అడుగంటిన జలం
- 194 గ్రామాల్లో పరిస్థితి దారుణం
- 30 మీటర్ల లోతులోనూ కానరాని తడి
- భూగర్భ జలశాఖ సర్వేలో వెల్లడి
- జిల్లాలో బోర్లు, బావుల తవ్వకాలకు బ్రేక్
- మండల అధికారులకు ఆదేశాలు జారీ
హన్మకొండ : ప్రస్తుత వానాకాలంలో సగటు వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి. వర్షాలు పడకపోవడంతోపాటు నీటి వినియోగం పెరిగిపోవడంతో నీటిమట్టం పడిపోయింది. వ్యవసాయం, పారిశ్రామికావసరాలే కాకుండా వివిధ రూపాల్లో బోర్లు, బావుల తవ్వకం 73 శాతం పెరగడంతో భూగర్భ జల మట్టం అట్టడుగు స్థాయికి చేరినట్లు భూగర్భజల శాఖ గుర్తించింది. 34 మండలాల పరిధిలోని 194 గ్రామాలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని తేల్చింది.
మిగిలిన ప్రాంతాల్లో కొంత మేర నీటి లభ్యత ఉన్నప్పటికీ.... రానున్న రోజుల్లో కష్టాలు తప్పేలా లేవని హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భూగర్భ జల శాఖ ఇటీవల నివేదిక అందజేసింది. అంతేకాదు... నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో జిల్లాలో ఆంక్షలు విధించింది. అత్యంత దారుణ పరిస్థితులు ఉన్న 34 మండలాల్లో బోర్లు వేయడం, బావుల తవ్వకం, ఇసుక తీయడం నిషేధించింది.
మిగిలిన గ్రామాలు, మండలాల్లో సైతం బోర్లు వేసేందుకు, బావులు తవ్వేందుకు, ఇసుక తీయడం వంటి పనులకు భూగర్భ జలశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సూచిస్తూ మండలాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఎక్కడైనా అనుమతి లేకుండా ఈ పనులు చేస్తే... వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. 34 మండలాల్లో అనివార్య పరిస్థితుల్లో మాత్రమే తాగునీటి సరఫరా కోసం కొత్త బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వాలని... ఇందుకు దారుణ పరిస్థితులే ఉన్నాయి.
జిల్లాలో భూగర్భ జలాలు 2010-11 నుంచి గణనీయంగా పడిపోతున్నట్లు సర్వేలో గుర్తించాం. ప్రస్తుతం జిల్లాలో 34 మండలాల పరిధిలోని 194 గ్రామాల్లో నీటిమట్టం గరిష్ట లోతుల్లోకి పడిపోయింది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం. మరికొన్ని రోజులైతే తాగునీరు కూడా దొరకదు. ఈ నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాం. కరువు నివారణ చర్యల్లో భాగంగా ఈ ప్రాంతాల్లో పనులు చేయాల్సి ఉంది. అతి దారుణంగా ఉన్న ఈ ప్రాంతాల్లో బోర్లు, బావుల తవ్వకం, ఇసుక తీయడం నిషేధించాం. మిగిలిన ప్రాంతాల్లో కూడా నిషేధం వర్తిస్తోంది.
- ఆనంద్‌కుమార్, భూగర్భ జల శాఖ డీడీ