ఫారుక్‌బాషా , శెట్టి ప్రతాప్
బతికే ఉన్న ఫారుక్‌బాషా
గోడౌన్‌లో సజీవ దహనమైన వ్యక్తి శెట్టి ప్రతాప్‌గా గుర్తింపు
పాములపాడు: నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్ గోదాంలో ఈ నెల 1న రాత్రి మంటల్లో సజీవ దహనమైన వ్యక్తిగా భావించిన ఫారుక్‌బాషా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవ దహనమైన వ్యక్తి పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్‌గా గుర్తించారు. అప్పుల్ని ఎగ్గొట్టడంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫారూక్‌బాషా తాను చనిపోయినట్టుగా చిత్రీకరించాడని తేలింది. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన ఫారుక్‌బాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు.
అతడు రైతులకు దాదాపు రూ.కోటి వరకు బకాయి పడినట్టు తెలుస్తోంది. అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడంతోపాటు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టేందుకు ఫారుక్‌బాషా చనిపోయినట్టు నమ్మించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా మంటల్లో మరణించిన వ్యక్తి ఫారుక్‌బాషానే అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి.. మృతదేహాన్ని కుటుంబ çసభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.
మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి..
కాగా.. చెలిమిల్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్ అదృశ్యమైనట్టు అతడి భార్య స్వరూప ఈ నెల 4న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మంటల్లో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను ఆమెకు చూపించగా.. చొక్కా, ఇతర ఆనవాళ్లను బట్టి తన భర్తగానే గుర్తించింది. ఫారుక్‌బాషా తన భర్తను సజీవ దహనం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహం శెట్టి ప్రతాప్‌దేననే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఫారుక్‌బాషా పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఎస్‌ఐ అశోక్‌ను వివరణ కోరగా.. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment