన్ని అర్హతలు ఉండగా, తనకన్నా తక్కువ అర్హతలు కలిగినవారికి బీసీ-డీ కేటగిరీలో ఇచ్చారని కె.శాంతారావు అనే వ్యక్తి అభ్యంతరం తెలిపారు. ఈసీజీ విభాగంలో తనకు 71.28 మెరిట్ పాయింట్లు ఉండగా 65.61 పాయింట్లు ఉన్న మహిళ ఎంపిక జాబితాలో ఉన్నారని యు.భాస్కరరావు ఫిర్యాదు చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు రోస్టర్‌ను ప్రకటించలేదని, అప్పటికప్పుడు మహిళకు కేటాయించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫార్మశీ విభాగంలో తమకు ఎక్కువ అర్హతలు, అనుభవం ఉండగా తమను కాదని వేరొకరికి కేటాయించారని ఝాన్సీరాణి, పుష్పలత అనే మహిళలు అభ్యంతరం తెలియజేశారు. రేడియోలజీ విభాగంలో వయోపరిమితి (45) పూర్తయిన అభ్యర్థిని ఎంపిక చేయడంపై పలువురు అభ్యంతర ం తెలిపారు.