న్యూఢిల్లీ: అనధికార ఎక్స్ కేడర్ ఐఏఎస్ పోస్టుల ఏర్పాటును ఆపేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. అలా చేయడం ప్రస్తుతం ఉన్న నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. తాత్కాలిక అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ కేడర్ పోస్టులను సృష్టిస్తున్నాయని, వారిని ఐఏఎస్ కేడర్‌లోకి చేర్చడం కుదరదని డీఓపీటీ రాష్ట్రాలను గట్టిగా హెచ్చరించింది. దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడం కోసం రాష్ట్రాలు ఎక్స్ కేడర్ పోస్టులను సమాంతరంగా సృష్టిస్తున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
సీనియర్ డ్యూటీ రిజర్వ్‌లోంచి 25% పోస్టులను మాత్రమే రాష్ట్రాలు అధికారికంగా ఎక్స్‌కేడర్‌గా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అనేక రాష్ట్రాలు దాదాపు అన్ని స్థాయిల్లో పలు కేడర్ పోస్టులను తాత్కాలికంగా నిలిపి ఉంచి, అందుకు బదులుగా ఎక్స్ కేడర్ పోస్టులను సృష్టించుకుంటున్న విషయం తమ దష్టికి వచ్చిందని, అలా చేయడం వల్ల కేడర్ నిర్మాణంలో తేడా వస్తుందని వివరించింది. నిబంధనల ప్రకారం కేంద్రం ఆదేశాలు లేకుండా ఆర్నెళ్లకు మించి కేడర్ పోస్టులను నిలిపి ఉంచకూడదని స్పష్టం చేసింది.