విశ్లేషణ
ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. దీనితో పాటు త్వరగా పాడయ్యే టొమేటో, బంగాళదుంప, ఉల్లి, ఇతర కూరగాయల పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించే విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో వ్యవసాయదారుల కమిషన్లు ఏర్పడినాయి. కానీ అవి ఆశ్రితులకు పునరావాసం కల్పించేందుకే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి తక్షణం చేయవలసిన పని ఏమిటంటే, ఈ కమిషన్లను రాష్ట్ర వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్లుగా మార్పు చేయాలి. రైతులకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దుర్గ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో గడచిన రెండువారాలలో కొన్ని విషాదకర దృశ్యాలు వరసగా దర్శనమిచ్చాయి. ఆ పక్షం రోజుల పాటు కూడా ఆయా ప్రాంతాల రైతులు వారు పండిం చిన టొమేటోలను రోడ్ల మీదకు తెచ్చి పారబోయడం కనిపించింది. ఆ జిల్లాలోనే ఉంది పర్సూలీ అనే గ్రామం. ఆ ఒక్క గ్రామంలోనే కనీసం 100 క్వింటాళ్ల టొమేటో పంటకు ఇదే గతి పట్టిందని అంచనా. అక్కడి రైతాంగం ఆ పంటను తమ పశువుల చేత అవి తిన్నంత తినిపించింది. ఇంకొంత పొలాలలోనే వదిలి, కుళ్లిపోయేటట్టు చేసింది. మొన్న జనవరి మొదటి వారం వరకు కొద్దిగా మెరుగ్గానే ఉన్నా, తరువాత టొమేటోల చిల్లర ధర పడిపోతూ వచ్చింది.
ఉత్తర భారతంలోని ఆ రాష్ట్రంలోనే కాదు, దక్షిణాదిన తమిళనాడులో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిం చాయి. ఈ రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా రైతాంగాన్ని మార్కెట్ పరిస్థితులు తీవ్రంగా కలత పెడుతున్నాయి. అక్కడ క్యాబేజీ చిల్లర ధర దారుణంగా పడిపోయింది. గడచిన సంవత్సరం క్యాబేజీ కిలో ఒక్కంటికి రూ.12 ధర పలికినప్పటికీ, రైతులకు దక్కినది సగటున కిలోకు కేవలం ఒక్క రూపాయి. పడిపోతున్న టొమేటో ధర ఛత్తీస్‌గఢ్‌లో కూడా రైతుల జీవితాలను కకావికలు చేస్తోంది. కిలో ఒక్కంటికి రూ. 1, లేకపోతే, రూ. 2లకు మించి దక్కని పరిస్థితులలో చాలామంది రైతులు పంటను కోసే పని కూడా పెట్టుకోకుండా పొలం మీదే వదిలి పెడుతున్నారు. అంటే మార్కెట్ నుంచి దక్కుతున్న ఆ పరిమిత రాబ yì పంట వ్యయానికే కాదు, కోత కోయడానికి కూడా గిట్టుబాటు కావడం లేదు.
అధిక దిగుబడితోనూ కష్టాలేనా?
నిజానికి ఇలాంటి పరిస్థితి ఎందుకంటే– అధిక దిగుబడి. అది టొమేటో కావచ్చు, బంగాళదుంప, క్యాబేజీ, ఉల్లి, మరేదైనా పంట కావచ్చు. అవన్నీ అధికంగానే పండుతున్నాయి. కానీ పలుకుతున్న ధర మాత్రం చాలా తక్కువ. అధిక దిగుబడి మళ్లీ మధ్య దళారీలకే లాభం చేకూరుస్తున్నది. దళారులంతా ముఠాలు కట్టేసి, తరుచూ దోపిడీ అనదగిన స్థాయిలో ధరలను నియంత్రిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దాపురించడానికి కారణం అధిక దిగుబడేనని ఈరోడ్ జిల్లాకు చెందిన రైతు టి. రాజాగణేశ్ కూడా అంగీకరించారు. ‘ఒక ఎకరం పొలంలో ఒక నెలపాటు క్యాబేజీ సాగుకు రైతు చేసే వ్యయం రూ. 45,000. దీనికి కూలీల ఖర్చును కలపవలసి ఉంటుంది. ఇంకా నిర్వహణ, ఎరువుల ఖర్చును కూడా జత చేయాలి. ఇవన్నీ కలుపుకుంటే నెలకి అయ్యే ఖర్చు దాదాపు రూ. 50,000. ఇక క్యాబేజీ పంట చేతికి అందాలంటే మూడు మాసాలు పడుతుంది.
అంటే ఒక ఎకరం భూమిలో క్యాబేజీ సాగు చేయాలంటే చేయవలసిన వ్యయం కనీసం రూ. 1.5 లక్షలు. అలాంటప్పుడు కిలో ఒక్కంటికి రైతుకు ఒక్క రూపాయి వస్తే మాకు లాభం వచ్చిందని ఎలా అనుకోగలం?’అని ప్రశ్నించారు రాజాగణేశ్. టొమేటో సాగు కూడా ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండడం లేదు. చిన్న రైతు విషయమే తీసుకోండి. ఒక ఎకరం పొలంలో ఆ పంటను పండించాలంటే వారి కయ్యే వ్యయం రూ. 90,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉంటుంది. అదే పెద్ద రైతులు టొమేటో పండిస్తే ఇంకొంచెం ఎక్కువగా, అంటే ఎకరానికి రూ. 1.25 లక్షల వరకు సాగు వ్యయం అవుతుంది. దుర్గ్ జిల్లాలో టొమేటో రైతులను కలుసుకోవడానికి నేను జనవరిలో పర్యటించాను. అప్పుడు ధరలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయి. 25 కిలోల ఒక పెట్టె రూ. 1,000 ధర పలికిన సమయమది. అయితే కర్ణాటక నుంచి టొమేటోలు మార్కెట్‌లో ప్రవేశించడంతో సరుకు పెరిగిపోయింది. ధరలు పడిపోయాయి.
ఇప్పుడు శనగ పంట విషయం తీసుకుందాం. కొత్త పంట మార్కెట్‌లోకి రావడం మొదలైంది. వీటి కనీస మద్దతు ధర రూ. 4,400. కానీ మార్కెట్‌లో రైతుకు లభిస్తున్న ధర రూ. 3,600. అంటే క్వింటాల్‌కు 20 శాతం తక్కువగా వారికి దక్కుతోంది. ఇది చిల్లర ధర. పైగా ఈ సంవత్సరం 8 శాతం అధికంగా సాగు జరి గింది. కాబట్టి కోటి లక్షల టన్నుల అధిక దిగుబడి ఉంటుందని (గడచిన సంవత్సరం దిగుబడి దాదాపు 93 లక్షల టన్నులు) అంచనా. కాబట్టి పంట మార్కెట్‌కు చేరే కొద్దీ ధర మరింతగా పతనమయ్యే అవకాశాలే ఎక్కువ. గోధుమ ధరలు కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువగానే రైతుకు దక్కుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఆ పంటకు కనీస మద్దతు ధర కంటే 6నుంచి 8 శాతం తక్కువగానే రైతులకు దక్కుతోంది. అక్కడ కూడా పంట మార్కెట్‌లకు రవాణా కావడం మొదలైంది.
కనీస మద్దతు ధర మిథ్యేనా?
కందిపప్పు ధర కూడా అంతే. మొన్న ఫిబ్రవరి ఆఖరి వారానికి కందిపప్పు మార్కెట్ ధర క్వింటాల్‌కు రూ. 4,500. కానీ, తెలంగాణలోని తాండూర్‌లో సేకరణ ధర మాత్రం రూ. 5,500. ఈ నెల మొదటి వారంలో గుజ రాత్, మధ్యప్రదేశ్‌లలో కొనసాగిన ఆవాలు, ఇతర పప్పుధాన్యాల ధరలను పరిశీలించినా ఇదే అవగతమవుతుంది. వాటి మార్కెట్ ధర ప్రకటించిన మద్దతు ధర కంటే చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలా ఉండగానే, ఛత్తీస్‌గఢ్‌లో మరో దఫా రైతులు తమ టొమేటో పంటను రోడ్ల మీదకు తెచ్చి పడేశారన్న వార్తలు వచ్చాయి. టొమేటోల ధర కిలో ఒక్కంటికి రూ.1కి పతనం కావడమనే విష పరిణామం వరుసగా మూడేళ్లు కొనసాగినట్టవుతుంది.
ఇది టొమేటోలకే పరిమితమైన విష పరిణామం కూడా కాదు. నిజానికి వ్యవసాయోత్పత్తుల ధరలు దేశవ్యాప్తంగా పతనం కావడమనే ఆ పరి ణామం వరసగా మూడేళ్ల నుంచి జరుగుతోందన్న వాస్తవం గమనించాలి. 2014, 2015 వరుసగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొని రైతులను వేధించాయి. తరువాత 2016, 2017, 2018 సంవత్సరాలు పంట దిగుబడికి సానుకూలంగా ఉన్నాయి. ఈ అధిక దిగుబడి ప్రభుత్వానికి ఎంతో మోదాన్ని తెచ్చి పెట్టింది. కానీ పడిపోయిన ధరలు మాత్రం రైతును దుఃఖసాగరంలోకి నెట్టివేశాయి.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
ఇలాంటి పరిస్థితులలో కర్ణాటక వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ టి. ఎన్. ప్రకాశ్ చేసిన సూచన సముచితంగా ఉంటుందని నా అభిప్రాయం. ఆయన సూచన సరైన సమయంలో వచ్చినదే కూడా. పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయడం చట్ట ప్రకారం అమలు చేసే విధంగా రూపొందాలని ఆయన చెప్పారు. మైసూరులో డాక్టర్ ప్రకాశ్ ఇచ్చిన ఒక స్మారకోపన్యాసంలో ఈ సూచన చేశారు. ‘గరిష్ట చిల్లర ధరను మించి ఉత్పత్తులను విక్రయిస్తే దాని నుంచి వినియోగదారునికి చట్టబద్ధమైన రక్షణ ఉంది. అలా జరిగిన పక్షంలో వినియోగదారులు న్యాయస్థానాలకు వెళ్లవచ్చు. కానీ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా, రైతుకు మాత్రం అలాంటి చట్టబద్ధమైన రక్షణ లేదు’అని ఆయన గుర్తు చేశారు.
వ్యవసాయోత్పత్తుల ధరలు పతనం కావడమనే పరిణామం మూడేళ్లుగా వరుసగా జరుగుతోంది. మూడో సంవత్సరంలో కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో చూస్తే అన్ని వ్యవసాయోత్పత్తులు వాటికి ప్రకటించిన కనీస మద్దతు ధరల కంటే 20 నుంచి 45 శాతం తక్కువ ధరలకే నోచుకుంటున్నాయి. కర్ణాటకలో ఐక్య మార్కెట్ వేదికను ఏర్పాటు చేశారు. దీనితో దేశంలో 585 ఈ నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చ రల్ మార్కెట్) శాఖలు విస్తరించాయి కూడా. అయినా రైతులకు ఒనగూడిన ప్రయోజనం ఏమీలేదు. నమూనా ధరల నిర్ణయం కూడా రైతుకు ఏమీ చేయలేదు. రోజు వారీ ట్రేడింగ్‌ను బట్టి ఈ ధరను నిర్ణయిస్తారు. ఇది వాస్తవంలో నిస్పృహను మిగిల్చింది. ఈ విధానానికి స్వస్తి పలకడం అవసరం. ఈ నామ్‌ల ఉద్దేశం కూడా జాతీయ స్థాయిలో స్పాట్ ట్రేడింగ్‌కు లాభం చేకూర్చడమే.
రాష్ట్రాలలో వ్యవసాయోత్పత్తుల కమిషన్లు
నాది కూడా ఒక సూచన ఉంది. ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. దీనితో పాటు త్వరగా పాడయ్యే టొమేటో, బంగాళదుంప, ఉల్లి, ఇతర కూరగాయల పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించే విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో వ్యవసాయదారుల కమిషన్లు ఏర్పడినాయి. కానీ అవి ఆశ్రితులకు పునరావాసం కల్పిం చేందుకే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి తక్షణం చేయవలసిన పని ఏమిటంటే, ఈ కమిషన్లను రాష్ట్ర వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్లుగా మార్పు చేయాలి. రైతులకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలి. అంటే కర్ణాటకలో ఏర్పాటు చేసిన కమిషన్ మాదిరిగా అన్నమాట. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు మించి కర్ణాటక 14 పంటలను సేకరిస్తూ ఉంటే, రాజకీయాలకు అతీతంగా ఇలాంటి పంథాను అనుసరించడానికి మిగిలిన రాష్ట్రాలకు ఎదురయ్యే చిక్కులేమిటో అర్థం కాదు.
- దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment