- గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్
సాక్షి,బెంగళూరు: నాణ్యమైన విద్య, వైద్యాన్ని సమాజంలోని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా గుర్తించాలని గవర్నర్ హన్స్‌రాజ్‌భరద్వాజ్ పేర్కొన్నారు. విశ్వ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాయలంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
అద్దాల మేడలతో కూడిన భవంతులు నిర్మించిన మాత్రాన ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం దక్కదని, గ్రామీణులకు కూడా సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందజేయాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసవ, నవజాతి శిశుమరణాలు పల్లెల్లోనే ఎక్కువగా ఉన్నాయన్నారు.
ప్రభుత్వాలు చొరవ తీసుకొని అర్థికంగా వెనుకబడిన వర్గాలతో పాటు గ్రామీణులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించే వినూత్న పథకాలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా యునాని, హోమియోపతి, ఆయుర్వేద వైద్య విధానాలు ప్రాచూర్యం పొందుతున్నాయన్నారు.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద క్లీనిక్‌లను ప్రారంభించడం వల్ల కొంత ఉపయోగముంటుందన్నారు. ఆయుర్వేద వైద్య విద్యార్థులకు ఉపాధి చూపించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ కే.ఎస్ శ్రీ ప్రకాశ్, కర్ణాటక హోమియోపతి వైద్యుల సంఘం అధ్యక్షుడు బీ.టీ రుద్రేష్ తదితరులు పాల్గొన్నారు.