ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ : ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ అక్రమాలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఇచ్చిన నివేదికపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైంది. జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రూ.2 కోట్ల11 లక్షల అవకతవకలు జరిగాయని కాగ్ తేల్చింది. ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణం చేపట్టకుండానే నిర్మించినట్టు తప్పుడు లెక్కలు చూయించారని పిటిషన్ పేర్కొన్నారు. లైబ్రరీలో విద్యార్థులు డిపాజిట్ చేసిన రూ.30 లక్షలు కూడా యాజమాన్యం, విద్యార్థులకు వెనక్కి తిరిగి ఇవ్వలేదు.
కోర్సులు లేకున్నా అధ్యాపకులను నియమించినట్టు చూపించి లక్షల్లో జీతాలు తీసుకున్నట్టు యాజమాన్యం లెక్కలు చూపించింది. అలాగే ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడాన్ని పిటిషనర్ తప్పుపట్టారు. ఈ అక్రమాలపై హైకోర్టులో శంకర్ అనే విద్యార్థి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఐదుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ కరస్పాండెంట్, సెక్రెటరీలకు, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులకు, ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ప్రిన్సిపాల్ అకౌంట్ జనరల్ అధికారులకు నోటీసులు పంపారు. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపట్టాలని కేసును హైకోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment