
యాసిడ్ దాడుల నుంచి ఆమెకు రక్షణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళలపై యాసిడ్ దాడుల అఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో విచ్చలవిడిగా రసాయనాలను విక్రయించకుండా నిషేధం విధించాలని సూచిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొనుగోలుదారుల పూర్తి వివరాలను నమోదు చేయకుండా ఇష్టం వచ్చినట్లు యాసిడ్ విక్రయించే దుకాణదారులకు రూ.50,000 జరిమానా విధించాలని సూచించింది. యాసిడ్ దాడిని నాన్‌బెయిలబుల్ నేరంగా పేర్కొంటూ వీలైనంత త్వరగా చట్టాలు చేయాలని రాష్ట్రాలను కోరింది. యాసిడ్ దాడుల బాధితులకు ఉచితంగా చికిత్స అందచేయాలని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు, విభాగాలను ఇప్పటికే ఆదేశించినట్లు హోంశాఖ తెలిపింది. ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైనందున యాసిడ్ దాడి బాధితులకు ఉచిత వైద్యసాయం, పునరావాసం తదితర అంశాలపై హోంశాఖ మార్గదర్శకాలను వెలువరించింది. మగువలపై యాసిడ్ దాడులను అరికట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేసేందుకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల్లో ప్రధానమైనవి: యాసిడ్ దాడి బాధితురాలికి చికిత్స, పునరావాసం కింద ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కనీసం రూ.3 లక్షలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి. ఘటన జరిగిన 15 రోజుల్లోగా తక్షణ సాయం కింద రూ.లక్ష అందచేయాలి. మిగతా రూ.2 లక్షలను వీలైనంత వేగంగా లేదా రెండు నెలల్లోగా చెల్లించాలి. యాసిడ్ కొనుగోలుదారుల సమాచారాన్ని, చిరునామానాను విక్రేతలు కచ్చితంగా నమోదు చేసుకోవాలి. చిల్లరగా వీటిని విక్రయించరాదు. ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు కలిగిన వారికే యాసిడ్‌ను విక్రయించాలి. 18 ఏళ్లు నిండి చిరునామా ధ్రువపత్రాన్ని చూపితేనే యాసిడ్ అమ్మాలి. యాసిడ్ నిల్వల వినియోగం వివరాలను విక్రయదారుడు సంబంధిత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఎదుట 15 రోజుల్లోగా సమర్పించాలి. లేకపోతే రూ.50వేల వరకు జరిమానా. యాసిడ్‌ను వినియోగించే విద్యాసంస్థలు, పరిశోధనా ల్యాబ్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ విభాగాలు కూడా విని యోగం వివరాలను నమోదు చేయాలి. వివరాలను సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌కు ఇవ్వాలి.