ఉదయగిరి : మండలంలోని టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హుదూ ద్ తుపాను బాధితులకు తమ వంతు విరాళాలు అందించి సీఎం వద్ద ప్రశంసలు పొందాలని భావించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు విరాళంగా సొం త డబ్బు కాకుండా సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు ఒక నెల పింఛన్ల మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. చివరకు ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర రూ.100 నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. హుదూద్ తుపాన్ విశాఖపట్టణం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొంత భాగాన్ని అతలాకుతం చేసింది. బాధితుల్ని ఆదుకునే నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు రంగంలోకి దిగాయి. వివిధ వర్గాల ప్రజలు వారికి బాసటగా నిలిచారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం తప్పులేదు.
అది కనీస ధర్మం కూడా. కానీ కొంత మంది టీడీపీ నాయకులు తమ మెహర్బానీని చాటుకునేందుకు ఐకేపీ, పొదుపు గ్రూపులు, ప్రభుత్వ కార్యాలయాలకు టార్గెట్ నిర్దేశించి చందాలు వసూలు చేస్తున్నారు. తాజాగా ఉదయగిరిలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంపిణీ చేసే సామాజిక పింఛన్లలో కొంత మొత్తం వసూలు చేస్తున్నారు. మండలంలో 3,884 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా ఈ నెలకు సంబంధించి రూ.43.29 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను గురువారం నుంచి పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు ఈ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల మొత్తాన్ని హుదూద్ బాధితులకు ఇవ్వాలని ప్రతిపాదించారు.
కానీ దీన్ని కొంతమంది అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి నేతలు వ్యతిరేకించడంతో ప్రతి పింఛన్‌దారు నుంచి రూ.100 తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో గురువారం పంపిణీ జరిగిన బిజ్జంపల్లి, అయ్యవారిపల్లిల్లో ఈ మేరకు మినహాయించినట్లు సమాచారం. మండలంలోని మిగతా పంచాయతీల్లో విరాళాల పంచాయితీ వ్యవహారం సాయంత్రం వరకు సాగడంతో గురువారం పంపిణీ కాలేదు. శుక్రవారం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా రూ.100 నుంచి రూ.500 వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పింఛన్‌దారుల పరిస్థితులు, గ్రామ పరిస్థితులను అంచనా వేసుకుని అక్కడ చోటు చేసుకునే పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వసూళ్ల మొత్తాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా మండల స్థాయి టీడీపీ నేతలు పంచాయతీ కార్యదర్శులకు, గ్రామస్థాయి నేతలకు సూచించినట్లు సమాచారం. దీనికి స్థానిక నేతలు రూ.200 నుంచి రూ.1000కు పింఛను పెంచింది తమ ప్రభుత్వమేనని, మీరు కాదంటే వచ్చే నెల నుంచి మీకు పింఛను ఉండదని బెదిరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మండలంలో రూ.5 లక్షలకు పైగా ఒక్క పింఛన్‌దారుల నుంచే వసూలు చేయాలని టార్గెట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉపాధి హామీ, ఐకేపీ, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా టార్గెట్‌లు నిర్దేశించారు.ఈ విషయమై ఎంపీడీఓ ఫణి పవన్‌కుమార్‌ను వివరణ కోరగా విరాళాల వసూలు తనకు తెలియదని, ఎక్కడైనా జరిగి ఉంటే విచారించి సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు.
తుపాను విరాళంగా పింఛన్ల సొమ్మా!
Published Fri, Dec 19 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement
Advertisement