25% రిజర్వేషన్ల బాధ్యత టీ సర్కారుదే
- నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు ఏ చర్యలు తీసుకున్నారు
- 25% సీట్లు అందేలా చూసేందుకు యంత్రాంగం ఉండాలి
- స్పష్టత ఇవ్వాలని టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో బలహీనవర్గాల విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధనను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చట్టం వచ్చి ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు అందించేందుకు ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 25 శాతం సీట్లు పొందేందుకు అర్హులైన పిల్లల జాబితా ఇవ్వాలని, దానిని పరిశీలించి వారికి ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బలహీనవర్గాల విద్యార్థులకు చట్టప్రకారం 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేటు విద్యా సంస్థలను ఆదేశించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్(కోవా), మరో రెండు సంస్థలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిల్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు గురువారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. విద్యా హక్కు చట్టం పూర్తిస్థాయి అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్ల భర్తీ వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, ఎందుకంటే ఆ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. కమిటీ ఏర్పాటు చేయాలని చట్టంలో ఎక్కడుందని ప్రశ్నించింది. ఫీజు రీయింబర్స్ చేస్తే విద్యాహక్కు చట్టం లక్ష్యం నెరవేరదని, ఉచితంగానే 25 శాతం సీట్లను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.