మూసీకి మహర్దశ | The telagana government plan | Sakshi
Sakshi News home page

మూసీకి మహర్దశ

Published Mon, Jun 16 2014 12:12 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

మూసీకి మహర్దశ - Sakshi

మూసీకి మహర్దశ

  •      సబర్మతి తరహాలో ప్రక్షాళన  
  •      తెలంగాణ సర్కారు ప్రణాళిక
  •      కార్యాచరణ సిద్ధం
  •      కేంద్ర సాయం కోరిన కేసీఆర్
  • సాక్షి, సిటీబ్యూరో: ముక్కుపుటాలదరగొట్టే మూసీని ప్రక్షాళన చేయడానికి తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. గుజరాత్‌లో సబర్మతి నదిని కాలుష్య కోరల నుంచి కాపాడిన తరహాలోనే.. చారిత్రక మూసీ నదిని పరిరక్షించడానికి నూతనంగా కొలువుదీరిన కేసీఆర్ సర్కారు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించిన వినతిపత్రంలో మూసీ నది ప్రక్షాళనకు జాతీయ నదీ పరిరక్షణ అభివృద్ధి (ఎన్‌ఆర్‌సీడీ) పథకం కింద చేయూత నివ్వాలని కోరారు.

    ఈ నేపథ్యంలో మూసీ ప్రక్షాళన అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. సుమారు రూ.923 కోట్ల అంచనా వ్యయంతో మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేయాలని రెండేళ్ల క్రితమే జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. ఇపుడు సబర్మతి నది స్ఫూర్తితో ఈ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని పర్యావరణ వేత్తలు, నగరవాసులు సైతం కోరుతున్నారు.
     
    ఇవీ మూసీ వెతలు..!

    రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అనంతగిరిలో ప్రారంభమయ్యే మూసీ నది సుమారు వంద కిలోమీటర్లు ప్రవహించి నగరంలోకి ప్రవేశిస్తుంది. నగరం మధ్య నుంచి సుమారు 25 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. మార్గమధ్యంలో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ఇతర నివాస ప్రాంతాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో మూసీనది మురికి కూపమైంది. నిత్యం నగరంలో 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఈ నదిలో కలుస్తోంది. రెండేళ్ల క్రితం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో మొదటిదశ ప్రక్షాళన చేపట్టారు. నదీపరివాహక ప్రాంతంలో మురుగు శుద్ధికి ఐదు మురుగుశుద్ధి(ఎస్టీపీ) కేంద్రాలను నిర్మించారు. ప్రస్తుతం మొదటి దశ కింద రోజువారీగా సుమారు 500 మిలియన్ లీటర్ల మురుగు నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మరో 900 ఎంఎల్‌డీల మురుగు నీరు యథేచ్ఛగా మూసీలోకి ప్రవేశిస్తుండటంతో నది కాలుష్యకాసారమౌతోంది.
     
    రెండేళ్ల కిందటే

    కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా చారిత్రక నదులను పరిరక్షించేందుకు జాతీయ నదీపరిరక్షణ పథకాన్ని(ఎన్‌ఆర్‌సీడీ) ప్రారంభించింది. ఇందులో భాగంగా మూసీ రెండోదశ ప్రక్షాళన పథకం కింద నిత్యం 610 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయాలని రెండేళ్ల క్రితం సంకల్పించారు. ఇందుకయ్యే రూ.923 కోట్ల అంచనా వ్యయంలో 70 శాతం నిధులు మంజూరు చేసేందుకు అప్పట్లో కేంద్రం ముందుకొచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరంగా పూచీకత్తు (కౌంటర్ గ్యారంటీ) ఇవ్వడంలో విఫలమవడంతో ప్రక్షాళన పథకం అటకెక్కింది. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
     
    సబర్మతి నది ప్రక్షాళన ఇలా..

    వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాల చేరికతో కాలుష్య కాసార ంగా మారిన సబర్మతి నది ప్రక్షాళనకు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 2010లో నడుం బిగించారు. సుమారు రూ.550 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మూడేళ్ల కాలంలోనే పూర్తయింది. చారిత్రక నదిని కాలుష్య కాసారం నుంచి విముక్తి చేసింది. ఈ కృషిలో గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌లు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని సాధించి ఆదర్శంగా నిలిచాయి.

    ఒకప్పుడు మురుగు వాసనతో కంపు కొట్టిన సబర్మతి నది పరిసరాల్లో ఇపుడు ఆహ్లాద వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అహ్మదాబాద్ వాసులకు సబర్మతి తీరం చక్కటి పర్యాటక స్థలంగా మారింది. నగరం నుంచి సుమారు పది కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తోంది. కాగా సబర్మతి ప్రక్షాళనలో భాగంగా పారిశ్రామిక, వాణిజ్య, గృహాల నుంచి నదిలోకి చేరుతున్న 17 ప్రాంతాలను గుర్తించారు. వ్యర్థజలాలు ఉత్పత్తవుతున్న ప్రాంతం నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌లు ఏర్పాటు చేసి ఆ నీటిని మురుగు శుద్ధి కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.

    ఇక్కడ వ్యర్థజలాల్లోని ఘన, ద్రవ, రసాయనిక వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేసిన తరవాతే ఆ నీటిని నదిలోకి వదిలే ఏర్పాటు చేయడంతోనే నదిలో కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఇదే స్ఫూర్తితో మన నగరంలోనూ మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు జీహెచ్‌ఎంసీ, పీసీబీ, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.
     
     పాజెక్టు స్వరూపం..
     పథకం: మూసీ ప్రక్షాళన రెండోదశ
     అంచనా వ్యయం: రూ.923 కోట్లు (ఎన్‌ఆర్‌సీడీ పథకం కింద కేంద్రం 70 శాతం ఆర్థిక
     సహాయం చేస్తే.. 30 శాతం నిధులు
     రాష్ట్రప్రభుత్వం భరించాలి)
     ఉద్దేశం: మూసీలో రోజూ కలుస్తున్న 610 మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ధి
     చేపట్టనున్న నిర్మాణాలు: మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం.. పది సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు
     ఎస్టీపీలు ఎక్కడెక్కడ: అంబర్‌పేట్ (142 ఎంఎల్‌డి), నాగోల్ (140 ఎంఎల్‌డి), నల్లచెరువు (80 ఎంఎల్‌డి), హైదర్షాకోట్(30 ఎంఎల్‌డి), అత్తాపూర్(70 ఎంఎల్‌డి), మీరాలం(6 ఎంఎల్‌డి), ఫతేనగర్(30 ఎంఎల్‌డి), ఐడీపీఎల్ టౌన్‌షిప్ (59 ఎంఎల్‌డి), నాగారం (29 ఎంఎల్‌డి), కుంట్లూర్-హయత్‌నగర్ (24 ఎంఎల్‌డి)
     రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్‌షిప్, నాగారం- కాప్రా
     ప్రత్యేకతలు: జీహెచ్‌ఎంసీ పరిధిలో మూసీ నది ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో 574.59 చదరపు కిలోమీటర్ల పరిధిలో నాలాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో కూడిన నీటిని శుద్ధిచేసి తిరిగి నదిలోకి వదలాలి. పరివాహక ప్రాంతాల్లో ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా మార్చే అవకాశం ఉంటుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement