పారిశ్రామికాభివృద్ధికి విశాఖ అనుకూలం
- అరకు, పాడేరులో పర్యాటకాభివృద్ధికి అవకాశ
- సీఐఐ సదస్సులో ఉత్తరాంధ్ర ఎంపీలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికాభివృద్ధికి విశాఖ అన్ని విధాలా అనువైనదని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి చేశాయన్నారు.
ఇక మీదట ఆ పరిస్థితి లేకుండా ప్రాంతాలవారీ సమానాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వ పరంగా అనుమతులకు తన వంతు సహకారం అందించనున్నట్టు తెలిపారు. విశాఖలో రూ.1400 కోట్లు మేర ఉన్న ఐటీ పరిశ్రమను రూ.10 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అభివృద్ధి చేయాలన్నారు. పారిశ్రామికవాడలు, కారిడార్ల కోసం నిరీక్షించకుండా సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ఏపీఐఐసీకి స్థలాలిచ్చినా.. నిర్ణీత గడువులోగా పరిశ్రమల్ని ఏర్పాటు చేయలేకపోయిందన్నారు.
ఇలాంటి భూముల్ని సేకరించి ప్రత్యామ్నాయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు అనుబంధంగా అభివృద్ధి జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరితో సంబంధాలున్న దక్షిణ భారత్‌లోనే అతి పెద్దదైన అరకు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలా అనువుగా ఉంటుందన్నారు. అరకు, పాడేరులో చాలా ప్రాంతాలు పర్యాటకాభివృద్ధికి అనుకూలమన్నారు.
ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత మూడేళ్లుగా పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, విభజన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అనంతరం పరిశ్రమల ప్రతినిధులు అడిగిన సందేహాలకు సమాధానమిచ్చారు. సమావేశంలో సీఐఐ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టూరి సురేష్, విశాఖ జోన్ అధ్యక్షుడు జి.వి.ఎల్.సత్యకుమార్ పాల్గొన్నారు.