ప్రభుత్వాల ఐక్యతతోనే దేశాభివృద్ధి
- ప్రధాని మోడీ వెల్లడి..
- యూపీఏ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు
- అందువల్లే నీరుగారిన కేంద్ర పథకాలు
- రైతు జేబు నిండితేనే దేశ ఖజానా భర్తీ
- వారికి అనుకూలమైన పథకాలు రూపొందించాలి
తుమకూరు : దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజం భుజం కలిపి ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్బోధించారు. ఇక్కడికి సమీపంలోని వసంత నరసాపురంలో బుధవారం ఆయన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, అంతకు ముందు సాగిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగంపై స్పందించారు. తనకు కన్నడం తెలియకపోయినా భావాన్ని అర్థం చేసుకోగలనని అన్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభిప్రాయ భేదాలుండేవని చెప్పారు. దీని వల్ల కేంద్ర పథకాలు సద్వినియోగం కాకుండా అభివృద్ధి కుంటు పడిందని ఆరోపించారు. కేంద్రంలో తాము అధికారం చేపట్టాక అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కాగా రైతు దేశానికి అంతా ఇస్తున్నా, అతని జేబు మాత్రం ఖాళీగానే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల జేబులు నిండితే ఖజానా భర్తీ అవుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ భారత్‌కు కొత్తేమీ కాదని, ప్రాచీన కాలం నుంచే దీనికి ప్రాధాన్యత ఉందని అన్నారు. పాలు చెడిపోకుండా చూడడానికి మహిళలు దాని నుంచి నెయ్యి తీసేవారని గుర్తు చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ భాగస్వామ్యంలో నెలకొల్పామని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తుందని వెల్లడించారు.
ఆదివాసీలు... లేజర్ టెక్నాలజీ
తాను గతంలో ఓ సారి ఆదివాసీలు ఉండే చోటికి వెళ్లానని ప్రధాని తెలిపారు. అక్కడ ప్రతి పుష్పగుచ్ఛంలోనూ తన చిత్రం ఉండడాన్ని చూసి, ఇదెలా సాధ్యమైందని వారిని అడిగానని చెప్పారు. లేజర్ టెక్నాలజీ ద్వారా ఫొటోలను అందులో ఇమిడ్చామని చెప్పారని వెల్లడించారు. అంతేకాకుండా గతంలో రూ.2కు కూడా వీటిని అడిగే వారు లేరని, ఫొటోను అమర్చాక రూ.200కు అమ్ముతున్నామని వారు చెప్పారని వివరించారు. కనుక రైతులకు అనుకూలమైన టెక్నాలజీని, పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం నినాదాలతో దేశాన్ని అభివృద్ధి పరచలేమని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
30 శాతం ఉత్పత్తుల నష్టం
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు సరైన సదుపాయాలు లేని కారణంగా సుమారు 30 శాతం నాశనమవుతున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్‌కు సరైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని గుర్తు చేశారు. ఫుడ్ పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో వైవిధ్యమైన వాతావరణం ఉంటుందని, వ్యవసాయ ఉత్పత్తులూ అలాగే ఉంటాయని తెలిపారు.
రాష్ట్ర రైతులకు న్యాయమైన ధరలు లభించడం లేదని, కనుక ఇలాంటి అనేక ఫుడ్ పార్కులను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రైతులకు న్యాయమైన ధర లభించాలంటే, ముందుగా వ్యవసాయ ఉత్పత్తుల విలువను లెక్క కట్టాల్సి ఉందని తెలిపారు. ఈ పార్కు వల్ల అనేక జిల్లాలకు చెందిన రైతులకు మేలు చేకూరుతుందన్నారు. తాము కొత్తగా తీసుకు రాబోయే పారిశ్రామిక విధానంలో పరిశ్రమల ఏర్పాటు ఏ కారణంతో కూడా ఆలస్యం కారాదని పేర్కొంటున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీని కర్ణాటకకు కూడా విస్తరించాలని కోరారు. లేనట్లయితే ఆంధ్రప్రదేశ్‌తో అనారోగ్యకరమైన పోటీ ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వజూభాయ్ వాలా, కేంద్ర మంత్రులు డీవీ సదానంద గౌడ, అనంత కుమార్, హర్షిత్ కౌర్ బాదల్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టీబీ జయచంద్ర, స్థానిక ఎంపీ ముద్ద హనుమేగౌడ ప్రభృతులు పాల్గొన్నారు.