Gidney Eashwari
-
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
విశాఖపట్నం : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విశాఖ ఎంవీపీ డబుల్ రోడ్డులో ఉన్న గిరిజన భవన్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇటీవల ఎన్నికయిన ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా సన్మానించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు గిరిజన సమస్యలపై మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకునేందుకు ఉద్యమాలు చేపడతామన్నారు. గిరిజనలకు ఆటవీ హక్కుల చట్టాలను ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. గిరిజన ఉద్యోగులు, సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గిరిజనుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో ‘1/70, పీసా, అటవీ హక్కుల చట్టాలను కచ్చితంగా అమలుచేయాలని కోరారు. ఏజెన్సీలోని ప్రతి మండల కేంద్రంలో ఇంగ్లిష్ మీడియం సూళ్లను ఏర్పాటు చేయాలని, ఆటవీ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని, గిరిజన జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్లు శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. విశాఖ మన్యంలో గిరిజ యూనివర్శిటీని నెలకొల్పాలన్నారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యేలను సత్కరించారు. అనంతరం ఏయూలో ఎమ్మె స్సీ బోటనీ (డిస్టెన్స్)లో గోల్డ్‌మెడల్ సాధించిన ఎల్.బి.దివ్యజ్యోతికి ఏయూ ఉద్యోగులు నగదుతో పాటు షీల్డును అందజేశారు. ఆదివాసీ రిజర్వేషన్ సంరక్షణ సేవా సంఘం అధ్యక్షుడు ఆర్.ఎస్.దొర పాల్గొన్నారు. -
‘బాక్సైట్’ను కాపాడుకుంటాం
అవసరమైతే ఢిల్లీలో ఉద్యమం ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు పాడేరు : ప్రాణాలు పణంగా పెట్టయినా విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిల్వలను కాపాడుకుంటామని వైఎస్సార్ సీపీ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావు స్పష్టం చేశారు. పర్యావరణ విఘాతంతోపాటు గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థకం చేసే బాక్సైట్ తవ్వకాల జోలికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తే సహించమన్నారు. బాక్సైట్ తవ్వకాలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, దీన్ని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. శనివారం పాడేరులో వీరు విలేకరులతో మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తే ఢిల్లీలోనే పోరాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఏజెన్సీలో గిరిజనులకు మౌలిక సదుపాయాలు సమకూరలేదన్నారు. కనీసం మంచినీటి సౌకర్యం లేదని చెప్పారు. 244 పంచాయతీల్లో 200 పంచాయతీలకు రవాణా సౌకర్యం లేదన్నారు. ఏటా రోడ్ల నిర్మాణానికి కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా గిరిజనులకు నడకే శరణ్యమవుతోందని చెప్పారు. మాచ్‌ఖండ్, సీలేరు కేంద్రాల ద్వారా 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అనేక గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ పాలకవర్గాన్ని సమావేశపర్చాలి ఐటీడీఏకు వస్తున్న నిధులు, ఏజెన్సీలో చేపడుతున్న గిరిజనాభివృద్ధి కార్యక్రమాలపై జవాబుదారీతనం లోపించిందని ఎమ్మెల్యేలు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం మూడుసార్లే పాలకవర్గ సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి 3 నెలలకోసారి జరగాల్సిన సమావేశాలను నిర్లక్ష్యం చేయడం వల్ల గిరిజనాభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని చెప్పారు. ‘అల్లూరి’ జిల్లా ఏర్పాటుచేయాలి అరకు నియోజకవర్గం పరిధిలోని ఏడు గిరిజన నియోజకవర్గాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం ‘అల్లూరి’ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అప్పుడే ఏజెన్సీ అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీ తరపున ఎన్నికైన ఒకే ఒక్క గిరిజన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వక పోవడంలోనే గిరిజనులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఆరుగురు ఎస్టీ ఎమ్మెల్యేలం సమగ్ర గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. -
స్వార్థంతోనే‘గీత’ దాటారు
ప్రజాతీర్పును అపహాస్యం చేయొద్దు పార్టీకి ద్రోహం చేస్తే గిరిజనులు బుద్ధిచెబుతారు ఎంపీ గీత తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జి.మాడుగుల : ‘వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకునే గిరిజనులు అరకు ఎంపీగా కొత్తపల్లి గీతను గెలిపించారు...అంతేగానీ కొత్తపల్లి గీతను చూసి ఎవ్వరూ ఓట్లు వేయలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పట్ల ఉన్న అభిమానం, వై.ఎస్.జగన్ నాయకత్వం పట్ల ఉన్న నమ్మతోనే గీతను 90 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఈ గెలుపు తనదేనని ఎంపీ గీత అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి లేదు’అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. జి.మాడుగులలో వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మండలాధ్యక్షుడు మత్స్యరాస వెంకట గంగరాజు(బుజ్జి)కు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు గల ప్రజాదరణతో గెలిచిన కొత్తపల్లి గీత తన స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. ఆర్థిక ప్రయోజనాల కోసం టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్సీపీకి ద్రోహం చేస్తే ఆమెకు గిరిజనులు గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల తీర్పును అపహాస్యం చేసే ఇలాంటి నేతలను తరిమి కొట్టాలని ఎమ్మెల్యే ఈశ్వరి ప్రజలను కోరారు. నకిలీ ధ్రువపత్రాలతో ఎస్టీగా చలామణి అయ్యే వ్యక్తులను ఆదరించొద్దన్నారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తనతోపాటు పార్టీలో మహిళలను సొంత సోదరిలా చూసుకుంటూ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే ఈశ్వరి పేర్కొన్నారు. అరకు లోక్‌సభ నియోజవకర్గ పరిధిలో నలుగురు మహిళా ఎమ్మెల్యేలకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధినేత వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని అన్నారు. అంతటి విశ్వసనీయత ఉన్న జగన్ వెన్నంటి నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. -
ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి
మానవ సంబంధాలకే తొలి ప్రాధాన్యం ఏపీటీఎఫ్ సత్కార సభలో పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి అనకాపల్లిరూరల్: ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ఉపాధ్యాయుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. వారి సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అనకాపల్లిలోని ఏపీటీఎఫ్ భవనంలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, పలువురు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను ఆదివారం ఘనంగా సత్కరించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఆమె చేసిన సేవలను సభలో పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను ఎన్నికయ్యేందుకు ఉపాధ్యాయ నాయకురాలిగా చేసిన సేవలు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కలలుకనేదాన్నని, ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని చెప్పారు. 1992లో తాను ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీచేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయానని గుర్తు చేశారు. అప్పుడే ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్ష తనలో మొగ్గతొడిగిందని చెప్పారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయ వృత్తిలో చేరనని తెలిపారు. ఉపాధ్యాయ నాయకురాలిగా ఏపీటీఎఫ్ తనకు వేదిక కల్పించడంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఎమ్మెల్యేగా ఎదగడానికి ఇదే తనకు మార్గం చూపిందని తెలిపారు. భావోద్వేగానికి గురైన ఈశ్వరి సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా ఒకానొక దశలో ఎమ్మెల్యే ఈశ్వరి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. రాజకీయంగా ఎన్నో ఇబ్బం దులు, అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. సమస్యలను, కష్టాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా చివరికి లక్ష్యాన్ని సాధించగలిగానన్న సంతృప్తి మిగిలిం దన్నారు. మానవ సంబంధాలకే తన తొలి ప్రాధాన్యం అని, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వారి సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా తనకు నెలకు లక్ష రూపాయల ఆదాయం వస్తుందని, తొలి నెల ఆదాయాన్ని పాడేరు మోదకొండమ్మ అమ్మవారికి, రెండో నెల ఆదాయంలో యాభైవేలు ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గానికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు సింహాద్రప్పడు, అధ్యక్షుడు డి.వి.జగన్నాథరావు, కార్యదర్శి వెంకటపతిరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీలా జగన్నాథరావు, ఏపీటీఎఫ్ నాయకులు సత్యం మాస్టారు తదితరులు పాల్గొన్నారు.