స్వార్థంతోనే‘గీత’ దాటారు
- ప్రజాతీర్పును అపహాస్యం చేయొద్దు
- పార్టీకి ద్రోహం చేస్తే గిరిజనులు బుద్ధిచెబుతారు
- ఎంపీ గీత తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
జి.మాడుగుల : ‘వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకునే గిరిజనులు అరకు ఎంపీగా కొత్తపల్లి గీతను గెలిపించారు...అంతేగానీ కొత్తపల్లి గీతను చూసి ఎవ్వరూ ఓట్లు వేయలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పట్ల ఉన్న అభిమానం, వై.ఎస్.జగన్ నాయకత్వం పట్ల ఉన్న నమ్మతోనే గీతను 90 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఈ గెలుపు తనదేనని ఎంపీ గీత అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి లేదు’అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు.
జి.మాడుగులలో వైఎస్సార్‌సీపీ నేతలు మంగళవారం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మండలాధ్యక్షుడు మత్స్యరాస వెంకట గంగరాజు(బుజ్జి)కు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు గల ప్రజాదరణతో గెలిచిన కొత్తపల్లి గీత తన స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు.
ఆర్థిక ప్రయోజనాల కోసం టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేస్తే ఆమెకు గిరిజనులు గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల తీర్పును అపహాస్యం చేసే ఇలాంటి నేతలను తరిమి కొట్టాలని ఎమ్మెల్యే ఈశ్వరి ప్రజలను కోరారు. నకిలీ ధ్రువపత్రాలతో ఎస్‌టీగా చలామణి అయ్యే వ్యక్తులను ఆదరించొద్దన్నారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తనతోపాటు పార్టీలో మహిళలను సొంత సోదరిలా చూసుకుంటూ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే ఈశ్వరి పేర్కొన్నారు.
అరకు లోక్‌సభ నియోజవకర్గ పరిధిలో నలుగురు మహిళా ఎమ్మెల్యేలకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధినేత వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని అన్నారు. అంతటి విశ్వసనీయత ఉన్న జగన్ వెన్నంటి నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు.