విశాఖ రూరల్, న్యూస్‌లైన్: గ్రామ ఖజా నాలు నిండుకున్నాయి. పాలకవర్గాల వద్ద చిల్లిగవ్వ లేదు. ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటినా ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. అభివృద్ధి ఊసేలేదు. దీంతో కొత్త సర్పంచ్‌లు దిష్టిబొమ్మలుగా మారిపోయారు. నిధులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.
జిల్లాలో 920 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 907 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 13 వాయిదా పడ్డాయి. 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కొత్త సర్పంచ్‌లంతా ఆగస్టు 2న బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత గ్రా మాలకు నిధుల కురుస్తాయని సర్పంచ్‌లు భా వించారు. కానీ ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి రాలేదు.
ప్రత్యేక నిధులెక్కడ : సాధారణంగా ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధు లు మంజూరు చేస్తుంది. అవి గ్రామాభివృద్ధికి దోహదపడతాయనే ఆయా గ్రామాల్లోనివారు ఏకగ్రీవం దిశగా అడుగులేశారు. నోటిఫైడ్ పం చాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ.5లక్షలు ప్రత్యేక గ్రాంట్‌గా ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రకటించింది. నెలలు గడుస్తున్నా...ఏకగ్రీవమైన 70 పంచాయతీలకు పైసా విడుదల కాలేదు. ఇదిలా ఉంటే రెండేళ్లుగా 13వ ఆర్థిక సంఘం నిధులు లేవు. కొలువుతీరాక అవయినా వస్తాయని ఆశించిన కొత్త సర్పంచ్‌లకు నిరాశే మిగిలింది. వృత్తి పన్ను, సీనరేజీ పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏవీ మంజూరు చేయలేదు.
సమైక్యాంధ్ర సెగ
జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. ఎంపీడీవోలు, ఖజానా శాఖ సిబ్బంది, పంచాయతీ అధికారులు, ఇలా జిల్లాలో పని చేసే ప్రతీ ఒక్కరూ సమ్మెలోకి వెళ్లారు. దీంతో గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, వీధి లైట్ల నిర్వహణ వంటి అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. బ్లీచింగ్ చల్లాలన్నా, కాలువల్లో పూడిక తీయాలన్నా, తాగునీటి పైపులు బాగు చేయిం చాలన్నా, వీధి లైట్లు వెలిగించాలన్నా పంచాయతీల్లో బిల్లులు కాకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది.
కనీసం గ్రామ పంచాయతీల పరిధిలో రావాల్సిన పన్నులు, ఇతర ఆదాయం రాబట్టాలనుకున్నా సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో సర్పంచ్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది సొంత డబ్బులు ఖర్చు పెట్టి చిన్న చిన్న పనులు చేయిస్తున్నారు. తీర్మానాలు లేకుండా సొంత డబ్బు లు ఖర్చు పెడితే తరువాత పరిస్థితి ఏమిటని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిల్లిగవ్వలేదు..
Published Fri, Oct 4 2013 1:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement
Advertisement