
బంగారు తెలంగాణకు బాటలు వేస్తాం
- కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా శ్రమిస్తే తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడం ఖాయమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బంగారు తెలంగాణ.., విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ఆదివారం సమావేశమై కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సహాయ సహకారాలపై చర్చిస్తానని వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర మంత్రులతో శనివారం సాయంత్రం దిల్‌కుశ అతిథి గృహంలో సమావేశమైన దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రులతో కలసి దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రిత్వశాఖలన్నింటి నుంచి రాష్ట్రానికి కావాల్సిన సహాయ, సహకారాలను అందిస్తామన్నారు.
హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ, హైదరాబాద్ నగరాభివృద్ధికి దత్తాత్రేయ సేవలు అవసరమన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముందుకు రావడం అభినందనీయమన్నారు. నూతన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఈ సమావేశంలో దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు.