సాక్షి, హైదరాబాద్: పోస్టింగ్‌ల విషయంలో అసంతృప్తిగా ఉన్న పలువురు ఐఏఎస్‌లు ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ప్రాధాన్యత పోస్టుల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు వాపోతున్నారు. పోస్టింగుల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యతను కల్పించే విధానాన్ని రూపొందించాలని కోరాలని వారు నిర్ణయించారు. ‘నా తెలంగాణలో నాకు అన్యాయమా’ నినాదంతో పోస్టింగ్‌ల వివక్షను ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐఏఎస్ అధికారులకు పోస్టింగుల్లో అన్యాయం జరుగుతుందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని ఈ వర్గాలకు చెందిన 20 మంది ఐఏఎస్‌లు సోమవారం హైదరాబాద్‌లోని ఐఏఎస్ గెస్ట్‌హౌస్‌లో 3 గంటలపాటు సమావేశమయ్యారు.
అనంతరం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐఏఎస్ అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షుడిగా ఐఏఎస్ అధికారి ఎ.మురళీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ప్రభుత్వం రద్దయ్యే వరకు ఐఏఎస్‌ల పోస్టింగ్‌ల్లో జరిగిన అన్యాయంపై సమావేశంలో చర్చించారు. ‘ రాష్ట్ర ప్రజలకు మా వంతుగా ఏదైనా చేయాలనే లక్ష్యాలను ప్రభుత్వం నీరుగారుస్తోంది. అ ప్రాధా న్య, మూడో తరగతి పోస్టులను మా వర్గం వారికి కేటాయిస్తోంది. పోస్టింగ్‌ల్లో అన్యాయం, వివక్షపై గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాం. సీఎస్‌ను కలసి విన్నవించాం. అయినా పరిస్థితిలో మార్పు లేదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా సంఘటితంగా ఉండాలి. పరిస్థితులను బట్టి ఒత్తిడి తేవాలి’అని నిర్ణయించారు.
ఏడాదిగా అసంతృప్తి..
ఐఏఎస్‌ల పోస్టింగ్‌ల విషయంలో తమకు ప్రాధాన్యత ఉండటం లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఐఏఎస్‌లు ఏడాదిగా అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పేందుకు జూన్ 25న సమావేశమయ్యారు. అదే నెల 28న సీఎస్ ఎస్కే జోషిని కలసి విషయాన్ని వివరించారు. ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోస్టింగ్‌ల కేటాయింపులో సీనియారిటీని పట్టించుకోవడం లేదు. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ఐఏఎస్‌లకు అన్యాయం జరుగుతోంది. ఈ వర్గాల వారికి కలెక్టర్లుగా పోస్టింగ్ ఇవ్వడం లేదు. అగ్రవర్ణాలకు చెందిన జూనియర్ ఐఏఎస్‌లకు జిల్లాల కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తున్నారు. రిటైర్డ్ ఉన్నతాధికారి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ప్రభావం వల్లే ఇలా జరుగుతోంది.
ఇలాంటి పరిణామాలు మా వర్గాల ఐఏఎస్‌ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది’అని వివరించారు. ఏయే పోస్టుల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయో లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ వీరికి సూచించారు. ఇదే విషయంపై సీఎస్‌కు లిఖితపూర్వకంగా వివరాలు అందజేశారు. అయినా పోస్టింగ్‌ల్లో మార్పులు లేకపోవడంపై వీరు అసం తృప్తితో ఉన్నారు. ఎన్నికల తరుణంలో వీరు మరోసారి సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో ఐఏఎస్ అధికారులు ఆర్వీ చంద్రవదన్, ఎం.దినకర్‌బాబు, ఎల్.శర్మన్, ఎం.చంపాలాల్, బి.భారతిలక్పతినాయక్, ఎ.మురళీ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం.
మాకు న్యాయం జరగాలి
Published Tue, Oct 30 2018 1:56 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment