- అవసరమైతే ఢిల్లీలో ఉద్యమం
- ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు
పాడేరు : ప్రాణాలు పణంగా పెట్టయినా విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిల్వలను కాపాడుకుంటామని వైఎస్సార్ సీపీ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావు స్పష్టం చేశారు. పర్యావరణ విఘాతంతోపాటు గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థకం చేసే బాక్సైట్ తవ్వకాల జోలికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తే సహించమన్నారు. బాక్సైట్ తవ్వకాలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, దీన్ని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. శనివారం పాడేరులో వీరు విలేకరులతో మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తే ఢిల్లీలోనే పోరాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఏజెన్సీలో గిరిజనులకు మౌలిక సదుపాయాలు సమకూరలేదన్నారు. కనీసం మంచినీటి సౌకర్యం లేదని చెప్పారు. 244 పంచాయతీల్లో 200 పంచాయతీలకు రవాణా సౌకర్యం లేదన్నారు. ఏటా రోడ్ల నిర్మాణానికి కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా గిరిజనులకు నడకే శరణ్యమవుతోందని చెప్పారు. మాచ్‌ఖండ్, సీలేరు కేంద్రాల ద్వారా 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అనేక గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐటీడీఏ పాలకవర్గాన్ని సమావేశపర్చాలి
ఐటీడీఏకు వస్తున్న నిధులు, ఏజెన్సీలో చేపడుతున్న గిరిజనాభివృద్ధి కార్యక్రమాలపై జవాబుదారీతనం లోపించిందని ఎమ్మెల్యేలు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం మూడుసార్లే పాలకవర్గ సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి 3 నెలలకోసారి జరగాల్సిన సమావేశాలను నిర్లక్ష్యం చేయడం వల్ల గిరిజనాభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని చెప్పారు.
‘అల్లూరి’ జిల్లా ఏర్పాటుచేయాలి
అరకు నియోజకవర్గం పరిధిలోని ఏడు గిరిజన నియోజకవర్గాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం ‘అల్లూరి’ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అప్పుడే ఏజెన్సీ అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీ తరపున ఎన్నికైన ఒకే ఒక్క గిరిజన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వక పోవడంలోనే గిరిజనులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఆరుగురు ఎస్టీ ఎమ్మెల్యేలం సమగ్ర గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు.