పారదర్శకతకు పాతర! | KCR,jaya, Kejriwal... lashes out at media | Sakshi
Sakshi News home page

పారదర్శకతకు పాతర!

Published Wed, Feb 25 2015 12:26 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

పారదర్శకతకు పాతర! - Sakshi

పారదర్శకతకు పాతర!

మమతా బెనర్జీ, జయలలిత, కేజ్రీవాల్, చంద్రశేఖరరావు- ఈ నలుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు మీడియా పట్ల ప్రదర్శిస్తున్న అసహనం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది.

మమతా బెనర్జీ, జయలలిత, కేజ్రీవాల్, చంద్రశేఖరరావు- ఈ నలుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు మీడియా పట్ల ప్రదర్శిస్తున్న అసహనం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది. నిజానికి మీడియాకు అపరిమితమైన స్వేచ్ఛ ఏనాడూ లేదు. అనేక పరిమితుల మధ్యనే అది పని చేస్తున్నది. కొన్ని సందర్భాలలో మీడియా కూడా లక్ష్మణరేఖను దాటుతున్న మాట వాస్తవం. అయినా సహేతుక ఆంక్షలైనా, లక్ష్మణరేఖలైనా మీడియా స్వయం నియంత్రణ ద్వారానే జరగాలి.
 
 ఉద్యమకాలంలో మీడియా అంటే దేవుళ్లు. ఉద్యమం విజయవంతమై, అదే మీడియా సహకారంతో అధికారం కూడా చేపట్టాక మాత్రం అవి దెయ్యాలు. దేశ రాజకీయ వ్యవస్థలో ఇదొక కొత్త వింత ధోరణి. ఒక్కసారి సింహాసనం మీద కూర్చున్నాక మీడియాను అణచి పారేయాలని అనిపిస్తుంది. పాతర పెట్టాలనీ అనిపిస్తుంది. జైలుకు పంపాలని కూడా కోరిక పుడుతుంది. ఇలా ఆలోచించే శత్రువర్గం మీడియాకు తక్కువేమీ లేదు. ఆ వర్గంలో తాజాగా రాజకీయ పార్టీలు కూడా చేరిపోతున్నాయి. ఈ ధోరణి జాతీయ రాజకీయ పక్షాలలో కంటే, ప్రాంతీయ పార్టీలలో తరచుగా గమనిస్తున్నాం.
 
ఎందుకీ అసహనం?
 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ మధ్య బంగ్లాదేశ్‌లో పర్య టించారు. ఆమె వెంట వెళ్లిన బృందంలో వ్యాపారవేత్త, సినీ నిర్మాత శివాజీ పంజా ఒకరు. ఈయనను నకిలీ పత్రాలు సమర్పించి కోట్లాది రూపాయల రుణం తీసుకున్న ఆర్థిక నేరం మీద ఢిల్లీ పోలీసులు కోల్‌కతాలో అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటకొచ్చారు. ఇందులో నిజానిజాలను కోర్టులు నిగ్గుతేలుస్తాయి. కానీ అప్పటిదాకా ఆయన నిందితుడే. కాబట్టి నేర చరిత్ర కలిగి, అరెస్టయిన వ్యక్తి ముఖ్యమంత్రి బృందంలో విదేశీ పర్యటనకు ఎలా అనుమతి పొందాడని బెంగాల్ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
 
తరువాత విలేక రులు, ‘మీ వెంట విదేశ పర్యటనకు వచ్చిన సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. మీ స్పందనేమిటి?’ అని తమదైన శైలిలో అడిగారు. ఇదే ప్రశ్న వేసిన విపక్షాల మీద కాదు, ఆఖరికి ఆరోపణ ఉన్నప్పటికీ తన వెంట వచ్చిన శివాజీ మీద కాదు, మీడియా మీద మమతకు కోపం వచ్చింది. ‘ఎంత సాహసం, ఇలాంటి ప్రశ్న అడుగుతారా? ఇందుకు మిమ్మల్ని జైలుకే పంపొచ్చు. కానీ దయతలచి వదిలేస్తున్నా, వెళ్లండి!’ అని కసురుకున్నారు. మమత పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియా మీద దాడి చేయడం ఇదే మొదటి సారి కాదు. కాబట్టి ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఒక కార్టూనిస్టును అరెస్టు చేసి, జైలు పాల్జేసిన ఘటన ఆమె హయాంలోనే జరిగింది. ఇంతకీ, కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్ (రాష్ట్ర సచివాలయం)లోకి మీడియా వారికి ప్రవేశం లేదు.
 
కాంగ్రెస్ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు పొందిన నాయకురాలు మమతా బెనర్జీ. వామపక్షాల పట్ల సొంత పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బయ టకొచ్చి ‘తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో వేరే పార్టీని స్థాపించి ఏళ్ల తరబడి పోరాడారు. తరువాత అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలో మీడియా ఆమెకు అందించిన సహకారం తక్కువేమీ కాదు. తృణమూల్ అంటే గ్రాస్ రూట్ (అట్టడుగు) అని అర్థం. కానీ చాలా నిరాడంబరంగా ప్రజలకు దగ్గరగా ఉండే పార్టీ అని అందరూ భావించే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన పని - మీడియా మీద నియంత్రణ. పశ్చిమ బెంగాల్ సచివాలయం మొత్తం ఇప్పుడు రైటర్స్ బంగ్లాలో లేదు.
 
అక్కడికి కొద్దిదూరం లోని నబన్న అనే (నూతన) భవన సముదాయంలోకి మారింది. ఇక్కడికి కూడా మీడియాకు అనుమతి లేదు. దక్షిణాదిన తమిళనాట కూడా ఇదే పరి స్థితి. అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్నంతకాలం మీడి యా ముఖం చూడరు. అక్కడి సచివాలయంలోనూ షరా మామూలే- మీడి యాకు నో ఎంట్రీ.
 
 అదే బాటలో ‘ఆప్’
 నిన్నగాక మొన్న రెండు జాతీయ రాజకీయ పక్షాలను మట్టి కరిపించి ఢిల్లీ కోటను స్వాధీనం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కూడా సచివా లయంలోకి మీడియాను అనుమతించేది లేదని తేల్చి చెప్పేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే సామాన్య ప్రజల పార్టీ. మరి, సమాచారాన్ని తెలుసుకునేం దుకు సామాన్యులకు ఉన్న హక్కును తమ బాధ్యతగా నిర్వర్తిస్తున్న మీడియా మీద ఆప్ సర్కారుకు ఎందుకు ఆగ్రహం కలిగినట్టు? ఢిల్లీ ఎన్నికలలో రెండో సారి అత్యద్భుతమైన విజయం సాధించడంలో ఆ పార్టీకి మీడియా అందిం చిన సహకారం ఎంతో ఉంది.
 
ఆప్ ఒక నిరసన ఉద్యమం నుంచి, భ్రష్టు పట్టిపోతున్న సంప్రదాయ రాజకీయాల పట్ల ప్రజలలో తలెత్తిన ధిక్కార ధోరణి ఫలితంగా ఆవిర్భవించిన మాట నిజమే. ఆ ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కల్పించినది మీడియా కాదా! అటువంటి ఆప్ కూడా ఢిల్లీ సచివాలయంలోకి మీడియాను ప్రవేశించనీయకుండా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
‘సహేతుక’ ఆంక్షలు ఉంటాయా?
 తెలంగాణ సచివాలయంలోకి మీడియా ప్రవేశాన్ని నిషేధించేందుకు సంబం ధించిన నిర్ణయం త్వరలోనే వెలువడనున్నదని పత్రికలూ, న్యూస్ చానళ్లూ రాశాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంటే, మనం చేస్తే తప్పేమిటి అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారులతో అన్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. కానీ మీడియా నుంచీ, జర్నలిస్టుల సంఘాల నుంచీ వచ్చిన నిరసన వేడి వల్ల కాబోలు, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా ఆపినట్టుంది. ఆ వెంటనే ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు సంపాదకులను, జర్నలిస్టు సంఘాల నాయకులను సమావేశ పరచి పాత్రికేయుల సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. వారం రోజులలో నివేదిక ఇచ్చేందుకు గాను ఒక కమిటీని కూడా నియమించారు.
 
 కానీ, సచివాలయంలో మీడియాను నియంత్రించవలసిన అవసరమైతే కచ్చితంగా ఉందని అదే సమయంలో ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, జర్నలిస్టులందరితోనూ చర్చించిన మీదటే ఒక నిర్ణయం తీసుకుం టామని భరోసా ఇచ్చారు. అది జరిగి 48 గంటలు గడవక ముందే సోమ వారం సమాచార శాఖ అధికారులు కొద్దిసేపు అత్యుత్సాహం ప్రదర్శిం చారు. సమత బ్లాక్ (ముఖ్యమంత్రి కార్యాలయ భవనం)లో పౌర సంబం ధాల అధికారి చాంబర్ నుంచి పోలీసుల సాయంతో మీడియాను గెంటేశారు.

మళ్లీ, ‘అటువంటిదేమీ లేదు, రావొచ్చ’న్నారు. సచివాలయం నుంచి మీడి యాను పూర్తిగా నిషేధించరు గాని, సహేతుకమైన ఆంక్షలు (రీజనబుల్ రెస్ట్రిక్షన్స్) మాత్రం ఉంటాయనీ, వాటికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ ప్రెస్ అకాడమీ అధ్యక్షుని చేత చెప్పించారు. అంటే ఇంకా ప్రమాదం తొలగిపోలేదన్నమాట. మీడియా నెత్తి మీద సచివాలయంలో ప్రవేశానికి నిషేధం అనే కత్తి వేలాడుతూనే ఉన్నదన్నమాట.
 
ఫోర్త్ ఎస్టేట్ తత్వాన్ని మరిచారు
మీడియా అంటే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు తెలియనిది కాదు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఆ సుదీర్ఘ పోరాటం మీడియా అండ లేకుండానే జరిగిందని టీఆర్‌ఎస్ చెప్పగలదా? చెప్పలేదు! ఉద్యమం సాగు తున్న కాలంలో అప్పటి ప్రభుత్వాలు మీడియా వైపు కన్నెత్తి చూసినా విరుచుకుపడిన టీఆర్‌ఎస్ ఇప్పుడు అధికారంలో ఉండి, ఆంక్షల గురించి మాట్లాడడం విడ్డూరం. ఇంతకూ ఈ ఆంక్షల విధింపు వెనుక కారణాలు ఏమిటి? పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు సచివాలయంలో తిరగాడుతుండడం వల్ల మంత్రులూ, అధికారులూ సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నా రని ప్రభుత్వం చెబుతోంది. మీడియా నిషేధం దీనికి పరిష్కారం ఎలా అవుతుంది? మీరెవరూ ప్రత్యక్షంగా చూడొద్దు, వినొద్దు, రాసుకోవద్దు. మేమే సమాచారం పంపుతాం! అదే ప్రచురించండి!’ అంటే ఇంక మీడియా దేనికి? దానికి ఫోర్త్ ఎస్టేట్ అని బిరుదు ఎందుకు?
 
స్వయం నియంత్రణ కే ప్రాధాన్యం
 మమత, జయ, కేజ్రీవాల్, కేసీఆర్- ఈ నలుగురు ప్రాంతీయ పార్టీల అధి నేతలు మీడియా పట్ల ప్రదర్శిస్తున్న అసహనం ప్రజాస్వామ్యానికి చేటుచే స్తుంది. నిజానికి మీడియాకు అపరిమితమైన స్వేచ్ఛ ఏనాడూ లేదు. అనేక పరిమితుల మధ్యనే అది పనిచేస్తున్నది. కొన్ని సందర్భాలలో మీడియా కూడా లక్ష్మణరేఖను దాటుతున్న మాట వాస్తవం. అయినా సహేతుక ఆంక్షలైనా, లక్ష్మణరేఖలైనా మీడియా స్వయం నియంత్రణ ద్వారానే జరగాలి. ప్రజా సేవలో మీడియా ఎక్కడైనా అడ్డంకిగా తయారైందని ప్రభుత్వం భావిస్తే, ఆ వ్యవస్థ యజమానులను, సంపాదకులను, జర్నలిస్టు సంఘాల నేతలను కూర్చోబెట్టి చర్చించి ఆ అడ్డంకులను తొలగించుకోవాలి. అంతేతప్ప ఇలాంటి నిషేధాలు ప్రజాప్రయోజనానికి ఉపయోగపడవు. అంతిమ ఫలితం పారదర్శ కతను బలిచేయడమేనని పాలకులు గుర్తుంచుకోవాలి.
 (వ్యాసకర్త మొబైల్: 98480 48536)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement