కలెక్టర్ వస్తున్నారని.. | collector visits RIMS Hospital | Sakshi
Sakshi News home page

కలెక్టర్ వస్తున్నారని..

Published Thu, Dec 12 2013 4:27 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

collector visits RIMS Hospital

 రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్:హీరో తన తల్లిదండ్రులకు తనో గొప్ప వైద్యుడ్నినని, హాస్పటల్ కూడా ఉందని అబద్ధం చెప్పుకొస్తాడు. హీరో ఉన్నచోటకు కన్నవారు వస్తున్నారని తెలిసిన వెంటనే హడవుడిగా లేని ఆస్పత్రిని తాత్కలికంగా సెట్ చేసి చూపిస్తూ మోసం చేస్తుంటాడు.. ఈ సన్నివేశం శంకరదాదా ఎంబీబీఎస్ చిత్రంలోనిది. ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా!  అక్కడ హీరో తల్లిదండ్రులను ఏలా మోసం చేశాడో.. జిల్లాకే తలమానకమైన రిమ్స్ అస్పత్రి అధికారులు కూడా కలెక్టర్‌ను అలాగే మోసం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ బుధవారం రిమ్స్‌కు వస్తున్నారని తెలిసి తాత్కాలికంగా అప్పటికప్పుడే పలు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని ఫ్లెక్సీల ద్వారా ఏర్పాటు చేసేశారు.
 
 ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రిమ్స్ ఆస్పత్రిని పరిశీలించిన ప్రతిసారి కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. అయితే వాటిని అమలు చేయకపోవటం.. మరోసారి ఆస్పత్రిని సందర్శించే సమయంలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. అయితే ఈసారి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ల్లాగా రిమ్స్ అధికారులు వ్యవహరించారు. ఓపీ విభాగం వద్ద అందరికీ కనిపించేలా సిటిజన్ చార్టును ఏర్పాటు చేయాలని, ఓపీ సమయాలను తెలియజేస్తూ బోర్డును ఉంచాలని రిమ్స్ అధికారులను ఇటీవల కలెక్టర్ ఆదేశించినప్పటికీ పట్టించుకోలేదు. ఇదే క్రమంలో గత నెల 28వ తేదీన ఆస్పత్రి పరిశీలనకు వచ్చిన కలెక్టర్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఓపీ విభాగం ఫొటోను తన సెల్‌తో తీశారు. తాను మరల వచ్చే సమయానికి ఇక్కడ పూర్తి సమాచారాన్ని తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలని సీరియస్‌గా చెప్పారు. అయితే ఆయన అధికారులను రిమ్స్ అధికారులు గాలికొదిలేశారు.
 
 బుధవారం రిమ్స్‌కు కలెక్టర్ వస్తున్నారని తెలుసుకొని హడావుడిగా పలు విభాగాలకు సంబంధించిన సమాచారంతో కూడిన ఫ్లెక్సీలను అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. సిటిజన్ చార్టును ఫ్లెక్సీ వేసి ఓపీ విభాగంపైన కలెక్టర్ రావటానికి అరగంట ముందు కట్టారు. ఓపీ సమయాలను తెలియజేస్తూ ఓ ఫ్లెక్సీని బోర్డుపై అంటించేశారు. ఆ బోర్డు కూడా తాత్కలికంగా ఓ బల్లపై పెట్టి కలెక్టరును మోసగించారు. మరుగుదొడ్లను పరిశీలిస్తారేమోనని భావించి మరుగుదొడ్లకు దారి అంటూ జిరాక్స్ కాగితాన్ని గోడకు అంటించారు. అసలు విషయం తెలియని కలెక్టర్ నిజంగా తన అదేశాలను రిమ్స్ అధికారులు అమలు చేశారనుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోసారి కలెక్టర్ వచ్చేసరికి ఈ తాత్కలిక ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతాయో లేదో వేచిచూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement