దేశంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి వ్యవసాయదారుల ఆత్మహత్యలు నమోదు కాని రోజంటూ లేదు. దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000ల ఆదాయం తప్పనిసరిగా అందించేలా రైతులు ఆదాయం – సంక్షేమం కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పర్చే విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకురావలసిన అత్యంత మౌలిక సంస్కరణ కోసం దేశం ఎదురుచూస్తోంది. వ్యవసాయ పంటల సాగు కాలంలో రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు, అవరోధాలను తొలగించడానికి వ్యవసాయాన్ని కూడా సులభతరంగా చేసే విధానాలను కేంద్రం అమలులోకి తీసుకురావలసిన అవసరం ఎంతగానో ఉంది. పంటలకు కనీస మద్దతు, రైతుకు కనీస ఆదాయ కల్పనలో మౌలిక సంస్కరణ తీసుకురావడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పెనుసవాల్ కానుంది.
దేశ భూభాగంలో దాదాపు 50 శాతం వరకు ప్రస్తుతం తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల్లో చిక్కుకుపోవడం చూస్తున్నాం. గత వందేళ్లలో అయిదో అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదైన నెలగా ఈ జూన్ మాసం రికార్డుకెక్కింది. దానికితోడుగా గత ఏడు సంవత్సరాల్లో వ్యవసాయరంగ వాస్తవ రాబడుల్లో వృద్ధి దాదాపుగా జీరోకి సమీపంలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ జూలై 5న తన తొలి బడ్జెట్ సమర్పించనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కఠినతరమైన లక్ష్యాన్ని ఎదుర్కోబోతున్నారు. మరోవైపున వ్యవసాయదారుల ఆశలు, అంచనాలు తారస్థాయిలో ఉంటున్నాయి. దేశ వ్యవసాయ రంగంలో మౌలిక సంస్కరణలు తప్పనిసరి అనే విషయాన్ని ఎవరూ తోసిపుచ్చలేని వాస్తవమే కానీ కేంద్రంలోని నూతన ప్రభుత్వానికి అంతకుమించిన పెద్ద సవాలు ఏదంటే వ్యవసాయరంగంలో వాస్తవ రాబడులను పెంచడం ఎలా అన్నదే. ఎకనమిక్ సర్వే 2016 అంచనా ప్రకారం దేశంలోని 17 రాష్ట్రాల్లో వ్యవసాయరంగ ఆదాయం సగటున సంవత్సరానికి రూ. 20,000 మాత్రమే. ఓఈసీడీ– ఐసీఆర్‌ఐఈఆర్ నిర్వహించిన కీలకమైన అధ్యయనం ప్రకారం 2007–2017 మధ్యకాలంలో రైతులకు న్యాయమైన ధరలను తృణీకరించిన కారణంగా వారు నష్టపోయిన మొత్తం రూ. 45 లక్షల కోట్లుగా తేలింది. ఇది చాలదన్నట్లుగా, గత పదిహేను సంవత్సరాల్లో వ్యవసాయరంగ రాబడులు అత్యంత కనిష్టస్థాయికి పడిపోయినట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిఫలితంగా గ్రామీణ వ్యవసాయరంగంలో ఉపాధి కల్పన భారీ స్థాయిలో క్షీణించిపోయింది. ఇక వ్యవసాయేతర శ్రామికుల విషయం చెప్పనక్కరలేదు.
భారీ దిగుబడులను పండించడానికి దేశీయ రైతాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ ప్రతి సంవత్సరం, వ్యవసాయదారుల పరిస్థితి మరింత దిగజారిపోతూ వస్తోంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని కనిష్టంగా ఉంచడం, పరిశ్రమకు ముడిసరుకును తక్కువ ధరలకు అందించడం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను నెరవేర్చాల్సి రావడం వంటి లక్ష్యాల సాధనకోసం తీసుకొచ్చిన సూక్ష్మ ఆర్థిక విధానాలకు మన వ్యవసాయరంగం నిజంగానే బలవుతోంది. వాణిజ్యరంగ నిబంధనలు తొలి నుంచీ వ్యవసాయరంగానికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. దీనికితోడుగా 2011–12, 2016–17 మధ్యకాలంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.4 శాతానికి పడిపోయాయి. వ్యవసాయరంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పడానికి ఇది చాలు.
దేశంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి వ్యవసాయదారుల ఆత్మహత్యలు నమోదు కాని రోజంటూ లేదు. ఉదాహరణకు పంజాబ్‌ను తీసుకుందాం. 2018 సంవత్సరం జనవరిలో ప్రతిరైతుకూ 2 లక్షల రూపాయల రుణ మాఫీని ప్రకటించిన తర్వాత కూడా ఆ సంవత్సరం మొత్తంలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని భారతీయ కిసాన్ యూనియన్ అంచనా వేసింది. 2000–2017 మధ్యకాలంలో మూడు ప్రభుత్వ రంగ యూనివర్సిటీలు ఇల్లిల్లూ తిరిగి చేసిన సర్వే ప్రకారం 16,600 మంది రైతులు ఆత్మహత్యల బారిన పడినట్లు తేలింది. దేశంలోని అత్యంత కీలకమైన వ్యవసాయ రాష్ట్రంలోనే రైతుల దుస్థితి ఈ స్థాయిలో ఉండగా మిగతా దేశంలో వ్యవసాయ రంగం ఎంతగా కునారిల్లిపోతోందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అత్యంత లోపభూయిష్టమైన ఆర్థిక విధానాల రూపకల్పన కారణంగానే రైతులు బాధితులుగా మిగిలిపోతున్నారు. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించిన కారణంగానే దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని గ్లోబల్ అనలిటికల్ కంపెనీ క్రిసిల్ (íసీఆర్‌ఐఎస్‌ఐఎల్) తేల్చి చెప్పింది. వ్యవసాయ పంటలకు కనిష్ట మద్దతు ధర 2009–2013 మధ్య 19.3 శాతం మేరకు ఉండగా, తదుపరి నాలుగేళ్ల కాలంలో ఇది 3.6 శాతానికి క్షీణించిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా ఇస్తున్న డీఏ (డియర్నెస్ అలవెన్స్) స్థాయిలో కూడా రైతు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం లేదు. 1970లో స్కూల్ టీచర్లకు నెలకు రూ. 90ల వేతనం ఉండగా 2015 నాటికి వారి వేతనం 170 రెట్లకు పెరిగింది. అదే కాలంలో ప్రభుత్వోద్యోగుల వేతనం 150 రెట్లు పెరిగింది. దీనికి భిన్నంగా దేశీయ రైతులు పండించిన గోధుమ పంట ధర 19 రెట్లు మాత్రమే పెరిగింది. వ్యవసాయ రంగంలో మౌలిక సంస్కరణలు ఎంత అవసరమో దీన్ని బట్టే తెలుస్తోంది.
2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎమ్– కిసాన్) ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా దేశంలో భూమి ఉన్న రైతులందరికీ సంవత్సరానికి రూ. 6,000ల ప్రత్యక్ష నగదు మద్దతును ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే నెలకు రూ.500లు అన్నమాట. వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి కేంద్రప్రభుత్వం నడుంకట్టినట్లు ఇది సూచిస్తోంది. పైగా దేశ చరిత్రలో రైతుకు తొలిసారిగా ప్రత్యక్ష నగదు సహాయం అందించడానికి కేంద్రప్రభుత్వం సంసిద్ధత చూపుతుండటానికి ఇది స్పష్టమైన సంకేతం కూడా. ఈ విశిష్ట పథకాన్ని ఇప్పుడు 14.5 కోట్లమంది భూమి ఉన్న రైతులకు విస్తరించారు. దీన్ని దేశంలోని 14.4 కోట్లమంది భూమిలేని రైతులకు కూడా విస్తరింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు గాను బడ్జెట్‌లో రూ. 87,000 కోట్లను కేటాయిస్తూ ప్రతిపాదన చేశారు కూడా. దీనికి 14.4 కోట్ల భూమిలేని రైతులను కూడా జతచేస్తే బడ్జెట్‌లో రైతులకు ప్రత్యక్ష నగదు సహాయ పథకం కోసం దాదాపు రూ.1.6 లక్షల కోట్లు కేటాయించినట్లు అవుతుంది. ఇంత పెద్ద మొత్తం కేటాయింపునకు అవసరమైన డబ్బు ఎక్కడనుంచి వస్తుంది అనేది ప్రశ్న. దీనికి ఒకటే సమాధానం. 2008–09 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నాటినుంచి పారిశ్రామిక రంగానికి మద్దతుగా అమలులోకి తీసుకువచ్చిన రూ. 1.86 కోట్ల వార్షిక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని తక్షణం రద్దు చేయడమే ఆర్థికమంత్రికి అందుబాటులో ఉన్న సులభమైన మార్గం. ఈ ప్యాకేజీకి ఎలాంటి ఆర్థిక సమర్థన ఇప్పుడు లేదు. గత పది సంవత్సరాలుగా ఈ ఉద్దీపన ప్యాకేజీని మన పారిశ్రామిక రంగానికి అందజేస్తూనే ఉన్నారు.
2018–19లో వ్యవసాయరంగానికి రూ.11.68 లక్షల కోట్ల రుణాన్ని విస్తరించారు. బడ్జెట్‌లో దీన్ని రూ.12 లక్షల కోట్లకు సవరించే అవకాశం కూడా ఉంది. అయితే అతిపెద్ద సవాలు ఏమిటంటే, వ్యవసాయ రుణం సన్నకారు, చిన్నకారు రైతుల వరకు చేరడం ఎలా అన్నదే. దేశంలో సంస్థాగత రుణాలకు 15 శాతం కంటే తక్కువ మంది చిన్నకారు రైతులే పొందగలుగుతున్నారని ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ తాజాగా అంచనా వేసింది. రైతుల ఆత్మహత్యలను రైతు రుణమాఫీలు అరికట్టలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టే సంస్థాగత రుణాల పరిధిలోకి మరింతమంది రైతులను తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటిగా ఉండాలి. పైగా, దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000ల ఆదాయం తప్పనిసరిగా అందించేలా రైతులు ఆదాయం –సంక్షేమం కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పర్చే విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకురావలసిన అత్యంత మౌలిక సంస్కరణ కోసం దేశం ఎదురుచూస్తోంది. దీనికోసం ప్రతి జిల్లాలోనూ రైతుల సగటు ఆదాయాన్ని పెంపొందించేందుకు తగిన మార్గాన్ని ఏర్పర్చవలసి ఉంది. దీనికి అవసరమైన డేటా కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటోంది.
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎమ్‌సీ) క్రమబద్ధీకరణ మార్కెట్ల యంత్రాంగాన్ని విస్తరించడం తక్షణ కర్తవ్యంగా ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకు ప్రస్తుతం ఉన్న 7,000 మండీలను 42,000కు పెంచడానికి ప్ర«థమ ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ధాన్యాగారాలను, గోడౌన్లను ఏర్పర్చడంపై బడ్జెట్ విధివిధానాలను రూపొందించాలి. వచ్చే అయిదేళ్ల కాలానికి గానూ దేశీయ వ్యవసాయ రంగంలో 25 లక్షల కోట్ల రూపాయలను అందిస్తామని భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఉన్న విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసం ప్రారంభ దిశగా ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మండీలు, గోడౌన్ల ఏర్పాటు కోసం కనీసం రూ. 5 లక్షల కోట్లను మదుపు చేయాల్సి ఉంది. అయితే దీనికంటే మిన్నగా, రైతులు ప్రభుత్వ పాలనకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలకోసం సులభతరమైన వాణిజ్యవిధానాన్ని ప్రోత్సహించినట్లుగానే, వ్యపసాయ పంటల సాగు కాలంలో రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు, అవరోధాలను తొలగించడానికి వ్యవసాయాన్ని కూడా సులభతరంగా చేసే విధానాలను కేంద్రం అమలులోకి తీసుకురావలసిన అవసరం ఎంతగానో ఉంది. గతంలో వాణిజ్యమంత్రిగా సులభతరమైన వాణిజ్య విధానంకోసం దాదాపు 7,000 చర్యలను తీసుకున్న అనుభవం ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి ఉంది కాబట్టి వ్యవసాయ రంగానికి కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేయడం ఆమెకు సులభమైన పనే. అయితే వ్యవసాయరంగంలో సులభతర విధానం అమలుకోసం కనీసం 5,000 చర్యలను అందించే యంత్రాంగం స్థాపనకోసం ఆమె ఇంకా ఎందుకు నడుం కట్టలేదన్నదే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
దేవిందర్‌శర్మ
ఈ–మెయిల్ : hunger55@gmail.com
బడ్జెట్‌లో వ్యవసాయం వాటా ఎంత?
Published Wed, Jul 3 2019 2:17 AM | Last Updated on Wed, Jul 3 2019 2:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment