ఎట్టకేలకు పూర్తయిన విభజన | Completed the temporary allocations of deputy collectors | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు పూర్తయిన విభజన

Published Sat, Dec 16 2017 2:52 AM | Last Updated on Sat, Dec 16 2017 2:53 AM

Completed the temporary allocations of deputy collectors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేటాయింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమయిన జూన్‌ 2, 2014 నాటికి రాష్ట్రంలో పనిచేస్తున్న 536 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లలో 305 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 231 మందిని తెలంగాణకు కేటాయించారు. ఇందులో అధికారులు ఎంచుకున్న రాష్ట్రానికే ప్రాధాన్యత ఇస్తూ తాత్కాలిక కేటాయింపు పూర్తి చేశారు. అయితే, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 42 శాతం మందిని తెలంగాణకు, 58 శాతం మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సి ఉంది. అయితే ఒక శాతం అదనంగా తెలంగాణకు ఇచ్చారని, దీంతో తెలంగాణ ఐదు పోస్టులను నష్టపోతోందని, అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ లాభపడిందని తెలంగాణ రెవెన్యూ సంఘాలు విమర్శిస్తున్నాయి.  

సీనియారిటీ జాబితా ఖరారుతో... 
ఈ విభాగాల్లో ఎట్టకేలకు సీనియారిటీ జాబితా ఓ కొలిక్కి రావడంతో తాజాగా సమావేశమైన ప్రత్యేక కమిటీ ఈ కేటాయింపులను పూర్తి చేసింది. అయితే, రాష్ట్రాన్ని ఎంచుకునే అవకాశం అధికారులకు ఇవ్వడంతో మొత్తం 43 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇందు లో తెలంగాణ నుంచి ఏపీకి 10 మంది వెళ్లగా, ఏపీ నుంచి తెలంగాణకు 33 మంది వచ్చారు. రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న సుందర్‌ అబ్నార్‌ ఏపీ ఆప్షన్‌ ఇవ్వడంతో ఆయనను అక్కడికే కేటాయించారు.  

కొందరికి రివర్షన్‌ తప్పదా..? 
తాజా కేటాయింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలంటే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన వారిలో కొందరిని రివర్షన్‌ చేయక తప్పదనే చర్చ జరుగుతోంది. గత ఏడాది 82 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వడంతో ఇటీవల వారికి పోస్టింగులు కూడా కేటాయించారు. అయితే, ఇప్పుడు ఆంధ్రా నుంచి వస్తున్న 33 మంది అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాలంటే అందులో 10–15 మందికి రివర్షన్‌ తప్పదని రెవెన్యూ సంఘాలంటున్నాయి. అయితే, తాజా కేటాయింపులతో ఏపీలో మాత్రం డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల్లో 95 వరకు ఖాళీలు పెరగనున్నాయి. 

ఆప్షన్‌ ఎంపిక మతలబు ఏమిటంటే..!
తెలంగాణలో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లుగా రెవెన్యూ అధికారులకు ఎక్కువ అవకాశం ఉండడం, తెలంగాణకు అదనపు ఐఏఎస్‌ పోస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా డిప్యూటీ కలెక్టర్లయిన వారంతా తెలంగాణే ఆప్షన్‌ పెట్టుకున్నారు. మరికొందరు హైదరాబాద్‌లో స్థిరపడడం కోసం, స్పౌస్‌ కేసుల్లో తెలంగాణను ఎంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తెలంగాణలో 58 ఉండగా, ఏపీలో 60 ఏళ్ల వరకు అవకాశం ఉంది. దీంతో రెండేళ్లు సర్వీసు కలసి వస్తుందనే కారణంతో రిటైర్మెంట్‌ దగ్గర ఉన్న కొందరు తెలంగాణ అధికారులు ఏపీని ఎంచుకోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement