రిమ్స్‌లో అదే డ్రామా!
Published Fri, Jan 17 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రిమ్స్‌లోని ట్రామాకేర్ విభాగంలో 43 పోస్టుల భర్తీకి అధికారులు చేపట్టిన ప్రక్రియలో డ్రామా కొనసాగుతున్నట్టు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు చోటు చేసుకున్న అవకతవకలను ‘డ్రామా’కేర్!, ‘రోస్టర్ రచ్చ’ అనే శీర్షికలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కంగుతిన్న అధికారులు ఎంపికైన అభ్యర్థులకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించకుండా కేవలం ధ్రువపత్రాల పరిశీలనతో సరిపెట్టారు. ఈ సందర్భంగా డైరక్టర్ టి.జయరాజ్ మాట్లాడుతూ నియామకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ముందుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తామని, వచ్చిన అభ్యంతరాలను కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు నివేదిస్తామని వివరించారు. దీనివల్ల నియామకాల్లో మరో 10 రోజులు జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు.
అనుమానాలకు కారణాలివీ..
అన్ని విభాగాల మెరిట్ అభ్యర్థులను పిలవకుండా కొంతమంది ధ్రువపత్రాలను మాత్రమే గురువారం పరిశీలించారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గతంలో పలు అభియోగాలు ఎదుర్కొన్న సిబ్బంది ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొనటంపై మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 43 పోస్టులకు 1848 దరఖాస్తులు రాగా పోస్టులను ఇప్పటికే జిల్లా చెందిన ఓ మంత్రి సోదరుడు, రిమ్స్‌లోని ముగ్గురు అధికారులు, జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి పంచుకున్నారని, అందుకే ఇన్ని అభియోగాలు వస్తున్నా స్పష్టమైన హామీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని పలువురు అభ్యర్థులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలనలో డెరైక్టర్ జయరాజ్‌తోపాటు సూపరింటెండెంట్ అరవింద్, డీన్ ప్రసాద్, ప్రొఫెసర్ సుజన, ఎస్.శ్రీనివాసరావు, ఎం.ఇంద్రాణి, జి.నీలాద్రి, జి.వెంకటరావు, రాజేశ్వరి పాల్గొన్నారు.
ఇవీ అభ్యంతరాలు
డ్రైవర్ పోస్టుకు సంబంధించి తనకు అన్ని అర్హతలు ఉండగా, తనకన్నా తక్కువ అర్హతలు కలిగినవారికి బీసీ-డీ కేటగిరీలో ఇచ్చారని కె.శాంతారావు అనే వ్యక్తి అభ్యంతరం తెలిపారు.
ఈసీజీ విభాగంలో తనకు 71.28 మెరిట్ పాయింట్లు ఉండగా 65.61 పాయింట్లు ఉన్న మహిళ ఎంపిక జాబితాలో ఉన్నారని యు.భాస్కరరావు ఫిర్యాదు చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు రోస్టర్‌ను ప్రకటించలేదని, అప్పటికప్పుడు మహిళకు కేటాయించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫార్మశీ విభాగంలో తమకు ఎక్కువ అర్హతలు, అనుభవం ఉండగా తమను కాదని వేరొకరికి కేటాయించారని ఝాన్సీరాణి, పుష్పలత అనే మహిళలు అభ్యంతరం తెలియజేశారు.
రేడియోలజీ విభాగంలో వయోపరిమితి (45) పూర్తయిన అభ్యర్థిని ఎంపిక చేయడంపై పలువురు అభ్యంతర ం తెలిపారు.
Advertisement
Advertisement