devendra sharma
-
వ్యవసాయంపై మళ్లీ శీతకన్ను
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి అంతర్జాతీయ కారణాలకంటే వినియోగ డిమాండ్ పడిపోవడం, పెట్టుబడులు తగ్గిపోవడమే ప్రధాన కారణమని ఆర్థికరంగ నిపుణులు చాలావరకు ఏకాభిప్రాయానికి వస్తున్నారు. పైగా దేశ స్థూల దేశీయోత్పత్తి 5 శాతంకంటే తక్కువకు పతనమైన నేపథ్యంలో గ్రామీణ జనాభాకు మరింత ఎక్కువగా డబ్బును అందించాల్సి ఉంది. వ్యవసాయానికి ఉద్దీపన ప్యాకేజీలు అందించాల్సి ఉంది. కానీ 2020 బడ్జెట్ కూడా వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో ‘కోల్పోయిన మంచి అవకాశం’ గానే మిగిలిపోయిందనిపిస్తోంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక రంగాలకు తాజా బడ్జెట్లో కేటాయింపులు పెంచడానికి కేంద్రప్రభుత్వానికి మనసొప్పలేదంటే వ్యవసాయంపై పాలకుల శీతకన్ను ఇంకా కొనసాగుతోందనే చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020 కేంద్రబడ్జెట్ ముక్కుసూటిగా చెప్పాలంటే ఒక కోల్పోయిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. గ్రామీణ వ్యయంలో పతనం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోయి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా దేశ స్థూల దేశీయోత్పత్తే (జీడీపీ) 5 శాతం కంటే తక్కువగా పతనమైపోయిన సమయంలో గ్రామీణ జనాభా చేతుల్లోకి మరింత ఎక్కువగా డబ్బును అందించాల్సి ఉంది. మన వ్యవసాయంలో ఇప్పటికీ దేశంలోని 70 శాతం గృహాలు పాలు పంచుకుంటున్నందున ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయాలంటే గ్రామీణుల చేతుల్లో మరింత అధికంగా డబ్బు పంపిణీ చేయడం అత్యుత్తమమైన మార్గం. గ్రామీణ వినియోగం ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయిన తరుణంలో పల్లెసీమల్లో ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే వ్యవసాయానికి ఉద్దీపన ప్యాకేజీలు అందించడం అత్యవసరం. భారతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి అంతర్జాతీయ కారణాల కంటే దేశీయ కారణాలే ప్రధానమన్నది అందరికీ తెలిసిన విషయమే. అవేమిటంటే డిమాండ్ పడిపోవడం, పెట్టుబడులు తగ్గిపోవడం. ఈ దుస్థితినుంచి బయటపడాలంటే వ్యవసాయదారులకు, కూలీలకు ప్రత్యక్ష నగదు మద్దతు రూపంలో మరింత డబ్బు అందేలా చూడటమే మార్గమని చాలామంది ఆర్థికవేత్తలు ఇప్పుడు సూచిస్తున్నారు. జనాభాలోని 60 శాతం మంది అధోజగత్ సహోదరుల చేతుల్లో మొత్తం జాతీయ సంపదలో 4.8 శాతం వాటా మాత్రమే ఉంటున్న స్థితిలో ప్రధానమంత్రి–కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచడం అనేది ఒక ఆదర్శపూరితమైన పంథా అవుతుంది. పీఎమ్–కిసాన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరొక రూ.1.50 లక్షల కోట్ల డబ్బును కేటాయించాలని నేను ఇప్పటికే చాలాసార్లు సూచించి ఉన్నాను. అంటే నెలకు దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి మరొక రూ. 1,500ల డబ్బు ప్రత్యక్ష నగదు మద్దతు రూపంలో అందుతుంది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు అందిస్తున్న వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ. 12,000కు రెట్టింపు చేస్తుందని నేను భావించాను. దీనికి అదనంగా జాతీయ పనికి ఆహార పథకం కింద బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుతం ఉన్న రూ. 70,000 కోట్లను కనీసం లక్ష కోట్ల రూపాయలకు పెంచినట్లయితే అది ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపిస్తుంది. పైగా వ్యవసాయ కూలీలు అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా పాలకులు గమనించాల్సి ఉండింది. కానీ ప్రధానమంత్రి కిసాన్ ప«థకాన్ని, జాతీయ పనికి ఆహార పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో ఆర్థిక మంత్రి విఫలమయ్యారు. ఈ రెండు పథకాలకు బడ్జెట్లో ఇతోధికంగా నిధులు కేటాయించి ఉంటే గ్రామీణ వినియోగంలో డిమాండును సృష్టించడం సాధ్యమయ్యేది. ఇది దానికదిగా గ్రామీణ వినియోగాన్ని పెంచి అధిక ఆర్థిక వృద్ధి రేటుకు దోహదపడేది. కానీ దురదృష్టవశాత్తూ వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక రంగాలకు తాజా బడ్జెట్లో గణనీ యంగా కేటాయింపులు పెంచడానికి కేంద్రప్రభుత్వానికి మనసొప్పినట్లు లేదు. ఈసారి వ్యవసాయరంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ. 2.83 లక్షల కోట్లు. అయితే గత సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన రూ. 2.68 లక్షల కోట్ల అంచనాతో పోలిస్తే తాజా కేటాయింపుల్లో పెద్దగా పెరుగుదల లేనట్లే. వ్యవసాయ రుణాల కల్పనకు మాత్రం గత సంవత్సరంలో కేటాయించిన రూ.13.5 లక్షల కోట్లతో పోలిస్తే ఈ దఫా కాస్త ఎక్కువగా అంటే రూ. 15 లక్షల కోట్ల మేరకు పెంచడం ముదావహం. అయితే ఈరోజుకీ దేశంలోని చిన్న, సన్నకారు రైతుల్లో దాదాపు 41 శాతంమందికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులనుంచి వ్యవసాయ రుణాలు అందడం లేదని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన కీలకమైన విషయం ఏమిటంటే ఇప్పుడు రైతులకు కావలసింది మరింత రుణం కాదు. వారికి అధిక ఆదాయాన్ని కల్పించడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం. నిజం చెప్పాలంటే ఆహార సబ్సిడీకి బడ్జెట్ కేటాయింపులు గత సంవత్సరంలోని రూ.1.84 లక్షల కోట్లతో పోలిస్తే ఈ సంవత్సరం 1.15 లక్షల కోట్ల రూపాయలకు తగ్గించివేయడం దారుణం. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ధాన్య సేకరణ కార్యకలాపాలనుంచి మొత్తంగా వైదొలగాలనే ఉద్దేశంతో ఉందా అని పలు సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు వ్యవసాయ గ్రూపులు ఈ అంశంపై తమ ఆందోళనను చాటి చెప్పాయి. దానికి తగినట్లుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే వ్యవసాయ మార్కెట్లను సరళీకరించడం గురించి మాట్లాడారు. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆహార సబ్సిడీలపై ఎన్డీఏ ప్రభుత్వం కోత విధించబోతోందన్న భయాందోళనలు వ్యవసాయదారుల్లో, రైతు సంఘాల్లో పెరిగిపోయాయి. దీనికి తగినట్లుగానే వ్యవసాయ మదుపులు, ధరల కమిషన్ (సీఏసీపీ) బహిరంగ మార్కెట్లో ధాన్య సేకరణ విధానాన్ని నిలిపివేయాలని సిఫార్సు చేసింది. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఇప్పటికే దేశ ధాన్యాగారాలుగా పేరొందిన పంజాబ్, హరియాణా రాష్ట్రాలు ధాన్య సేకరణను గణనీయంగా తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పంజాబ్ ఇప్పటికే ధాన్య సేకరణలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ చట్టాలను తదనుగుణంగా సవరించింది కూడా. అలాగే ప్రైవేట్ మండీలను కూడా ప్రారంభించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం కడుతోంది. ఆకాంక్షల భారత్‌లో భాగంగా దేశీయ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ వ్యవసాయం వైపుగా మార్చేందుకు రోడ్ మ్యాప్ అందించడం గురించి ఆర్థిక మంత్రి 16 సూత్రాల కార్యాచరణపై మాట్లాడారు. గతంలో ప్రతిపాదించిన త్రీ మోడల్ చట్టాలను అమలుపర్చిన రాష్ట్రాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఈ మూడు మోడల్ చట్టాలకు భూమి కౌలు చట్టం, మార్కెట్ సరళీకరణ, కాంట్రాక్టు వ్యవసాయంతో నేరుగా సంబంధం ఉందని గమనించాలి. వ్యవసాయరంగంలో పోటీ తత్వాన్ని పెంచాల్సిన అవసరముం దని ఆర్థిక మంత్రి చెబుతూ, 2025 నాటికి పాల ప్రాసెసింగ్‌ను రెట్టింపు చేసే పథకాలను కొన్నింటిని పేర్కొన్నారు. అలాగే 2025 నాటికి దేశీయ మత్స్య ఉత్పత్తిని 2 కోట్ల టన్నులకు పెంచడం, కమోడిటీ ట్రేడింగ్‌ని ప్రోత్సహించడానికి ఈ–నామ్‌తో వేర్‌హౌసింగ్ రిసిప్టులపై ఫైనాన్స్‌ని ప్రోత్సహించడం గురించి కూడా నిర్మల ప్రతిపాదనలుచేశారు. త్వరగా పాడైపోయే సరకులను రవాణా చేయడానికి కిసాన్ రెయిల్, కిసాన్ ఉడాన్‌ను ప్రారంభించడం వల్ల వ్యవసాయ వాణిజ్య కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. 16 సూత్రాల కార్యాచరణ పథకం గురించి ఆమె చెప్పిన అంశాలు మునుపటి బడ్జెట్లలో కూడా ప్రస్తావించారు, చర్చించారు కానీ ఈ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు జరిగినట్లు కనిపించడం లేదు. భవిష్యత్తులో వ్యవసాయరంగం పయనించాల్సిన దిశ కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించడం కచ్చితంగా సరైనదే కానీ ఈ మార్గాన్ని ఎంత సమర్థంగా రూపొందిస్తారు అనేది ముందుగా స్పష్టం కావాలి. ఇప్పటికే మన వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన చాలా సంస్కరణలు అమెరికా, యూరోపియన్ యూనియన్ల నుంచి అరువు తెచ్చుకున్నవే. అయితే ఇలా అరువు తెచ్చుకున్న విధానాలు ప్రభావవంతమైనవే అయినట్లయితే అమెరికా, ఈయూలో కూడా వ్యవసాయరంగం ఎందుకు దుస్థితికి గురవుతోందన్నది ఆలోచించాల్సిన విషయం.అమెరికాలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఆత్మహత్యలు ఆ దేశంలోని పట్టణ కేంద్రాల్లో జరుగుతున్న ఆత్మహత్యల కంటే 45 శాతం అధికంగా నమోదవుతున్నాయి. పైగా, 1960ల నుంచి అమెరికాలో నిజ వ్యవసాయ ఆదాయం పెరుగుదల క్రమంగా పతనమవుతూ వచ్చింది. అందుచేత పాశ్చాత్య నమూనాలను అనుకరించడం కంటే గ్రామీణ సౌభాగ్యాన్ని, సంపదను పెంచిపోషించేలా మన వ్యవసాయరంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
బడ్జెట్లో వ్యవసాయం వాటా ఎంత?
దేశంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి వ్యవసాయదారుల ఆత్మహత్యలు నమోదు కాని రోజంటూ లేదు. దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000ల ఆదాయం తప్పనిసరిగా అందించేలా రైతులు ఆదాయం – సంక్షేమం కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పర్చే విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకురావలసిన అత్యంత మౌలిక సంస్కరణ కోసం దేశం ఎదురుచూస్తోంది. వ్యవసాయ పంటల సాగు కాలంలో రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు, అవరోధాలను తొలగించడానికి వ్యవసాయాన్ని కూడా సులభతరంగా చేసే విధానాలను కేంద్రం అమలులోకి తీసుకురావలసిన అవసరం ఎంతగానో ఉంది. పంటలకు కనీస మద్దతు, రైతుకు కనీస ఆదాయ కల్పనలో మౌలిక సంస్కరణ తీసుకురావడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పెనుసవాల్ కానుంది. దేశ భూభాగంలో దాదాపు 50 శాతం వరకు ప్రస్తుతం తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల్లో చిక్కుకుపోవడం చూస్తున్నాం. గత వందేళ్లలో అయిదో అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదైన నెలగా ఈ జూన్ మాసం రికార్డుకెక్కింది. దానికితోడుగా గత ఏడు సంవత్సరాల్లో వ్యవసాయరంగ వాస్తవ రాబడుల్లో వృద్ధి దాదాపుగా జీరోకి సమీపంలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ జూలై 5న తన తొలి బడ్జెట్ సమర్పించనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కఠినతరమైన లక్ష్యాన్ని ఎదుర్కోబోతున్నారు. మరోవైపున వ్యవసాయదారుల ఆశలు, అంచనాలు తారస్థాయిలో ఉంటున్నాయి. దేశ వ్యవసాయ రంగంలో మౌలిక సంస్కరణలు తప్పనిసరి అనే విషయాన్ని ఎవరూ తోసిపుచ్చలేని వాస్తవమే కానీ కేంద్రంలోని నూతన ప్రభుత్వానికి అంతకుమించిన పెద్ద సవాలు ఏదంటే వ్యవసాయరంగంలో వాస్తవ రాబడులను పెంచడం ఎలా అన్నదే. ఎకనమిక్ సర్వే 2016 అంచనా ప్రకారం దేశంలోని 17 రాష్ట్రాల్లో వ్యవసాయరంగ ఆదాయం సగటున సంవత్సరానికి రూ. 20,000 మాత్రమే. ఓఈసీడీ– ఐసీఆర్ఐఈఆర్ నిర్వహించిన కీలకమైన అధ్యయనం ప్రకారం 2007–2017 మధ్యకాలంలో రైతులకు న్యాయమైన ధరలను తృణీకరించిన కారణంగా వారు నష్టపోయిన మొత్తం రూ. 45 లక్షల కోట్లుగా తేలింది. ఇది చాలదన్నట్లుగా, గత పదిహేను సంవత్సరాల్లో వ్యవసాయరంగ రాబడులు అత్యంత కనిష్టస్థాయికి పడిపోయినట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిఫలితంగా గ్రామీణ వ్యవసాయరంగంలో ఉపాధి కల్పన భారీ స్థాయిలో క్షీణించిపోయింది. ఇక వ్యవసాయేతర శ్రామికుల విషయం చెప్పనక్కరలేదు. భారీ దిగుబడులను పండించడానికి దేశీయ రైతాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ ప్రతి సంవత్సరం, వ్యవసాయదారుల పరిస్థితి మరింత దిగజారిపోతూ వస్తోంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని కనిష్టంగా ఉంచడం, పరిశ్రమకు ముడిసరుకును తక్కువ ధరలకు అందించడం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను నెరవేర్చాల్సి రావడం వంటి లక్ష్యాల సాధనకోసం తీసుకొచ్చిన సూక్ష్మ ఆర్థిక విధానాలకు మన వ్యవసాయరంగం నిజంగానే బలవుతోంది. వాణిజ్యరంగ నిబంధనలు తొలి నుంచీ వ్యవసాయరంగానికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. దీనికితోడుగా 2011–12, 2016–17 మధ్యకాలంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.4 శాతానికి పడిపోయాయి. వ్యవసాయరంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పడానికి ఇది చాలు. దేశంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి వ్యవసాయదారుల ఆత్మహత్యలు నమోదు కాని రోజంటూ లేదు. ఉదాహరణకు పంజాబ్‌ను తీసుకుందాం. 2018 సంవత్సరం జనవరిలో ప్రతిరైతుకూ 2 లక్షల రూపాయల రుణ మాఫీని ప్రకటించిన తర్వాత కూడా ఆ సంవత్సరం మొత్తంలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని భారతీయ కిసాన్ యూనియన్ అంచనా వేసింది. 2000–2017 మధ్యకాలంలో మూడు ప్రభుత్వ రంగ యూనివర్సిటీలు ఇల్లిల్లూ తిరిగి చేసిన సర్వే ప్రకారం 16,600 మంది రైతులు ఆత్మహత్యల బారిన పడినట్లు తేలింది. దేశంలోని అత్యంత కీలకమైన వ్యవసాయ రాష్ట్రంలోనే రైతుల దుస్థితి ఈ స్థాయిలో ఉండగా మిగతా దేశంలో వ్యవసాయ రంగం ఎంతగా కునారిల్లిపోతోందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అత్యంత లోపభూయిష్టమైన ఆర్థిక విధానాల రూపకల్పన కారణంగానే రైతులు బాధితులుగా మిగిలిపోతున్నారు. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించిన కారణంగానే దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని గ్లోబల్ అనలిటికల్ కంపెనీ క్రిసిల్ (íసీఆర్ఐఎస్ఐఎల్) తేల్చి చెప్పింది. వ్యవసాయ పంటలకు కనిష్ట మద్దతు ధర 2009–2013 మధ్య 19.3 శాతం మేరకు ఉండగా, తదుపరి నాలుగేళ్ల కాలంలో ఇది 3.6 శాతానికి క్షీణించిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా ఇస్తున్న డీఏ (డియర్నెస్ అలవెన్స్) స్థాయిలో కూడా రైతు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం లేదు. 1970లో స్కూల్ టీచర్లకు నెలకు రూ. 90ల వేతనం ఉండగా 2015 నాటికి వారి వేతనం 170 రెట్లకు పెరిగింది. అదే కాలంలో ప్రభుత్వోద్యోగుల వేతనం 150 రెట్లు పెరిగింది. దీనికి భిన్నంగా దేశీయ రైతులు పండించిన గోధుమ పంట ధర 19 రెట్లు మాత్రమే పెరిగింది. వ్యవసాయ రంగంలో మౌలిక సంస్కరణలు ఎంత అవసరమో దీన్ని బట్టే తెలుస్తోంది. 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎమ్– కిసాన్) ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా దేశంలో భూమి ఉన్న రైతులందరికీ సంవత్సరానికి రూ. 6,000ల ప్రత్యక్ష నగదు మద్దతును ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే నెలకు రూ.500లు అన్నమాట. వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి కేంద్రప్రభుత్వం నడుంకట్టినట్లు ఇది సూచిస్తోంది. పైగా దేశ చరిత్రలో రైతుకు తొలిసారిగా ప్రత్యక్ష నగదు సహాయం అందించడానికి కేంద్రప్రభుత్వం సంసిద్ధత చూపుతుండటానికి ఇది స్పష్టమైన సంకేతం కూడా. ఈ విశిష్ట పథకాన్ని ఇప్పుడు 14.5 కోట్లమంది భూమి ఉన్న రైతులకు విస్తరించారు. దీన్ని దేశంలోని 14.4 కోట్లమంది భూమిలేని రైతులకు కూడా విస్తరింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు గాను బడ్జెట్లో రూ. 87,000 కోట్లను కేటాయిస్తూ ప్రతిపాదన చేశారు కూడా. దీనికి 14.4 కోట్ల భూమిలేని రైతులను కూడా జతచేస్తే బడ్జెట్లో రైతులకు ప్రత్యక్ష నగదు సహాయ పథకం కోసం దాదాపు రూ.1.6 లక్షల కోట్లు కేటాయించినట్లు అవుతుంది. ఇంత పెద్ద మొత్తం కేటాయింపునకు అవసరమైన డబ్బు ఎక్కడనుంచి వస్తుంది అనేది ప్రశ్న. దీనికి ఒకటే సమాధానం. 2008–09 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నాటినుంచి పారిశ్రామిక రంగానికి మద్దతుగా అమలులోకి తీసుకువచ్చిన రూ. 1.86 కోట్ల వార్షిక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని తక్షణం రద్దు చేయడమే ఆర్థికమంత్రికి అందుబాటులో ఉన్న సులభమైన మార్గం. ఈ ప్యాకేజీకి ఎలాంటి ఆర్థిక సమర్థన ఇప్పుడు లేదు. గత పది సంవత్సరాలుగా ఈ ఉద్దీపన ప్యాకేజీని మన పారిశ్రామిక రంగానికి అందజేస్తూనే ఉన్నారు. 2018–19లో వ్యవసాయరంగానికి రూ.11.68 లక్షల కోట్ల రుణాన్ని విస్తరించారు. బడ్జెట్లో దీన్ని రూ.12 లక్షల కోట్లకు సవరించే అవకాశం కూడా ఉంది. అయితే అతిపెద్ద సవాలు ఏమిటంటే, వ్యవసాయ రుణం సన్నకారు, చిన్నకారు రైతుల వరకు చేరడం ఎలా అన్నదే. దేశంలో సంస్థాగత రుణాలకు 15 శాతం కంటే తక్కువ మంది చిన్నకారు రైతులే పొందగలుగుతున్నారని ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ తాజాగా అంచనా వేసింది. రైతుల ఆత్మహత్యలను రైతు రుణమాఫీలు అరికట్టలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టే సంస్థాగత రుణాల పరిధిలోకి మరింతమంది రైతులను తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటిగా ఉండాలి. పైగా, దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000ల ఆదాయం తప్పనిసరిగా అందించేలా రైతులు ఆదాయం –సంక్షేమం కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పర్చే విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకురావలసిన అత్యంత మౌలిక సంస్కరణ కోసం దేశం ఎదురుచూస్తోంది. దీనికోసం ప్రతి జిల్లాలోనూ రైతుల సగటు ఆదాయాన్ని పెంపొందించేందుకు తగిన మార్గాన్ని ఏర్పర్చవలసి ఉంది. దీనికి అవసరమైన డేటా కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటోంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎమ్‌సీ) క్రమబద్ధీకరణ మార్కెట్ల యంత్రాంగాన్ని విస్తరించడం తక్షణ కర్తవ్యంగా ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకు ప్రస్తుతం ఉన్న 7,000 మండీలను 42,000కు పెంచడానికి ప్ర«థమ ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ధాన్యాగారాలను, గోడౌన్లను ఏర్పర్చడంపై బడ్జెట్ విధివిధానాలను రూపొందించాలి. వచ్చే అయిదేళ్ల కాలానికి గానూ దేశీయ వ్యవసాయ రంగంలో 25 లక్షల కోట్ల రూపాయలను అందిస్తామని భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఉన్న విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసం ప్రారంభ దిశగా ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మండీలు, గోడౌన్ల ఏర్పాటు కోసం కనీసం రూ. 5 లక్షల కోట్లను మదుపు చేయాల్సి ఉంది. అయితే దీనికంటే మిన్నగా, రైతులు ప్రభుత్వ పాలనకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలకోసం సులభతరమైన వాణిజ్యవిధానాన్ని ప్రోత్సహించినట్లుగానే, వ్యపసాయ పంటల సాగు కాలంలో రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు, అవరోధాలను తొలగించడానికి వ్యవసాయాన్ని కూడా సులభతరంగా చేసే విధానాలను కేంద్రం అమలులోకి తీసుకురావలసిన అవసరం ఎంతగానో ఉంది. గతంలో వాణిజ్యమంత్రిగా సులభతరమైన వాణిజ్య విధానంకోసం దాదాపు 7,000 చర్యలను తీసుకున్న అనుభవం ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి ఉంది కాబట్టి వ్యవసాయ రంగానికి కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేయడం ఆమెకు సులభమైన పనే. అయితే వ్యవసాయరంగంలో సులభతర విధానం అమలుకోసం కనీసం 5,000 చర్యలను అందించే యంత్రాంగం స్థాపనకోసం ఆమె ఇంకా ఎందుకు నడుం కట్టలేదన్నదే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్‌శర్మ ఈ–మెయిల్ : hunger55@gmail.com -
మద్దతుధరకు చట్టబద్ధత ఇవ్వాలి
విశ్లేషణ ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. దీనితో పాటు త్వరగా పాడయ్యే టొమేటో, బంగాళదుంప, ఉల్లి, ఇతర కూరగాయల పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించే విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో వ్యవసాయదారుల కమిషన్లు ఏర్పడినాయి. కానీ అవి ఆశ్రితులకు పునరావాసం కల్పించేందుకే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి తక్షణం చేయవలసిన పని ఏమిటంటే, ఈ కమిషన్లను రాష్ట్ర వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్లుగా మార్పు చేయాలి. రైతులకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దుర్గ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో గడచిన రెండువారాలలో కొన్ని విషాదకర దృశ్యాలు వరసగా దర్శనమిచ్చాయి. ఆ పక్షం రోజుల పాటు కూడా ఆయా ప్రాంతాల రైతులు వారు పండిం చిన టొమేటోలను రోడ్ల మీదకు తెచ్చి పారబోయడం కనిపించింది. ఆ జిల్లాలోనే ఉంది పర్సూలీ అనే గ్రామం. ఆ ఒక్క గ్రామంలోనే కనీసం 100 క్వింటాళ్ల టొమేటో పంటకు ఇదే గతి పట్టిందని అంచనా. అక్కడి రైతాంగం ఆ పంటను తమ పశువుల చేత అవి తిన్నంత తినిపించింది. ఇంకొంత పొలాలలోనే వదిలి, కుళ్లిపోయేటట్టు చేసింది. మొన్న జనవరి మొదటి వారం వరకు కొద్దిగా మెరుగ్గానే ఉన్నా, తరువాత టొమేటోల చిల్లర ధర పడిపోతూ వచ్చింది. ఉత్తర భారతంలోని ఆ రాష్ట్రంలోనే కాదు, దక్షిణాదిన తమిళనాడులో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిం చాయి. ఈ రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా రైతాంగాన్ని మార్కెట్ పరిస్థితులు తీవ్రంగా కలత పెడుతున్నాయి. అక్కడ క్యాబేజీ చిల్లర ధర దారుణంగా పడిపోయింది. గడచిన సంవత్సరం క్యాబేజీ కిలో ఒక్కంటికి రూ.12 ధర పలికినప్పటికీ, రైతులకు దక్కినది సగటున కిలోకు కేవలం ఒక్క రూపాయి. పడిపోతున్న టొమేటో ధర ఛత్తీస్‌గఢ్‌లో కూడా రైతుల జీవితాలను కకావికలు చేస్తోంది. కిలో ఒక్కంటికి రూ. 1, లేకపోతే, రూ. 2లకు మించి దక్కని పరిస్థితులలో చాలామంది రైతులు పంటను కోసే పని కూడా పెట్టుకోకుండా పొలం మీదే వదిలి పెడుతున్నారు. అంటే మార్కెట్ నుంచి దక్కుతున్న ఆ పరిమిత రాబ yì పంట వ్యయానికే కాదు, కోత కోయడానికి కూడా గిట్టుబాటు కావడం లేదు. అధిక దిగుబడితోనూ కష్టాలేనా? నిజానికి ఇలాంటి పరిస్థితి ఎందుకంటే– అధిక దిగుబడి. అది టొమేటో కావచ్చు, బంగాళదుంప, క్యాబేజీ, ఉల్లి, మరేదైనా పంట కావచ్చు. అవన్నీ అధికంగానే పండుతున్నాయి. కానీ పలుకుతున్న ధర మాత్రం చాలా తక్కువ. అధిక దిగుబడి మళ్లీ మధ్య దళారీలకే లాభం చేకూరుస్తున్నది. దళారులంతా ముఠాలు కట్టేసి, తరుచూ దోపిడీ అనదగిన స్థాయిలో ధరలను నియంత్రిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దాపురించడానికి కారణం అధిక దిగుబడేనని ఈరోడ్ జిల్లాకు చెందిన రైతు టి. రాజాగణేశ్ కూడా అంగీకరించారు. ‘ఒక ఎకరం పొలంలో ఒక నెలపాటు క్యాబేజీ సాగుకు రైతు చేసే వ్యయం రూ. 45,000. దీనికి కూలీల ఖర్చును కలపవలసి ఉంటుంది. ఇంకా నిర్వహణ, ఎరువుల ఖర్చును కూడా జత చేయాలి. ఇవన్నీ కలుపుకుంటే నెలకి అయ్యే ఖర్చు దాదాపు రూ. 50,000. ఇక క్యాబేజీ పంట చేతికి అందాలంటే మూడు మాసాలు పడుతుంది. అంటే ఒక ఎకరం భూమిలో క్యాబేజీ సాగు చేయాలంటే చేయవలసిన వ్యయం కనీసం రూ. 1.5 లక్షలు. అలాంటప్పుడు కిలో ఒక్కంటికి రైతుకు ఒక్క రూపాయి వస్తే మాకు లాభం వచ్చిందని ఎలా అనుకోగలం?’అని ప్రశ్నించారు రాజాగణేశ్. టొమేటో సాగు కూడా ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండడం లేదు. చిన్న రైతు విషయమే తీసుకోండి. ఒక ఎకరం పొలంలో ఆ పంటను పండించాలంటే వారి కయ్యే వ్యయం రూ. 90,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉంటుంది. అదే పెద్ద రైతులు టొమేటో పండిస్తే ఇంకొంచెం ఎక్కువగా, అంటే ఎకరానికి రూ. 1.25 లక్షల వరకు సాగు వ్యయం అవుతుంది. దుర్గ్ జిల్లాలో టొమేటో రైతులను కలుసుకోవడానికి నేను జనవరిలో పర్యటించాను. అప్పుడు ధరలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయి. 25 కిలోల ఒక పెట్టె రూ. 1,000 ధర పలికిన సమయమది. అయితే కర్ణాటక నుంచి టొమేటోలు మార్కెట్లో ప్రవేశించడంతో సరుకు పెరిగిపోయింది. ధరలు పడిపోయాయి. ఇప్పుడు శనగ పంట విషయం తీసుకుందాం. కొత్త పంట మార్కెట్లోకి రావడం మొదలైంది. వీటి కనీస మద్దతు ధర రూ. 4,400. కానీ మార్కెట్లో రైతుకు లభిస్తున్న ధర రూ. 3,600. అంటే క్వింటాల్‌కు 20 శాతం తక్కువగా వారికి దక్కుతోంది. ఇది చిల్లర ధర. పైగా ఈ సంవత్సరం 8 శాతం అధికంగా సాగు జరి గింది. కాబట్టి కోటి లక్షల టన్నుల అధిక దిగుబడి ఉంటుందని (గడచిన సంవత్సరం దిగుబడి దాదాపు 93 లక్షల టన్నులు) అంచనా. కాబట్టి పంట మార్కెట్‌కు చేరే కొద్దీ ధర మరింతగా పతనమయ్యే అవకాశాలే ఎక్కువ. గోధుమ ధరలు కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువగానే రైతుకు దక్కుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఆ పంటకు కనీస మద్దతు ధర కంటే 6నుంచి 8 శాతం తక్కువగానే రైతులకు దక్కుతోంది. అక్కడ కూడా పంట మార్కెట్లకు రవాణా కావడం మొదలైంది. కనీస మద్దతు ధర మిథ్యేనా? కందిపప్పు ధర కూడా అంతే. మొన్న ఫిబ్రవరి ఆఖరి వారానికి కందిపప్పు మార్కెట్ ధర క్వింటాల్‌కు రూ. 4,500. కానీ, తెలంగాణలోని తాండూర్‌లో సేకరణ ధర మాత్రం రూ. 5,500. ఈ నెల మొదటి వారంలో గుజ రాత్, మధ్యప్రదేశ్‌లలో కొనసాగిన ఆవాలు, ఇతర పప్పుధాన్యాల ధరలను పరిశీలించినా ఇదే అవగతమవుతుంది. వాటి మార్కెట్ ధర ప్రకటించిన మద్దతు ధర కంటే చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలా ఉండగానే, ఛత్తీస్‌గఢ్‌లో మరో దఫా రైతులు తమ టొమేటో పంటను రోడ్ల మీదకు తెచ్చి పడేశారన్న వార్తలు వచ్చాయి. టొమేటోల ధర కిలో ఒక్కంటికి రూ.1కి పతనం కావడమనే విష పరిణామం వరుసగా మూడేళ్లు కొనసాగినట్టవుతుంది. ఇది టొమేటోలకే పరిమితమైన విష పరిణామం కూడా కాదు. నిజానికి వ్యవసాయోత్పత్తుల ధరలు దేశవ్యాప్తంగా పతనం కావడమనే ఆ పరి ణామం వరసగా మూడేళ్ల నుంచి జరుగుతోందన్న వాస్తవం గమనించాలి. 2014, 2015 వరుసగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొని రైతులను వేధించాయి. తరువాత 2016, 2017, 2018 సంవత్సరాలు పంట దిగుబడికి సానుకూలంగా ఉన్నాయి. ఈ అధిక దిగుబడి ప్రభుత్వానికి ఎంతో మోదాన్ని తెచ్చి పెట్టింది. కానీ పడిపోయిన ధరలు మాత్రం రైతును దుఃఖసాగరంలోకి నెట్టివేశాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఇలాంటి పరిస్థితులలో కర్ణాటక వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ టి. ఎన్. ప్రకాశ్ చేసిన సూచన సముచితంగా ఉంటుందని నా అభిప్రాయం. ఆయన సూచన సరైన సమయంలో వచ్చినదే కూడా. పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయడం చట్ట ప్రకారం అమలు చేసే విధంగా రూపొందాలని ఆయన చెప్పారు. మైసూరులో డాక్టర్ ప్రకాశ్ ఇచ్చిన ఒక స్మారకోపన్యాసంలో ఈ సూచన చేశారు. ‘గరిష్ట చిల్లర ధరను మించి ఉత్పత్తులను విక్రయిస్తే దాని నుంచి వినియోగదారునికి చట్టబద్ధమైన రక్షణ ఉంది. అలా జరిగిన పక్షంలో వినియోగదారులు న్యాయస్థానాలకు వెళ్లవచ్చు. కానీ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా, రైతుకు మాత్రం అలాంటి చట్టబద్ధమైన రక్షణ లేదు’అని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయోత్పత్తుల ధరలు పతనం కావడమనే పరిణామం మూడేళ్లుగా వరుసగా జరుగుతోంది. మూడో సంవత్సరంలో కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో చూస్తే అన్ని వ్యవసాయోత్పత్తులు వాటికి ప్రకటించిన కనీస మద్దతు ధరల కంటే 20 నుంచి 45 శాతం తక్కువ ధరలకే నోచుకుంటున్నాయి. కర్ణాటకలో ఐక్య మార్కెట్ వేదికను ఏర్పాటు చేశారు. దీనితో దేశంలో 585 ఈ నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చ రల్ మార్కెట్) శాఖలు విస్తరించాయి కూడా. అయినా రైతులకు ఒనగూడిన ప్రయోజనం ఏమీలేదు. నమూనా ధరల నిర్ణయం కూడా రైతుకు ఏమీ చేయలేదు. రోజు వారీ ట్రేడింగ్‌ను బట్టి ఈ ధరను నిర్ణయిస్తారు. ఇది వాస్తవంలో నిస్పృహను మిగిల్చింది. ఈ విధానానికి స్వస్తి పలకడం అవసరం. ఈ నామ్ల ఉద్దేశం కూడా జాతీయ స్థాయిలో స్పాట్ ట్రేడింగ్‌కు లాభం చేకూర్చడమే. రాష్ట్రాలలో వ్యవసాయోత్పత్తుల కమిషన్లు నాది కూడా ఒక సూచన ఉంది. ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. దీనితో పాటు త్వరగా పాడయ్యే టొమేటో, బంగాళదుంప, ఉల్లి, ఇతర కూరగాయల పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించే విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో వ్యవసాయదారుల కమిషన్లు ఏర్పడినాయి. కానీ అవి ఆశ్రితులకు పునరావాసం కల్పిం చేందుకే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి తక్షణం చేయవలసిన పని ఏమిటంటే, ఈ కమిషన్లను రాష్ట్ర వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్లుగా మార్పు చేయాలి. రైతులకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలి. అంటే కర్ణాటకలో ఏర్పాటు చేసిన కమిషన్ మాదిరిగా అన్నమాట. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు మించి కర్ణాటక 14 పంటలను సేకరిస్తూ ఉంటే, రాజకీయాలకు అతీతంగా ఇలాంటి పంథాను అనుసరించడానికి మిగిలిన రాష్ట్రాలకు ఎదురయ్యే చిక్కులేమిటో అర్థం కాదు. - దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
పల్లెతో తెగిపోతున్న బంధం
విశ్లేషణ పట్టణ ప్రాంతాల వైఖరిని చూస్తే ఒక్కోసారి నాకు ఎంతో చీదర ఎత్తుతుంది. రైతు ఆత్మహత్యల పరంపర గురించి ట్వీట్ చేస్తే.. వాళ్లు ఎలాగూ చనిపోయేవారే, వాళ్లు దేశానికి భారం అని కొందరు రాస్తే, రైతులు దేశం రక్తాన్ని పీల్చేస్తున్న పరాన్నభుక్కులు అని మరికొందరు రాస్తుంటారు. వారిలో చాలా మందికి రైతులంటే ప్రభుత్వం వేసే బిచ్చంపై ఆధారపడి బతుకుతున్నవారు. ఇక రైతుల గురించి మాట్లాడటం కట్టిపెట్టి, పైకి ఎదుగుతున్న పట్టణ జనాభా గురించి రాయమని నాకు హితవు చెప్పేంతగా గ్రామానికీ, పట్టణానికి మధ్య అనుబంధం విచ్ఛిన్నమైంది. మనం నివసిస్తున్నది ఇండియా, భారత్ అనే రెండు భాగాలుగా చీలి పోయిన దేశంలోనని అందరికీ తెలి సిందే. ఇండియా నివసించేది ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఆకాశహర్మ్యాలు, విలాసవంతమైన కార్లు, ఇంకా ఏదంటే అదీ ఉండే మహా నగరాలలో. కాగా, భారత్ నివసించేది మట్టి రోడ్లు, ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లు, కోట్లాది మంది నిస్సహాయులైన పేదలు... వారిలో చాలా వరకు రైతులు ఉండే 6.40 లక్షల గ్రామాల్లో. నిజమేగానీ, ఇండియా, భారత్‌ల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడు తున్నావు? అని మీరు అడగొచ్చు. ఇండియా, భారత్‌ల మధ్య ఉన్న అగాధాల్లాంటి అంత రాల గురించి మనకు ఎలాగూ తెలుసు. దేశంలోని పట్టణ, గ్రామీణ భారతాల మధ్య ఉండే అనుబంధం విచ్ఛిన్నం అయిందని భావిస్తుండటమే నేను ఈ విష యాన్ని ప్రస్తావించడానికి కారణం. పైగా ఆ అనుబంధం తెగిపోవడం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. నగరాలలో నివసించే ప్రజలు గ్రామీణ ప్రాంత పరిస్థితులకు బాగా దూరమై పోయారు. వారికి గ్రామీణ జీవితం గురించి సూచనప్రాయంగా కూడా తెలియ కుండా పోయింది. గ్రామీణ భారతం అంటే వాళ్లు అదేదో వేరే దేశంగా, ఏ ఆఫ్రికాలోనో లేదా మరే సుదూర ప్రాంతంలోనో ఉన్నదిగా భావిస్తున్నారు. బాలీవుడ్ సిని మాలు సైతం గ్రామీణ భారతం గురించి మాట్లా డటం మానేశాయి. కొరవడుతున్న సహానుభూతి పట్టణ ప్రాంతాల వైఖరిని చూస్తే ఒక్కోసారి నాకు ఎంతో చీదర ఎత్తుతుంది. రైతు ఆత్మహత్యల పరంపర గురించి నేను ఏదైనా ట్వీట్ చేసిన వెంటనే నాకు వచ్చే సమాధా నాలను చూస్తే నోట మాట రాదు. వాళ్లు ఎలాగూ చని పోయేవారే, ఈ దేశానికి వాళ్లు భారం అని కొందరు రాస్తుంటారు. రైతులు దేశం రక్తాన్ని పీల్చేస్తున్న పరాన్న భుక్కులు అంటారు మరికొందరు. చాలామందికి రైతు లంటే ప్రభుత్వం వేసే బిచ్చంపై ఆధారపడి బతుకుతు న్నవారు. వ్యాపార నిపుణులు కావడానికి వీలుగా పట్ట భద్రులు కానందుకు వారీ మూల్యాన్ని చెల్లించడం అవ సరమే అంటారు. రైతుల గురించి నేను సోషల్ మీడియాలో రాసే వాటికి ప్రతిస్పందించే వారు.. నువ్వు ఇక రైతుల గురించి మాట్లాడటం కట్టిపెట్టి, పైకి ఎదుగుతున్న పట్టణ జనాభా గురించి రాయమని చెప్పేంత ఘోరంగా గ్రామానికీ, పట్టణానికీ మధ్య అనుబంధం విచ్ఛిన్నమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల రైతాంగం ఎంత నష్టపోయిందనో లేక మధ్య, దక్షిణ భారతంలో వ్యాపించిన కరుపు పరి స్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయనో నేను మాట్లాడే టప్పుడు వారిలో విచారమైనా కలుగదు. వ్యవసాయ ఉత్పత్తుల «ధరలు అసాధారణంగా çకుప్ప కూలడంతో రైతులు టమాటాలను రోడ్ల మీద పోసి పోవడం, ఆ కార ణంగా కొందరు రైతులు గుండెపోటుతో మరణించడం లేదా ధరలు అలా కుప్ప కూలడాన్ని తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకోవడం గురించి నేను రాస్తుంటాను. అలాంటప్పుడు, ఇది గ్రామీణ భారతంలో సర్వసాధార ణమైన సంగతే కదా, దాని గురించి ఆందోళన చెంద వద్దని నాకు చెబుతుంటారు. రైతుకు చోటే లేని విద్యాబోధ ఈ చెత్త వాగుడంతా వింటున్నప్పుడు నేను పట్టణ ఇండియాకు, రైతులకు మధ్య ఇంత లోతైన చీలిక ఎలా వచ్చిందా? అని ఆందోళన చెందుతుంటాను. రైతు నాయకులు ఈ చీలికను ఇంత లోతుగా ఎలా విస్తరించని చ్చారు? పట్టణ జనాభా, గ్రామీణ పల్లెసీమలతో అను బంధం కలిగి ఉండేలా వారు ఏవిధమైన ప్రయత్నమూ ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్నలకు నా వద్ద సమాధా నాలు లేవు. కానీ, పట్టణ సమాజానికి చేరువ కాకపోవ డంలో ఏదో ఒక మేరకు రైతాంగం తప్పు కూడా లేదా? అని నాకు బలంగా అనిపిస్తోంది. రైతులు ఎప్పుడూ తమ పోరాటాలను తమ రైతాంగ ప్రజానీకానికి మాత్రమే పరి మితం చేసుకుంటున్నారు ఎందుకు? సమాజంలోని ఇతర విభాగాలకు చేరువయ్యే కృషి ఎందుకు జరగలేదు? పాఠశాలలు, కళాశాలలనే ఉదాహరణగా తీసు కోండి. అవి విద్యార్థులకు అందించే విద్యలో ఎక్కడా రైతు కనిపించనే కనిపించడు. పాఠ్య పుస్తకాలలో మహ త్తరమైనదిగా, గొప్పగా రాసి ఉన్నది తప్ప మరేదీ గొప్పది కాదని మాత్రమే విద్యార్థులకు తెలుసు. విద్యా ర్థులకు, రైతులకు మధ్య ముఖాముఖి సంభాషణలను నిర్వహించే దృశ్యాలు అతి అరుదుగా మాత్రమే కనిపి స్తుంటాయి, ఎందుకు? విద్యాలయాల వార్షికోత్సవా లలో లేదా వేరే వివిధ సందర్భాలలో ప్రదర్శితమయ్యే విద్యేతర కార్యక్రమాల్లో రైతులకు, విద్యార్థులకు మధ్య చర్చలు జరగడం చాలా అరుదుగానే కనిపిస్తుంది ఎందు వల్ల? మనం యువజనోత్సవాలను నిర్వహించేటప్పుడు సైతం.. అవి పట్టణ యువతకు సంబంధించినవయ్యే అవకాశాలే ఉంటాయి. గ్రామీణ యువత ఎక్కడా వేదిక మీద కనిపించనే కనిపించదు. భారత్ అసలు అస్తిత్వం లోనే లేదన్నట్టుగా, అవన్నీ పూర్తిగా పట్టణ భారతం గురించినవే. పల్లెతో సంబంధమే లేని విధానకర్తలు ఇటీవల నేను ఢిల్లీలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో మాట్లాడాను. ఆ సందర్భంగా నేను వారిలో చాలా మందిని ఎప్పుడైనా ఏ గ్రామానికైనా వెళ్లారా? అని అడగటం ప్రారంభించాను. 60 మందికి పైగా ఉన్న తరగతిలో కేవలం నలుగురు మాత్రమే చేతులు పైకి ఎత్తారు. వారిలో ముగ్గురు ఏదో పెళ్లికి వెళుతూ లేదా తమ తల్లి, తన తల్లిదండ్రులను చూడటానికి వెళు తుం డగా ఆమెకు తోడుగా వెళ్తూ ఏదో ఒక గ్రామం గుండా లేదా తాలూకా ప్రధాన కేంద్రం గుండా ప్రయాణించిన వారే. నోయిడా నుంచి 40 కిలో మీటర్ల దూరం పోతే చాలు, ఓ గ్రామం వస్తుందని చెబితే వారు అక్కడికి వెళ్లాలనే ఉత్సుకతను కనబరచలేదు. ఈ యువతకు, జీవితం అంటే పట్టణ కేంద్రాలకు పరిమితమైనదే. వారు ఉన్న, ఉండాల్సిన స్థలం అది మాత్రమే. ఏదో ఒక రోజు ప్రభుత్వ యంత్రాంగంలో లేదా బహుళజాతి కంపెనీల్లో లేదా మరేదైనా నిర్ణయాలను తీసుకునే సంస్థల్లో చేరేది ఈ యువతే. దేశ జనాభాలో 70 శాతం నివసించే గ్రామీణ భారతం ఎలా ఉంటుందో కూడా వారికి తెలియదు లేదా అతి కొద్దిగా మాత్రమే తెలుసు. వారిని తప్పు పట్టడం ఎందుకు? రోజు విడిచి రోజు టీవీ చర్చల్లో దర్శనమిచ్చే లేదా ఇంగ్లిష్ దినపత్రి కల్లో క్రమం తప్పకుండా కాలమ్‌లను రాసే సుప్రసిద్ధ ఆర్థికశాస్త్రవేత్తలు సహా ప్రస్తుతం విధాన నిర్ణయ కర్తలుగా ఉన్న వారిలో చాలా మందికి గ్రామాలతో ఉన్న ప్రత్యక్ష సంబంధం అతి స్వల్పం. నేడు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యులుగా ఉన్న ఒక ఆర్థికశాస్త్రవేత్త ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన ఒక వ్యాసాన్ని చూసి నేను దిగ్భ్రాంతి చెందాను. వ్యవసాయం గురించి ఆయన కచ్చితమైనదంటూ చేసిన వాదనకు సమర్థన ఆయన భార్య పుట్టగొడుగులను పండించే పార్ట్టైంరైతు కావడం మాత్రమే. ఆమె సరదాగా తీరుబడి సమ యాల్లో పుట్టగొడుగులను పెంచే ఉన్నత వర్గ మహిళ. రాజకీయం రంగుటద్దాలతో... ఇక్కడితో ఇది ముగిసిపోలేదు. వ్యవసాయ సంక్షోభం గురించి, రైతు ఆత్మహత్యల పరంపర గురించి నేను మాట్లాడినప్పుడల్లా.. కాంగ్రెస్ హయాంలో ఆత్మ హ త్యలు జరగలేదా? వానలు కురవకపోవడానికి నరేంద్ర మోదీ కారణమా? అంటూ హేళన చేసే వ్యాఖ్యలు ఎదురవుతుంటాయి. బహిరంగ చర్చ ఇంతగా రెండు ధ్రువాలుగా చీలిపోవడంతో వరదలు, క్షామం సహా ప్రతిదాన్ని ఎన్నికల పరమైన మొగ్గుదల దృష్టి కోణం నుంచి చూస్తున్నారు. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ సైతం ఒక మతంగా మారి పోయింది. దాన్ని విశ్వసించేవారు జాతీయం చేసిన బ్యాంకులకు కార్పొరేట్ సంస్థలు రుణాలను ఎగ్గొట్ట డాన్ని సైతం సమర్థించటానికి సుముఖంగా ఉంటు న్నారు. ప్రధాని ఆర్థిక సలహాదారు కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం ఆర్థిక వృద్ధి అనీ, రైతుల రుణమాఫీ మాత్రం పరపతి పరమైన క్రమశిక్షణారాహిత్యానికి దారి తీస్తుందని, దేశ బడ్జెట్‌ను తలకిందులు చేస్తుందని చెప్పారు. ఏటా వందల కోట్లలో ఉంటున్న బ్యాంకుల మొండి బకాయిలను మాత్రమే కాదు, ఎన్ని వాస్తవాలను వారి ముందుంచినా... వారు మీ మీద ఏకంగా కమ్యూ నిస్టు అని కాకున్నా, సోషలిస్టు అని ముద్ర వేయడానికి ప్రయత్నించే అవకాశాలే ఎక్కువ. తెలివిగా ముద్రలు వేసే పనిని చేసేది ఇలాగే. ఇదేమైనా పట్టణానికీ, పల్లెకూ మధ్య ఉన్న ఆ అగాధాన్ని పూడుస్తుందా? - దేవేందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
మన ఆర్థికవేత్తల హ్రస్వదృష్టి
విశ్లేషణ మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలకు క్షేత్రస్థాయి వాస్తవాలను చూపించడం అవసరం. అప్పుడే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వారికి అర్థం అవుతుంది. లేకపోతే ఆర్థిక సర్వేలాంటి చచ్చు విధాన పత్రాలనే రూపొందిస్తుంటారు. ఆర్థిక సర్వేను రూపొందించే ఆర్థికవేత్తల బృందం కనీసం ఏడాదికి మూడు నెలలు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో గడిపేలా చేయాలి. వారికి గ్రామీణ నాడి తెలియడం అవసరం. లేకపోతే, దేశాన్ని పీడిస్తున్న తీవ్ర వ్యవసాయ సంక్షోభం మరింతగా విషమిస్తుంది. దాదాపు నాలుగేళ్లుగా వార్షిక ఆర్థిక సర్వేలను శ్రద్ధగా అధ్యయనం చేస్తున్న పాఠకుణ్ణి నేను. సాధారణంగా కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు విడుదలయ్యే ఆర్థిక నివేదిక ఒక పెద్ద ఉద్గ్రంథం లాంటి పత్రం. ఆ ఏడాది కాలంలో ఆర్థిక వ్యవస్థ తీరు ఎలా సాగిందనే దానిపై అది తగినంత మంచి అం^è నానే ఇస్తుంది. హ్రస్వదృష్టికి అద్దం ఆర్థిక సర్వే అదే సమయంలో అది, వరుసగా వస్తున్న మన ప్రభుత్వాల ఆర్థిక చింతన ఎంత హ్రస్వదృష్టితో ఉంటున్నదో కూడా చెబుతుంది. ఆర్థిక సర్వేను మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, దాన్ని రాసిన ఆర్థికవేత్తలు ప్రపంచ బ్యాంకు/ఐఎంఎఫ్, క్రెడిట్ రేటింగ్ సంస్థలు సూచిస్తున్న ఆర్థిక చింతనను గుడ్డిగా అనుసరించారని గుర్తించగలుగుతారు. కనీసం కొన్ని ఆర్థిక సర్వేలనైనా చది వితే మీకు మన ఆర్థిక శాస్త్రవేత్తలు ఆ మూస పద్ధతికి భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచించ సాహసించ లేకపోతున్నారని అత్యంత స్పష్టంగా తెలుస్తుంది. ఏళ్ల తరబడి విఫలమౌతున్న అవే పాత సలహాలను, సూచనలనే వారు మళ్లీ ఇస్తుంటారు. గుర్రాలు మేతపైనే దృష్టిని నిలిపేలా చేయడానికి వాటి కళ్లకు గంతలు కట్టినట్టుగానే, తాము కూడా తెలిసిగానీ లేక తెలియకగానీ మానసికమైన గంతలను కట్టుకున్నామని మన ప్రధాన స్రవంతి ఆర్థికశాస్త్రవేత్తలు గుర్తించడం లేదు. వాళ్లు ఆ గంతల్లోంచి కనిపించే కొద్ది దూరానికి మించి చూడలేరు. బహుశా వారు ఆ పాత మూసపద్ధతికి మించి చూడాలని ఆశిం చడం కూడా లేదేమో. గుర్రాల కళ్లకు కట్టే గంతలు ప్రకృతి నిజంగా అవి వేటిని చూడాలని నిర్దేశించిందో వాటిని చూడనీయకుండా చేస్తాయని మరచిపోకండి. మన ఆర్థికవేత్తలు అంతకంటే మెరుగేమీ కారు. సంక్షోభానికి మూలం తప్పుడు ఆర్థిక చింతనే మీ కోసం గిరిగీసి ఉంచిన పరిధికి మించి చూడలేకపోయినప్పుడు మీరు తప్పులను, తరచుగా తీవ్రమైన తప్పులను చేయడమే చివరికి జరుగుతుంది. జనాభాలో 52 శాతానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనోపాధిని కల్పించే వ్యవసాయరంగాన్నే ఉదాహరణగా తీసుకోండి. గత పదేళ్లుగా ఆర్థిక సర్వేలు వ్యవసాయరంగం గురించి ఏం చెబుతున్నాయో నేను జాగ్రత్తగా అధ్యయనం చేశాను. ఫలితంగా, నేడు దేశం ఎదుర్కొంటున్న ఘోరమైన వ్యవసాయ సంక్షోభానికి మూల కారణం వాస్తవంగా మన తప్పుడు ఆర్థిక చింతనలోనే ఉన్నదని పూర్తిగా నమ్మకం కలిగింది. ఈ తప్పుడు ఆర్థిక చింతనంతా ఆర్థిక సర్వేలలో బయటపడుతుంటుంది. తాము సూచిస్తూ వచ్చిన ఆర్థికపరమైన సలహాలు, సూచనలే ప్రధానంగా వ్యవసాయ సంక్షోభానికి దారితీశాయని అంగీకరించాలని సైతం ఆర్థిక సర్వేలను రాసేవారికి పట్టకపోవడమే విషాదం. ఒక్కొక్క ఏడూ గడిచే కొద్దీ, ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి మద్దతుగా విఫలమైన అవే సూచనలను చేయడం కొనసాగుతుంది: పంటల ఉత్పాదకతను పెంచడం, నీటి పారుదల సదుపాయాలను విస్తరించడం, ప్రమాదాలను తగ్గించడం, గిట్టుబాటు ధరలను కల్పించడం, మార్కెట్లను ప్రైవేటీకరించడం. వ్యవసాయం రంగ వృద్ధి కోసం కనీసం గత పదేళ్లుగా ఆర్థిక సర్వేలు అవే సూచనలను చేస్తున్నాయి. కాబట్టి వ్యవసాయ సంక్షోభం ఒకొక్క ఏడూ గడిచేకొద్దీ మరింత లోతుగా విస్తరిస్తుండటంలో ఆశ్చర్యమేం లేదు. పెచ్చుపెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు సైతం, తమ భావజాలపరమైన సూచనలకు మించి ఆలోచించేలా ఆర్థికవేత్తలకు ప్రేరణను కలిగించలేక పోయాయి. గత 22 ఏళ్లలో కనీసం 3.30 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అంచనా. అయినాగానీ ఆర్థికశాస్త్రవేత్తలు కొంత అర్థవంతమైన సూచనలతో ముందుకు రావడానికి సాహసించలేకపోయారనేది వాస్తవం. ఇది మన విధాన చట్రంపైన విషాదకరమైన నీడలు ముసురుకునేలా చేస్తోంది. విత్తన కంపెనీల కోసం జీఎం పంటల రాగం ఇది సరిపోదన్నట్టు, గతంలో దాదాపుగా తాము సూచించనవేవీ పనిచేయలేదని తెలిసి కూడా ఆర్థిక సర్వే 2017 వివాదాస్పదమైన జన్యు మార్పిడి (జీఎం) పంటలపైకి తన దృష్టి కేంద్రీకరణను మరల్చింది. పంటల ఉత్పాదకత పెరిగినప్పుడు మాత్రమే వ్యవసాయరంగంలోని దైన్యం తగ్గుతుంది అంటూ.. అదే తప్పుడు వాదనతో ఆర్థిక సర్వే జీఎం పంటలే శరణ్యమని వాటికి సమంజసత్వాన్ని కల్పించాలని ప్రయత్నించింది. వాణిజ్యపరంగా ప్రవేశపెట్టడానికి వేచిచూస్తున్న జన్యుమార్పిడి ఆవపంటకు మాత్రమే కాదు, అన్ని రకాల జీఎం పంటలకు మనం తలుపులు బార్లా తెరవాలని సైతం నిజానికి అది సూచించింది. జీఎం పంటలను ప్రవేశపెట్టడానికి తగిన పరిస్థితులను కల్పించడానికి వీలుగా ఆర్థికసర్వే, ఇన్నేళ్లుగా జన్యు మార్పిడి విత్తన పరిశ్రమ చెబుతూ వస్తున్న అదే వాదనతో అందుకు సమంజసత్వాన్ని కల్పించాలని చూసింది. అంతకు ముందు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రహ్మణ్యన్ పప్పుధాన్యాల పంటలలో జీఎం సాంకేతికతను ప్రవేశపెట్టడాన్ని బహిరంగంగానే సమర్థించారు. పౌర సమాజం నుంచి ఆ సూచనకు తీవ్రమైన వ్యతిరేకత రావడంతో, ప్రైవేట్ విత్తన కంపెనీల వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం విధాన పత్రాలతో లాబీయింగ్ చేస్తూ ఆయన మరో అడుగు ముందుకు వేశారు. ఎక్కువ దిగుబడి బూటకం ఉత్పాదకతను పెంచిన జీఎం పంట ప్రపంచంలో ఎక్కడా లేనే లేదనే శాస్రీయ వాస్తవాన్ని పూర్తిగా విస్మరించారు. భారత్‌లో సాగుచేస్తున్న ఏౖకైక జీఎం పంట బీటీ పత్తి. జీఎం పత్తి ఉత్పాదకత పెరగడానికి తోడ్పడి ఉంటే, బీటీ పత్తిని పండిస్తున్న రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నదో నాకు అంతుపట్టడం లేదు. దేశంలోని మొత్తం రైతు ఆత్మహత్యల్లో దాదాపు 70 శాతం పత్తి రైతుల ఆత్మహత్యలేనని అంచనా. పైగా, పంటల ఉత్పాదకత పెంపుదలే పరిష్కారం అయితే, దేశానికి ధాన్యాగారమైన పంజాబ్‌లో ఉత్పాదకత అత్యధికంగా ఉన్నా... ఆ రాష్ట్రం రైతు ఆత్మహత్యలకు ప్రధాన కేంద్రంగా ఉండటానికి కారణం ఏమిటో కూడా నాకు అంతుపట్టడం లేదు. ఆహారధాన్యాలకు సంబంధించి పంజాబ్ ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకతను సాధించింది. అక్కడ 98 శాతం పంట భూములకు సుస్థిర సాగునీటి వసతి ఉన్నది. పంజాబ్ ప్రపంచంలోనే అత్యధికంగా సాగునీటి వసతి ఉన్న ప్రాంతం. అయినా ఆ రాష్ట్రంలో ముగ్గురు లేదా నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రోజు గడవడం లేదు. జీఎం పంటలు వేయకపోయినా పప్పు ధాన్యాల ఉత్పత్తి ఈ ఏడాది పలు రెట్లు పెరిగింది. అయినా ప్రభుత్వానికి పెరిగిన ఉత్పత్తిని ఏం చేయాలో తెలియకపోవడంతో, ధరలు విపరీతంగా పడిపోయి రైతులు నష్టపోవాల్సి వచ్చింది. కంది క్వింటాలు సేకరణ ధర రూ. 5,050 కాగా, ఎక్కువ మంది రైతులు క్వింటాలు రూ. 3,500 నుంచి రూ. 4,200కు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక ఉత్పాదకత సమస్య ఎక్కడిది? వ్యవసాయ ఉత్పత్తి కారకాల సరఫరాదార్ల ప్రయోజనాలను పెంపొందింపజేయడం కోసం ఆర్థికవేత్తలు ఇంకా ఎంత కాలం ఇలా ఈ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తారు? ఆర్థికవేత్తలు గ్రామాల బాట పట్టాలి 2017 ఆర్థిక సర్వే–ఐఐ చదువుతున్నప్పుడు అది నన్ను చాలా నిరాశకు గురిచేసిందని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. ఆర్థిక శాస్త్రవేత్తలు కళ్లకు గంతలు కట్టుకోవడం వల్ల వారికి క్షేత్రస్థాయి వాస్తవాలను చూపించడం అవసరం. అప్పుడే వారికి రైతులు ఎందుకు చనిపోతున్నారో అర్థం అవుతుంది. లేకపోతే మనం ఆర్థిక సర్వేలాంటి చచ్చు విధాన పత్రాలను అందుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఆర్థిక సర్వేను తయారుచేసే ఆర్థికవేత్తల బృందం కలసి కనీసం ఏడాదికి 3 నెలలు గ్రామీణ ప్రాంతాల్లో గడపడాన్ని తప్పనిసరి చేయాలని నా సూచన. ఆ బృందానికి ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వం వహిం చాలి, నీతి ఆయోగ్ సభ్యులు ఆ బృందంలో సభ్యులుగా ఉండాలి. ఆర్థికవేత్తలకు/ఉన్నతాధికారులకు గ్రామీణ నాడి తెలియడం తక్షణ అవసరమని మీరు కూడా అంగీకరిస్తారనడం నిస్సందేహం. లేకపోతే, దశాబ్దికి పైగా దేశాన్ని పీడిస్తున్న ఘోరమైన వ్యవసాయ సంక్షోభం మరింతగా విషమిస్తుంది. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ప్రశ్నించడమే ప్రజాద్రోహమా!
జన్యుమార్పిడి పంటలు ఆహార భద్రతకు ఏవిధంగా సమాధానం కాలేవో ప్రారంభ సదస్సులో ఇచ్చిన ఉపన్యాసంలో నేను వివరించాను. ఆ పంటలను పండించడం వల్ల వాతావరణ ంలోను, మన ఆరోగ్యంలోను సంభవించే విపరిణామాలను గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాను. తరువాత జరిగిన ఒక గోష్టిలో జన్యుమార్పిడి పంటల అనుకూలుడైన ఒక వక్త ప్రసంగించారు. ఆయన నాకూ, అల్‌కాయిదాకు సంబంధం ఉన్నదనే వరకూ వెళ్లిపోయాడు. జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకించిన వారి మీద కూడా ‘అభివృద్ధి నిరోధకులు’ అంటూ ముద్ర వేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. నేను మంగ ళూరులో ఒక సభలో మాట్లాడవలసి వచ్చింది. దేశమంతా ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) మాయాజాలంలో కొట్టుకు పోతున్న కాలమది. ఆర్థిక మండళ్ల ఆర్థికస్తోమత ఏపాటిదో, ఇలాంటి విధానం ఎలాంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందో సాంఘికంగా గానీ, ఆర్థికంగా గానీ ఆ అంశాల మూల్యాం కన ఏదీ జరగకుండానే సెజ్‌లను, ఆర్థికాభివృద్ధిని త్వరితం చేసే యంత్రాలూ, వ్యూహాలూ అన్నట్టు దేశం మీద రుద్దే యత్నం జరిగింది. మంగళూరు సమావేశానికి రైతులూ, సామాజిక ఉద్యమకారులు, వివిధ రంగాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. ఆర్థిక మండళ్ల పేరిట జరుగుతున్న భూఆక్రమణలు, నిర్వాసితులవుతున్న ప్రజలు అనే అంశాలను గురించి వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నించాను. నా ఉపన్యాసం ముగించి నేను సభా మందిరం నుంచి బయటకు వచ్చాక అక్కడ కొన్ని వాల్ పోస్టర్లు నాకు స్వాగతం పలికాయి. నన్ను ‘నక్సలైట్’ అంటూ, ‘జాతి విద్రోహి’ అంటూ సంబోధిస్తూ వెలసిన పోస్టర్లే అవన్నీ. ఆర్థిక మండళ్ల ఏర్పాటు ప్రత్యేక ఆర్థిక మండళ్ల మీద యూపీఏ ప్రధాని డాక్టర్ మన్మో హన్‌సింగ్ కూడా అపారమైన విశ్వాసాన్ని ప్రకటించిన సందర్భం ఒకటి కూడా నాకు బాగా గుర్తుంది. ఒక బిజినెస్ వార్తాపత్రిక నిర్వహించిన వార్షిక పురస్కారాల సభలో డాక్టర్ మన్మోహన్ పాల్గొన్నారు. తరువాత ప్రశ్న-జవాబు కార్యక్రమం మొదలైంది. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఒక ప్రశ్న వేశారు. వాణిజ్యానికి ప్రోత్సాహం ఇవ్వగలిగే కొద్దిపాటి వాతావరణం కూడా లేని మన దేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థలో చదివిన విద్యార్థి బయటకు వచ్చి ఏంచేస్తాడు? అన్నదే ఆ ప్రశ్న సారాంశం. ‘యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడానికి, ప్రోత్సాహకాలు కల్పించడానికే మేం ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తున్నాం’ అన్నా రు ప్రధాని. అసలు ఆర్థిక మండళ్ల ఏర్పాటు యోచన కార్యరూపం ధరిస్తున్నదని ఆ సమావేశంలోనే ప్రధాని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు సెజ్‌ల ద్వారా ఒక కొత్త రూపు, ఒక వేగం తథ్యమని ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ కూడా ఎంతగానో విశ్వసించారు. సెజ్‌ల చట్టం 2005లో రూపుదిద్దుకుంది. దేశమంతటా ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. మరోవైపు సెజ్‌ల పేరుతో భూములు లాక్కుంటున్నారంటూ పేదలూ, రైతుల నుంచి వెల్లువెత్తిన నిరసనలను ఎవరూ ఖాతరు చేయలేదు. ఆర్థిక మండళ్లను వ్యతిరేకించడం ప్రగతి నిరోధ కులు చేసే పని అన్న రీతిలో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు, అందులోని పెద్దలు ప్రచారం సాగిం చారు కూడా. బెడిసికొట్టిన వ్యూహం అయితే ఏడేళ్ల తరువాత ప్రత్యేక ఆర్థిక మండళ్ల వ్యవహారం దిగుమతి చేసుకున్న ఆలోచనగా బయటపడింది. ఇందుకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదిక జాడ లేకుండాపోయింది. 2007- 2013 సంవత్సరాల మధ్య జరిగిన ఆర్థిక మండళ్ల కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో, ఆ ఆలోచన ఎంత అవాస్తవికమో ఆ నివేదిక నమోదు చేసింది. సెజ్ పథకం అమలుకు సంబం ధించిన నివేదికను అధ్యయనం చేసిన తరువాతే కాగ్ ప్రభుత్వాన్ని తూర్పారపట్టింది. ఆ కాలంలో మొత్తం 576 సెజ్ పథకాలను ఖరారు చేశారు. అందులో 392 సెజ్‌ల గురించి ప్రకటనలు కూడా వెలువడ్డాయి. అయితే అందులో కార్యకలాపాలు సాగుతున్న ఆర్థిక మండళ్లు కేవలం 170. ఇందులో మళ్లీ 48 శాతం కంటే తక్కువగానే ఎగుమతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అవన్నీ కలసి 2013-2014 కాలంలో చేసిన ఎగుమతులు కేవలం 3.8 శాతం. దేశంలో పలుచోట్ల 45,635.63 హెక్టార్ల భూమిని సెజ్ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయనున్నట్టు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందుకు సంబం ధించిన కార్యకలాపాలు ప్రారంభించిన భూమి 28,488.49 హెక్టార్లు. అంటే ఇది సేకరించిన భూమిలో 62 శాతం. దీనిని దృష్టిలో ఉంచుకునే కాగ్ చేసిన వ్యాఖ్యను గమనిం చాలి. ప్రజల నుంచి ప్రభుత్వం భూమిని సేకరించిందంటే గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి సంపదను కార్పొరేట్ ప్రపంచానికి దఖలు పరిచిందని రుజువవుతున్నదని కాగ్ తీవ్రంగానే వ్యాఖ్యానించింది. సెజ్ ఏర్పాటు పేరుతో భూములు తీసుకున్నవారిలో చాలా మంది ఇతర అవస రాలకు వాటిని ఉపయోగించుకున్నారు. సెజ్ భూములతో సంబంధం లేని బయటి వారికి అందులో ప్రవేశం దొరికింది. ఇంకా చిత్రం ఏమిటంటే, ఈ రీతిలో సాగిన సెజ్ చట్టం దుర్వినియోగాన్ని వాణిజ్య మంత్రిత్వశాఖ కళ్లప్పగించి చూసింది. కడిగిపారేసిన ‘కాగ్’ ఇంకా దారుణంగా, ఈ సెజ్ భూములలో ఇళ్లు, పాఠశా లలు, ఆస్పత్రులు నిర్మించడానికి డెవలపర్లను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది సెజ్ ఏర్పాట్ల పేరుతో చేసిన చట్టానికి పూర్తి విరుద్ధం. సెజ్ చట్టం ప్రకారం, పారిశ్రామిక అవసరాల కోసమే అక్కడ నిర్మించవలసిన కట్టడాలు ఏవీ ఆ భూములలో కనిపించడం లేదు. ఆర్థికాంశాలు రాసే ఒక పత్రిక అయితే ఈ పథకం ఎప్పుడో మూలపడిందని రాసింది. సెజ్ పేరుతో కేటాయించిన భూమిలో దాదాపు యాభై శాతం నిరుపయోగంగా ఉండిపోయింది. ఎగుమ తులలో గాని, ఉద్యోగాలు కల్పించడంలో గాని ఆర్థిక మండళ్ల భూముల ద్వారా ఎలాంటి ఫలితాలు అందలేదు. అందులో చాలా భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వర్గం లా మారిందన్న విమర్శ కూడా వచ్చింది. అయితే పన్నుల రూపంలో వచ్చే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవడానికి ఈ భూములు ఐటీ సంస్థలకు మాత్రం బాగా ఉపయోగ పడ్డాయి. చిత్రం ఏమిటంటే, 2007లో ఏర్పాటైన పార్ల మెంటరీ స్థాయీ సంఘం సెజ్‌ల వల్ల ఆదాయంలో వచ్చిన నష్టం వివరాలను కూడా తెలియచేసింది. అంటే ప్రధాని ప్రకటించిన రెండేళ్లకే సెజ్‌లు ఏ రూపం దాల్చాయో స్థాయీ సంఘమే బయటపెట్టింది. సెజ్‌లకు 2005- 2012 మధ్య ఇచ్చిన ట్యాక్స్ హాలిడే కారణంగా రూ.1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని స్థాయీ సంఘం తేల్చింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే ద్రోహం కాదు ఇలా ఉండగా, ఆర్థికాభివృద్ధి పేరుతో భూములను ఖాళీ చేయించిన లక్షలాది పేదలకు సానుభూతిగా ఒక్క సాంత్వన వచనం కూడా ఎవరి నోటి నుంచి వెలువడలేదు. గ్రీన్‌పీస్ సామాజిక కార్యకర్త ప్రియా పిళ్లై కేసు గురించి ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను వార్తాపత్రికలో చదువుతున్నపుడు నాకు ఆర్థిక మండళ్ల అనుభవం గుర్తుకు వచ్చింది. ప్రియా పిళ్లై విదేశాలకు వెళ్లడానికి అనుమతి నిరాకరణకు సంబం ధించి కోర్టులో ప్రాథమిక వాదోపవాదాలు జరిగాయి. అందుకు సంబంధించిన వార్త అది. ఈ కేసుకు న్యాయ చరిత్రలో ఎంతో ఖ్యాతి వచ్చింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నంత మాత్రాన జాతి వ్యతిరేకంగా భావించరాదని ప్రభుత్వ ప్రతి నిధులను కోర్టు ఆ కేసులో హెచ్చరించింది. అలాగే తరు వాత జరిగిన వాదోపవాదాలలో జాతీయ వాదానికీ, వీర జాతీయ వాదానికీ మధ్య తేడాను గుర్తించవలసిందని కూడా హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ సంద ర్భంలోనే ప్రస్తావించుకోవలసిన మరొక సంఘటన కూడా ఉంది. రెండు దశాబ్దాల క్రితం లండన్‌లో ఏర్పాటైన మొదటి ప్రపంచ ఆహార, వ్యవసాయ సదస్సుకు నన్ను ఆహ్వానించారు. వ్యవసాయోత్పత్తుల అంతర్జాతీయ వాణి జ్యవ్యవస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమమది. జన్యుమార్పిడి పంటలు ఆహార భద్రతకు ఏవిధంగా సమాధానం కాలేవో ప్రారంభ సదస్సులో ఇచ్చిన ఉపన్యాసంలో నేను వివరిం చాను. ఆ పంటలను పండించడం వల్ల వాతావరణంలోను, మన ఆరోగ్యంలోను సంభవించే విపరిణామాలను గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాను. తరువాత జరిగిన ఒక గోష్టిలో జన్యుమార్పిడి పంటల అనుకూలుడైన ఒక వక్త ప్రసంగిం చారు. ఆయన నాకూ, అల్‌కాయిదాకు సంబంధం ఉన్నదనే వరకూ వెళ్లిపోయాడు. జన్యుమార్పిడి పంటలను వ్యతిరే కించిన వారి మీద కూడా ‘అభివృద్ధి నిరోధకులు’ అంటూ ముద్ర వేస్తున్నారు. వాణిజ్య ప్రయోజనాలతో సహా అనేక ఇతర వాస్తవాలు, అంశాలు- చౌకగా, సులభంగా లభించే ప్రత్యామ్నాయాలను గురించి చెప్పేవారిని మూలకు నెట్టేటట్టు చేస్తున్నాయి. అలాంటి వారిపై అనేక ముద్రలు వేస్తున్నాయి. ప్రత్యామ్నాయ దృక్పథం తప్పుకాదు ఒక అంశాన్ని విమర్శించాలంటే చాలా పరిశోధన, విశ్లేషణ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆ తరువాత ఒక సందర్భంలో అన్నారు. దీనితో నేను కూడా ఏకీభవిస్తాను. వార్తాపత్రికలో వచ్చిన ఒక పతాకశీర్షికను మనం నమ్ము తాం. మనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడడానికి అది చాలు కూడా. నిజానికి మనలో చాలా మంది పతాక శీర్షికను మించి వివరాలలోకి వెళ్లడానికి ప్రయత్నం చేయం. నేను చాలా టీవీ చానళ్ల చర్చలలో పాల్గొంటూ ఉంటాను. చిత్రంగా అక్కడ ఒకే ఆలోచనా విధానం ఉన్న వారి నుంచే నాకు ఎక్కువ ప్రతిఘటన ఎదురవుతూ ఉంటుంది. ప్రత్యా మ్నాయ దృక్పథం అణచివేతకు గురవుతోంది లేదా గుర్తిం పునకు నోచుకోవడం లేదు. ప్రశ్నించేవాడు, విమర్శించే వాడు కూడా జాతీయ వాదులే. వీరు కూడా ఈ భూగో ళాన్ని సజావుగా ఉంచడానికి కృషి చేస్తున్నవారే. నిలకడగా ఉండే ఆర్థికవృద్ధిని సాధించడం, అభివృద్ధి మహిళాభ్యు న్నతికి అనుకూలంగా, ప్రజానుకూలంగా, పర్యావర ణానుకూలంగా ఉండటం కోసం కట్టుబడి ఉన్నవారే. పర్యావరణానికి చేటు చేయని రీతిలో దోపిడీలేని, సహజ వనరులను సద్వినియోగం చేసుకునే చోట మాత్రమే అభి వృద్ధి సాధ్యమవుతుంది. అలాంటి వ్యవస్థ కోసమే మన మంతా ఎదురుచూడాలి. ఎవరు అవ్యవస్థకు వ్యతిరేకంగా గళం ఎత్తుతారో వారంతా జాతిలో చైతన్యాన్ని నిలిపి ఉంచ గలిగేవారే. అలాగే వీర జాతీయ వాదం ప్రకటించేవారు ఎంతమాత్రం జాతీయ వాదులు కారన్న సంగతి వాస్తవం. ఇలాంటివారు మనలను ఫాసిజం వైపు నడుపుతారు. అంతవరకే. (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు) ఈమెయిల్: hunger55@gmail.com -
స్మార్ట్ విలేజ్ మరింత మేలు
వంద స్మార్ట్ నగరాలను నిర్మించాలన్న యోచనతో పాటు స్మార్ట్ గ్రామాల నిర్మాణం గురించి కూడా ప్రధాని దృష్టి పెట్టాలి. స్మార్ట్ విలేజ్ ఏర్పడితే స్థానికంగా జరిగిన ఉత్పత్తికీ, స్థానికంగా జరిగే సేకరణకీ, స్థానికంగా జరిగే పంపిణీకీ మధ్య దానికదే ఒక లంకె ఏర్పడుతుంది. భారతీయ రైతాంగం అలా ఎప్పుడూ నిర్లక్ష్యానికి ఎందుకు గురౌతూ ఉం టుందో నాకు ఏనాటికీ అర్థం కాని విషయం. చిన్న పాటి వ్యయాలతోనే మన రైతులు పుష్కలంగా పంటలు పండిస్తూ ఉంటారు. ఉత్తేజం కలిగించే విధం గా ఒక ఆర్థిక ప్యాకేజీని కనుక ఇచ్చినట్టయితే, రైతులు ఈ దేశాన్ని ఆహా రంతో, పళ్లూ కూరగాయలతో ముంచెత్తుతారు. అత్యధికంగా వ్యవసాయోత్ప త్తులను ఎగుమతి చేసే దేశంగా భారత్ అవతరించడం ఖాయం. 2013-14 సంవత్సరంలో రైతులు రికార్డు స్థాయిలో 264.4 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను పండించారు. 4.8 శాతం పెంపుతో చమురు గింజల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో 34.5 మిలి యన్ టన్నులకు చేరుకుంది. మొక్కజొన్న కూడా 8.52 శాతం అధికంగా దిగుబడి సాధ్యమైంది. అంటే 24.2 మిలియన్ టన్ను ల మొక్కజొన్న ఉత్పత్తి అయింది. అపరాలు లేదా పప్పుధాన్యా ల ఉత్పత్తి మున్నెన్నడూ లేని రీతిలో 19.6 మిలియన్ టన్నుల దిగుబడిని మన రైతులు సాధ్యం చేశారు. ఇది గతేడాది కంటె 7.10 శాతం ఎక్కువ. పత్తి ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలోనే జరి గింది. వ్యవసాయోత్పత్తులలో ఇంత భారీ పెరుగుదల ఉన్నప్ప టికీ 2013-14 సంవత్సరం వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగా నికి దక్కింది రూ. 19,307 కోట్లు. ఇది మొత్తం ప్రణాళికా వ్య యంలో ఒక్క శాతం కంటె తక్కువ. ఈ బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యవసాయం, సహకార విభాగాలకి రూ. 22,652 కోట్లు కేటాయించారు. సేద్యమంటే చిన్న చూపే సేద్యాన్ని నిర్లక్ష్యం చేయడమనే మాట 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టినప్పటి నుంచి వింటున్నాం. అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చి న ప్రసిద్ధ బడ్జెట్ ప్రసంగంలో పారిశ్రామిక రంగం మీద వరాల జల్లు కురిపిం చి, తరువాత పేరాలో మాత్రం ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలాధార మని చెప్పడం నాకింకా గుర్తు. కానీ వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. అందుకే ఆ రంగానికి అవసరమైన చేయూతను ఇచ్చే బాధ్యతను మన్మోహన్ సింగ్ రాష్ట్రాల మీద పెట్టారు. అప్పుడు ఆయనొక సంగతి విస్మరించారు. పరిశ్రమలు కూడా రాష్ట్ర జాబితాలోనివే. ఆ అంశాన్ని కూడా నాటి కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించి ఉండవలసింది. దీనితో ఆయన పక్షపాత వైఖరి ఎలాంటిదో సుస్పష్టంగానే కనిపిస్తుంది. పదకొండో పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-08 - 2011-12) వ్యవసాయరంగం ఎంతో తృప్తిని కలిగిస్తూ 4.1 శాతం వృద్ధి రేటును సాధిం చింది. అయినప్పటికీ ఆ రంగానికి దక్కినది మరీ ఘోరంగా ఒక లక్ష కోట్లే. ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగమది. అలాంటి రంగానికి ఐదేళ్లకి గాను లక్ష కోట్లు ఖర్చు చేయడమంటే అది ఏమూ లకి? పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-13 -- 2017-18)లో ఆ కేటా యింపును రూ. 1.5 లక్షల కోట్లకు పెంచారు. అయితే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగానికి రూ. 5.73 లక్షల కోట్లు పన్ను మినహా యింపును ఇచ్చారు. ఆర్థిక రాడార్ తెర మీద నుంచి రైతులు అదృశ్యమైపో యారని నేను చాలాకాలంగా చెబుతూనే ఉన్నాను. పరిశ్రమలకు పన్ను బాధ లేదు 2004-05 సంవత్సరం నుంచి కార్పొరేట్ భారతానికి రూ. 31 లక్షల కోట్ల మేర పన్ను మినహాయింపు లభించింది. దీనితో ఉత్పత్తి పెరుగుతుందనీ, కొత్త ఉద్యోగాలు వస్తాయనీ అంతా ఆశించారు. అయితే, గడచిన పదేళ్లలో 1.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించారు గానీ, పారిశ్రామికోత్పత్తులలో ఎలాంటి పురోగతీ లేదు. దీనికి పరాకాష్ట ఏమిటంటే- కార్పొరేట్ రంగం రూ. పది లక్షల కోట్ల మిగులును వెనకేసుకోవడం, దాదాపు పది లక్షల కోట్ల రూపా యల మేర బ్యాంకుల రుణాలను (మొండిబకాయిలన్నమాట) ఎగవేయడం. చట్టబద్ధంగా పేదవర్గాలకు రావలసిన ఆర్థిక మద్దతు వారికి ఎలా రాకుండా పోతున్నదో, ఉన్న వనరులను సంపన్న వర్గాలకు ఎలా సౌకర్యంగా మళ్లిస్తున్నారో ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది. వ్యవసాయ రంగం 60 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నదని ఇంత క్రితమే చెప్పుకున్నాం. అందులో 82.2 శాతం చిన్న, మధ్య తరహా రైతులే. వీరికి ఆర్థిక మద్దతు లేకున్నా ఎలా గో నెట్టుకొస్తున్నారు. అయితే 60 శాతం రైతాంగం పస్తులతో బాధ పడుతు న్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యవసాయం ఏమాత్రం లాభసాటి కాని వ్యాపకంగా తయారవుతూ ఉండడంతో 42 శాతం రైతులు సేద్యానికి వీడ్కోలు పలకాలని చూస్తున్నారు. వ్యవసాయం పూర్తిగా నిలిచిపోయి, వ్యవ సాయం మీద ఆధారపడిన వారంతా పట్టణాలకీ నగరాలకీ చేరుకునే విష యం మీద ప్రధాన స్రవంతి ఆర్థిక నిపుణులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇలా నగరాలకు వస్తున్న వారికి ఎక్కువగా ఆలయాలు ఆశ్రయమిస్తున్నాయి. తరు వాత సెక్యూరిటీ గార్డులుగాను, లిఫ్ట్బాయ్లుగాను వీరు కాలం వెళ్లదీస్తు న్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు జర గడమంటే ఆర్థిక వృద్ధికి అదే సూచిక అని ప్రపంచ బ్యాంకు ప్రవచించింది. దానినే భారత ఆర్థిక నిపుణులు చిలకపలుకుల్లా వల్లిస్తున్నారు. 2013-14 ఆర్థిక సర్వే కూడా ఇదే చెప్పింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ వాదననే ఎలుగెత్తి చాటారు. స్మార్ట్ విలేజ్ల సంగతి పట్టదేం! నరేంద్ర మోడీ ఈ పరిస్థితిని చక్కదిద్దే చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటారని ఆశపడ్డాను. సేద్యం ఆర్థికంగా లాభసాటిగా మార్చాలంటూ ఆయన తన ఎన్నికల సభలలో చాలాసార్లు పేర్కొన్నారు. గ్రామాలకు ఆధునిక సౌకర్యాలు కల్పించడం గురించి కూడా మోడీ పలుసార్లు ప్రస్తావించారు. అభివృద్ధిని గ్రామాలకు తీసుకువెళ్లడమే రాజకీయ చింతనలో మలుపు అవుతుంది. దీనికి శ్రీకారం చుడితేనే వ్యవసాయానికి పునర్వైభవం చేకూరి, రైతు ముఖం మీద నవ్వు వెల్లివిరుస్తుంది. వంద స్మార్ట్ నగరాలను నిర్మించాలన్న యోచనతో పాటు స్మార్ట్ గ్రామాల నిర్మాణం గురించి కూడా ప్రధాని దృష్టి పెట్టాలి. స్మార్ట్ విలేజ్ ఏర్పడితే స్థానికంగా జరిగిన ఉత్పత్తికీ, స్థానికంగా జరిగే సేకరణకీ, స్థానికంగా జరిగే పంపిణీకీ మధ్య దానికదే ఒక లంకె ఏర్పడుతుం ది. స్మార్ట్ గ్రామం అనగానే, ఇంటర్నెట్తో బంధం ఏర్పడడమే కాదు, సుస్థిర మైన వ్యవసాయ పద్ధతులకు మద్దతు కూడా లభిస్తుంది. చిన్న తరహా పరిశ్ర మలకూ సేద్యానికీ మధ్య కూడా లంకె ఏర్పడుతుంది. రైలు, రోడ్డు మార్గా లతో గ్రామం అనుసంధానమై, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలు తీరే మార్గం ఏర్పడుతుంది. అలాంటి మార్పు గురించే దేశం ఎదురుచూస్తోంది కూడా. గ్రామీణ ప్రాంతం అలాంటి రూపురేఖలను సంతరించుకోవాలని గడచిన 67 సంవత్సరాల నుంచి దేశం ఆశిస్తున్నది. స్మార్ట్ గ్రామం పెరిగిపో తున్న ఆర్థిక అసమానతలను తగ్గించడమే కాదు, దేశం నలుమూలలా, మారుమూల ఉన్న ప్రతి వ్యక్తికి మంచి రోజులు తేగలదు. అదే సమయంలో వలసల కారణంగా పట్టణాల మీద నగరాల మీద పెరుగుతున్న ఒత్తిడిని కూడా స్మార్ట్ గ్రామం తగ్గించగలుగుతుంది. - దేవేంద్ర శర్మ వ్యాసకర్త వ్యవసాయ రంగ విశ్లేషకులు