- మానవ సంబంధాలకే తొలి ప్రాధాన్యం
- ఏపీటీఎఫ్ సత్కార సభలో పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి
అనకాపల్లిరూరల్: ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ఉపాధ్యాయుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. వారి సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అనకాపల్లిలోని ఏపీటీఎఫ్ భవనంలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, పలువురు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను ఆదివారం ఘనంగా సత్కరించారు.
ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఆమె చేసిన సేవలను సభలో పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను ఎన్నికయ్యేందుకు ఉపాధ్యాయ నాయకురాలిగా చేసిన సేవలు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కలలుకనేదాన్నని, ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని చెప్పారు.
1992లో తాను ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీచేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయానని గుర్తు చేశారు. అప్పుడే ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్ష తనలో మొగ్గతొడిగిందని చెప్పారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయ వృత్తిలో చేరనని తెలిపారు. ఉపాధ్యాయ నాయకురాలిగా ఏపీటీఎఫ్ తనకు వేదిక కల్పించడంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఎమ్మెల్యేగా ఎదగడానికి ఇదే తనకు మార్గం చూపిందని తెలిపారు.
భావోద్వేగానికి గురైన ఈశ్వరి
సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా ఒకానొక దశలో ఎమ్మెల్యే ఈశ్వరి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. రాజకీయంగా ఎన్నో ఇబ్బం దులు, అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. సమస్యలను, కష్టాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా చివరికి లక్ష్యాన్ని సాధించగలిగానన్న సంతృప్తి మిగిలిం దన్నారు. మానవ సంబంధాలకే తన తొలి ప్రాధాన్యం అని, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వారి సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు.
ఎమ్మెల్యేగా తనకు నెలకు లక్ష రూపాయల ఆదాయం వస్తుందని, తొలి నెల ఆదాయాన్ని పాడేరు మోదకొండమ్మ అమ్మవారికి, రెండో నెల ఆదాయంలో యాభైవేలు ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గానికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు సింహాద్రప్పడు, అధ్యక్షుడు డి.వి.జగన్నాథరావు, కార్యదర్శి వెంకటపతిరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీలా జగన్నాథరావు, ఏపీటీఎఫ్ నాయకులు సత్యం మాస్టారు తదితరులు పాల్గొన్నారు.