IAS posts
-
మాకు న్యాయం జరగాలి
సాక్షి, హైదరాబాద్: పోస్టింగ్‌ల విషయంలో అసంతృప్తిగా ఉన్న పలువురు ఐఏఎస్‌లు ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ప్రాధాన్యత పోస్టుల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు వాపోతున్నారు. పోస్టింగుల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యతను కల్పించే విధానాన్ని రూపొందించాలని కోరాలని వారు నిర్ణయించారు. ‘నా తెలంగాణలో నాకు అన్యాయమా’ నినాదంతో పోస్టింగ్‌ల వివక్షను ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐఏఎస్ అధికారులకు పోస్టింగుల్లో అన్యాయం జరుగుతుందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని ఈ వర్గాలకు చెందిన 20 మంది ఐఏఎస్‌లు సోమవారం హైదరాబాద్‌లోని ఐఏఎస్ గెస్ట్‌హౌస్‌లో 3 గంటలపాటు సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐఏఎస్ అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షుడిగా ఐఏఎస్ అధికారి ఎ.మురళీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ప్రభుత్వం రద్దయ్యే వరకు ఐఏఎస్‌ల పోస్టింగ్‌ల్లో జరిగిన అన్యాయంపై సమావేశంలో చర్చించారు. ‘ రాష్ట్ర ప్రజలకు మా వంతుగా ఏదైనా చేయాలనే లక్ష్యాలను ప్రభుత్వం నీరుగారుస్తోంది. అ ప్రాధా న్య, మూడో తరగతి పోస్టులను మా వర్గం వారికి కేటాయిస్తోంది. పోస్టింగ్‌ల్లో అన్యాయం, వివక్షపై గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాం. సీఎస్‌ను కలసి విన్నవించాం. అయినా పరిస్థితిలో మార్పు లేదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా సంఘటితంగా ఉండాలి. పరిస్థితులను బట్టి ఒత్తిడి తేవాలి’అని నిర్ణయించారు. ఏడాదిగా అసంతృప్తి.. ఐఏఎస్‌ల పోస్టింగ్‌ల విషయంలో తమకు ప్రాధాన్యత ఉండటం లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఐఏఎస్‌లు ఏడాదిగా అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పేందుకు జూన్ 25న సమావేశమయ్యారు. అదే నెల 28న సీఎస్ ఎస్కే జోషిని కలసి విషయాన్ని వివరించారు. ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోస్టింగ్‌ల కేటాయింపులో సీనియారిటీని పట్టించుకోవడం లేదు. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ఐఏఎస్‌లకు అన్యాయం జరుగుతోంది. ఈ వర్గాల వారికి కలెక్టర్లుగా పోస్టింగ్ ఇవ్వడం లేదు. అగ్రవర్ణాలకు చెందిన జూనియర్ ఐఏఎస్‌లకు జిల్లాల కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తున్నారు. రిటైర్డ్ ఉన్నతాధికారి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ప్రభావం వల్లే ఇలా జరుగుతోంది. ఇలాంటి పరిణామాలు మా వర్గాల ఐఏఎస్‌ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది’అని వివరించారు. ఏయే పోస్టుల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయో లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ వీరికి సూచించారు. ఇదే విషయంపై సీఎస్‌కు లిఖితపూర్వకంగా వివరాలు అందజేశారు. అయినా పోస్టింగ్‌ల్లో మార్పులు లేకపోవడంపై వీరు అసం తృప్తితో ఉన్నారు. ఎన్నికల తరుణంలో వీరు మరోసారి సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో ఐఏఎస్ అధికారులు ఆర్వీ చంద్రవదన్, ఎం.దినకర్‌బాబు, ఎల్.శర్మన్, ఎం.చంపాలాల్, బి.భారతిలక్పతినాయక్, ఎ.మురళీ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. -
ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట!
న్యూఢిల్లీ : ప్రతేడాది లక్షల మంది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులకు పోటీపడుతూ ఉంటారు. వీళ్లలో చాలా తక్కువ మందే ఈ పోస్టులకు ఎంపికయ్యేది. ఈ పోస్టులకు పెద్ద ఎత్తున్న అభ్యర్థుల నుంచి ఆసక్తి వస్తున్నప్పటికీ, చాలా తక్కువ మందే దీనికి అర్హత సాధిస్తున్నారు. ప్రస్తుతం 2,400 ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. దేశంలో మొత్తం మంజూరైన 6,553 ఐఏఎస్ పోస్టుల్లో 22.11 శాతం సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడైంది. కేవలం ఇవి మాత్రమే కాక, 4,940 ఐపీఎస్ ఆఫీసర్ పోస్టుల్లో 19.64 శాతం సీట్లను ఇంకా భర్తిచేయాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. అంటే మొత్తంగా 2,400కు పైగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. వీటిలో 1,449 ఐఏఎస్ పోస్టులు, 970 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తున్నామని మంత్రి సమాధానమిచ్చారు. కాగ, ప్రతేడాది యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, వంటి ఇతర ముఖ్యమైన, హైలెవల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పోస్టులను భర్తీ చేస్తూ ఉంటోంది. ఈ పోస్టులకు అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుడు భారత పౌరుడే ఉండాలి నేపాల్, భూటాన్, టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు, భారతీయ సంతతి ఇమిగ్రేట్లు, తమ అర్హత పత్రం చూపించి సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు జనరల్ అభ్యర్థులు-4 సార్లు ఒబిసి అభ్యర్థులు-7సార్లు వికలాంగులు (జనరల్)- 7 సార్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు. -
ఎట్టకేలకు పూర్తయిన విభజన
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమయిన జూన్ 2, 2014 నాటికి రాష్ట్రంలో పనిచేస్తున్న 536 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లలో 305 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 231 మందిని తెలంగాణకు కేటాయించారు. ఇందులో అధికారులు ఎంచుకున్న రాష్ట్రానికే ప్రాధాన్యత ఇస్తూ తాత్కాలిక కేటాయింపు పూర్తి చేశారు. అయితే, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 42 శాతం మందిని తెలంగాణకు, 58 శాతం మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సి ఉంది. అయితే ఒక శాతం అదనంగా తెలంగాణకు ఇచ్చారని, దీంతో తెలంగాణ ఐదు పోస్టులను నష్టపోతోందని, అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లాభపడిందని తెలంగాణ రెవెన్యూ సంఘాలు విమర్శిస్తున్నాయి. సీనియారిటీ జాబితా ఖరారుతో... ఈ విభాగాల్లో ఎట్టకేలకు సీనియారిటీ జాబితా ఓ కొలిక్కి రావడంతో తాజాగా సమావేశమైన ప్రత్యేక కమిటీ ఈ కేటాయింపులను పూర్తి చేసింది. అయితే, రాష్ట్రాన్ని ఎంచుకునే అవకాశం అధికారులకు ఇవ్వడంతో మొత్తం 43 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇందు లో తెలంగాణ నుంచి ఏపీకి 10 మంది వెళ్లగా, ఏపీ నుంచి తెలంగాణకు 33 మంది వచ్చారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సుందర్ అబ్నార్ ఏపీ ఆప్షన్ ఇవ్వడంతో ఆయనను అక్కడికే కేటాయించారు. కొందరికి రివర్షన్ తప్పదా..? తాజా కేటాయింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలంటే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన వారిలో కొందరిని రివర్షన్ చేయక తప్పదనే చర్చ జరుగుతోంది. గత ఏడాది 82 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వడంతో ఇటీవల వారికి పోస్టింగులు కూడా కేటాయించారు. అయితే, ఇప్పుడు ఆంధ్రా నుంచి వస్తున్న 33 మంది అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాలంటే అందులో 10–15 మందికి రివర్షన్ తప్పదని రెవెన్యూ సంఘాలంటున్నాయి. అయితే, తాజా కేటాయింపులతో ఏపీలో మాత్రం డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల్లో 95 వరకు ఖాళీలు పెరగనున్నాయి. ఆప్షన్ ఎంపిక మతలబు ఏమిటంటే..! తెలంగాణలో కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా రెవెన్యూ అధికారులకు ఎక్కువ అవకాశం ఉండడం, తెలంగాణకు అదనపు ఐఏఎస్ పోస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ కలెక్టర్లయిన వారంతా తెలంగాణే ఆప్షన్ పెట్టుకున్నారు. మరికొందరు హైదరాబాద్‌లో స్థిరపడడం కోసం, స్పౌస్ కేసుల్లో తెలంగాణను ఎంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తెలంగాణలో 58 ఉండగా, ఏపీలో 60 ఏళ్ల వరకు అవకాశం ఉంది. దీంతో రెండేళ్లు సర్వీసు కలసి వస్తుందనే కారణంతో రిటైర్మెంట్ దగ్గర ఉన్న కొందరు తెలంగాణ అధికారులు ఏపీని ఎంచుకోవడం గమనార్హం. -
రాష్ట్రానికి పెరిగిన ఐఏఎస్ పోస్టుల సంఖ్య 28
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఐఏఎస్ పోస్టుల సంఖ్య పెరిగింది. కేడర్ రివ్యూలో భాగంగా కొత్తగా 28 ఐఏఎస్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 239కి పెరిగింది. అంటే కొత్తగా 28 పోస్టులు పెరిగినట్లు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెండు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులున్నాయి. -
రాష్ట్రానికి కొత్తగా 19 ఐఏఎస్ పోస్టులు!
- 230కి పెరగనున్న పోస్టులు - ఇటీవల ఢిల్లీలో జరిగిన కేడర్ సమీక్షలో ప్రాథమిక నిర్ణయం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ఐఏఎస్‌ల పోస్టులు పెరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఐఏఎస్ కేడర్ పోస్టుల సంఖ్య 211 ఉండగా... ఇటీవల ఢిల్లీలో కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమీక్షలో కొత్తగా 19 పోస్టులు మంజూరు చేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర ఐఏఎస్ కేడర్ పోస్టుల సంఖ్య 230కి పెరగనుంది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్తో 160 పోస్టులుండగా, పదోన్నతుల ద్వారా 70 పోస్టులు ఉండనున్నాయి. త్వరలోనే కేంద్ర కేబినెట్ కార్యదర్శితో సమీక్ష ఉంటుందని, ఆ సమీక్షలో పోస్టుల సంఖ్యకు అధికారికంగా ఆమోద ముద్రపడుతుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్, పదోన్నతులు కలిపి ఐఏఎస్‌ల పోస్టుల సంఖ్య 211 ఉన్నప్పటికీ వాస్తవంగా పనిచేస్తున్న ఐఏఎస్‌లు కేవలం 165 మంది మాత్రమే. అంటే 46 మంది ఐఏఎస్‌ల కొరత ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటోంది. -
'ఎక్స్ కేడర్' ఐఏఎస్ పోస్టులను సృష్టించొద్దు
న్యూఢిల్లీ: అనధికార ఎక్స్ కేడర్ ఐఏఎస్ పోస్టుల ఏర్పాటును ఆపేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. అలా చేయడం ప్రస్తుతం ఉన్న నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. తాత్కాలిక అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ కేడర్ పోస్టులను సృష్టిస్తున్నాయని, వారిని ఐఏఎస్ కేడర్‌లోకి చేర్చడం కుదరదని డీఓపీటీ రాష్ట్రాలను గట్టిగా హెచ్చరించింది. దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడం కోసం రాష్ట్రాలు ఎక్స్ కేడర్ పోస్టులను సమాంతరంగా సృష్టిస్తున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ డ్యూటీ రిజర్వ్లోంచి 25% పోస్టులను మాత్రమే రాష్ట్రాలు అధికారికంగా ఎక్స్కేడర్గా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అనేక రాష్ట్రాలు దాదాపు అన్ని స్థాయిల్లో పలు కేడర్ పోస్టులను తాత్కాలికంగా నిలిపి ఉంచి, అందుకు బదులుగా ఎక్స్ కేడర్ పోస్టులను సృష్టించుకుంటున్న విషయం తమ దష్టికి వచ్చిందని, అలా చేయడం వల్ల కేడర్ నిర్మాణంలో తేడా వస్తుందని వివరించింది. నిబంధనల ప్రకారం కేంద్రం ఆదేశాలు లేకుండా ఆర్నెళ్లకు మించి కేడర్ పోస్టులను నిలిపి ఉంచకూడదని స్పష్టం చేసింది. -
‘మాధవీ కృష్ణమూర్తి’ పిటిషన్‌పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: తనకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని, ఈ క్రమంలోనే తన పేరును యూపీఎస్సీకి సిఫార్సు చేయలేదని ఆరోపిస్తూ ప్రభుత్వాధికారి మాధవీ కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. వివాదం తేలేవరకు 6 కన్ఫర్డ్ పోస్టుల్లో ఒకదాన్ని ఖాళీగా ఉంచేలా ఆదేశించాలని ఆమె తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. నేడు, రేపు ఇంటర్వ్యూలు రెవెన్యూయేతర 6 కనఫర్డ్ ఐఏఎస్ పోస్టులకుగాను శుక్ర, శనివారాల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మొత్తం 30 మందిలో 14 మందికి ఇప్పటికే ఇంటర్వ్యూలు ముగియగా, మిగతా 16 మందికి యూపీఎస్సీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.