మన ఆర్థికవేత్తల హ్రస్వదృష్టి
విశ్లేషణ
మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలకు క్షేత్రస్థాయి వాస్తవాలను చూపించడం అవసరం. అప్పుడే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వారికి అర్థం అవుతుంది. లేకపోతే ఆర్థిక సర్వేలాంటి చచ్చు విధాన పత్రాలనే రూపొందిస్తుంటారు. ఆర్థిక సర్వేను రూపొందించే ఆర్థికవేత్తల బృందం కనీసం ఏడాదికి మూడు నెలలు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో గడిపేలా చేయాలి. వారికి గ్రామీణ నాడి తెలియడం అవసరం. లేకపోతే, దేశాన్ని పీడిస్తున్న తీవ్ర వ్యవసాయ సంక్షోభం మరింతగా విషమిస్తుంది. దాదాపు నాలుగేళ్లుగా వార్షిక ఆర్థిక సర్వేలను శ్రద్ధగా అధ్యయనం చేస్తున్న పాఠకుణ్ణి నేను. సాధారణంగా కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు విడుదలయ్యే ఆర్థిక నివేదిక ఒక పెద్ద ఉద్గ్రంథం లాంటి పత్రం. ఆ ఏడాది కాలంలో ఆర్థిక వ్యవస్థ తీరు ఎలా సాగిందనే దానిపై అది తగినంత మంచి అం^è నానే ఇస్తుంది.
హ్రస్వదృష్టికి అద్దం ఆర్థిక సర్వే
అదే సమయంలో అది, వరుసగా వస్తున్న మన ప్రభుత్వాల ఆర్థిక చింతన ఎంత హ్రస్వదృష్టితో ఉంటున్నదో కూడా చెబుతుంది. ఆర్థిక సర్వేను మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, దాన్ని రాసిన ఆర్థికవేత్తలు ప్రపంచ బ్యాంకు/ఐఎంఎఫ్, క్రెడిట్ రేటింగ్ సంస్థలు సూచిస్తున్న ఆర్థిక చింతనను గుడ్డిగా అనుసరించారని గుర్తించగలుగుతారు. కనీసం కొన్ని ఆర్థిక సర్వేలనైనా చది వితే మీకు మన ఆర్థిక శాస్త్రవేత్తలు ఆ మూస పద్ధతికి భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచించ సాహసించ లేకపోతున్నారని అత్యంత స్పష్టంగా తెలుస్తుంది. ఏళ్ల తరబడి విఫలమౌతున్న అవే పాత సలహాలను, సూచనలనే వారు మళ్లీ ఇస్తుంటారు.
గుర్రాలు మేతపైనే దృష్టిని నిలిపేలా చేయడానికి వాటి కళ్లకు గంతలు కట్టినట్టుగానే, తాము కూడా తెలిసిగానీ లేక తెలియకగానీ మానసికమైన గంతలను కట్టుకున్నామని మన ప్రధాన స్రవంతి ఆర్థికశాస్త్రవేత్తలు గుర్తించడం లేదు. వాళ్లు ఆ గంతల్లోంచి కనిపించే కొద్ది దూరానికి మించి చూడలేరు. బహుశా వారు ఆ పాత మూసపద్ధతికి మించి చూడాలని ఆశిం చడం కూడా లేదేమో. గుర్రాల కళ్లకు కట్టే గంతలు ప్రకృతి నిజంగా అవి వేటిని చూడాలని నిర్దేశించిందో వాటిని చూడనీయకుండా చేస్తాయని మరచిపోకండి. మన ఆర్థికవేత్తలు అంతకంటే మెరుగేమీ కారు.
సంక్షోభానికి మూలం తప్పుడు ఆర్థిక చింతనే
మీ కోసం గిరిగీసి ఉంచిన పరిధికి మించి చూడలేకపోయినప్పుడు మీరు తప్పులను, తరచుగా తీవ్రమైన తప్పులను చేయడమే చివరికి జరుగుతుంది. జనాభాలో 52 శాతానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనోపాధిని కల్పించే వ్యవసాయరంగాన్నే ఉదాహరణగా తీసుకోండి. గత పదేళ్లుగా ఆర్థిక సర్వేలు వ్యవసాయరంగం గురించి ఏం చెబుతున్నాయో నేను జాగ్రత్తగా అధ్యయనం చేశాను. ఫలితంగా, నేడు దేశం ఎదుర్కొంటున్న ఘోరమైన వ్యవసాయ సంక్షోభానికి మూల కారణం వాస్తవంగా మన తప్పుడు ఆర్థిక చింతనలోనే ఉన్నదని పూర్తిగా నమ్మకం కలిగింది. ఈ తప్పుడు ఆర్థిక చింతనంతా ఆర్థిక సర్వేలలో బయటపడుతుంటుంది. తాము సూచిస్తూ వచ్చిన ఆర్థికపరమైన సలహాలు, సూచనలే ప్రధానంగా వ్యవసాయ సంక్షోభానికి దారితీశాయని అంగీకరించాలని సైతం ఆర్థిక సర్వేలను రాసేవారికి పట్టకపోవడమే విషాదం.
ఒక్కొక్క ఏడూ గడిచే కొద్దీ, ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి మద్దతుగా విఫలమైన అవే సూచనలను చేయడం కొనసాగుతుంది: పంటల ఉత్పాదకతను పెంచడం, నీటి పారుదల సదుపాయాలను విస్తరించడం, ప్రమాదాలను తగ్గించడం, గిట్టుబాటు ధరలను కల్పించడం, మార్కెట్లను ప్రైవేటీకరించడం. వ్యవసాయం రంగ వృద్ధి కోసం కనీసం గత పదేళ్లుగా ఆర్థిక సర్వేలు అవే సూచనలను చేస్తున్నాయి. కాబట్టి వ్యవసాయ సంక్షోభం ఒకొక్క ఏడూ గడిచేకొద్దీ మరింత లోతుగా విస్తరిస్తుండటంలో ఆశ్చర్యమేం లేదు. పెచ్చుపెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు సైతం, తమ భావజాలపరమైన సూచనలకు మించి ఆలోచించేలా ఆర్థికవేత్తలకు ప్రేరణను కలిగించలేక పోయాయి. గత 22 ఏళ్లలో కనీసం 3.30 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అంచనా. అయినాగానీ ఆర్థికశాస్త్రవేత్తలు కొంత అర్థవంతమైన సూచనలతో ముందుకు రావడానికి సాహసించలేకపోయారనేది వాస్తవం. ఇది మన విధాన చట్రంపైన విషాదకరమైన నీడలు ముసురుకునేలా చేస్తోంది.
విత్తన కంపెనీల కోసం జీఎం పంటల రాగం
ఇది సరిపోదన్నట్టు, గతంలో దాదాపుగా తాము సూచించనవేవీ పనిచేయలేదని తెలిసి కూడా ఆర్థిక సర్వే 2017 వివాదాస్పదమైన జన్యు మార్పిడి (జీఎం) పంటలపైకి తన దృష్టి కేంద్రీకరణను మరల్చింది. పంటల ఉత్పాదకత పెరిగినప్పుడు మాత్రమే వ్యవసాయరంగంలోని దైన్యం తగ్గుతుంది అంటూ.. అదే తప్పుడు వాదనతో ఆర్థిక సర్వే జీఎం పంటలే శరణ్యమని వాటికి సమంజసత్వాన్ని కల్పించాలని ప్రయత్నించింది. వాణిజ్యపరంగా ప్రవేశపెట్టడానికి వేచిచూస్తున్న జన్యుమార్పిడి ఆవపంటకు మాత్రమే కాదు, అన్ని రకాల జీఎం పంటలకు మనం తలుపులు బార్లా తెరవాలని సైతం నిజానికి అది సూచించింది.
జీఎం పంటలను ప్రవేశపెట్టడానికి తగిన పరిస్థితులను కల్పించడానికి వీలుగా ఆర్థికసర్వే, ఇన్నేళ్లుగా జన్యు మార్పిడి విత్తన పరిశ్రమ చెబుతూ వస్తున్న అదే వాదనతో అందుకు సమంజసత్వాన్ని కల్పించాలని చూసింది. అంతకు ముందు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రహ్మణ్యన్ పప్పుధాన్యాల పంటలలో జీఎం సాంకేతికతను ప్రవేశపెట్టడాన్ని బహిరంగంగానే సమర్థించారు. పౌర సమాజం నుంచి ఆ సూచనకు తీవ్రమైన వ్యతిరేకత రావడంతో, ప్రైవేట్ విత్తన కంపెనీల వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం విధాన పత్రాలతో లాబీయింగ్ చేస్తూ ఆయన మరో అడుగు ముందుకు వేశారు.
ఎక్కువ దిగుబడి బూటకం
ఉత్పాదకతను పెంచిన జీఎం పంట ప్రపంచంలో ఎక్కడా లేనే లేదనే శాస్రీయ వాస్తవాన్ని పూర్తిగా విస్మరించారు. భారత్‌లో సాగుచేస్తున్న ఏౖకైక జీఎం పంట బీటీ పత్తి. జీఎం పత్తి ఉత్పాదకత పెరగడానికి తోడ్పడి ఉంటే, బీటీ పత్తిని పండిస్తున్న రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నదో నాకు అంతుపట్టడం లేదు. దేశంలోని మొత్తం రైతు ఆత్మహత్యల్లో దాదాపు 70 శాతం పత్తి రైతుల ఆత్మహత్యలేనని అంచనా. పైగా, పంటల ఉత్పాదకత పెంపుదలే పరిష్కారం అయితే, దేశానికి ధాన్యాగారమైన పంజాబ్‌లో ఉత్పాదకత అత్యధికంగా ఉన్నా... ఆ రాష్ట్రం రైతు ఆత్మహత్యలకు ప్రధాన కేంద్రంగా ఉండటానికి కారణం ఏమిటో కూడా నాకు అంతుపట్టడం లేదు. ఆహారధాన్యాలకు సంబంధించి పంజాబ్ ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకతను సాధించింది.
అక్కడ 98 శాతం పంట భూములకు సుస్థిర సాగునీటి వసతి ఉన్నది. పంజాబ్ ప్రపంచంలోనే అత్యధికంగా సాగునీటి వసతి ఉన్న ప్రాంతం. అయినా ఆ రాష్ట్రంలో ముగ్గురు లేదా నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రోజు గడవడం లేదు. జీఎం పంటలు వేయకపోయినా పప్పు ధాన్యాల ఉత్పత్తి ఈ ఏడాది పలు రెట్లు పెరిగింది. అయినా ప్రభుత్వానికి పెరిగిన ఉత్పత్తిని ఏం చేయాలో తెలియకపోవడంతో, ధరలు విపరీతంగా పడిపోయి రైతులు నష్టపోవాల్సి వచ్చింది. కంది క్వింటాలు సేకరణ ధర రూ. 5,050 కాగా, ఎక్కువ మంది రైతులు క్వింటాలు రూ. 3,500 నుంచి రూ. 4,200కు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక ఉత్పాదకత సమస్య ఎక్కడిది? వ్యవసాయ ఉత్పత్తి కారకాల సరఫరాదార్ల ప్రయోజనాలను పెంపొందింపజేయడం కోసం ఆర్థికవేత్తలు ఇంకా ఎంత కాలం ఇలా ఈ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తారు?
ఆర్థికవేత్తలు గ్రామాల బాట పట్టాలి
2017 ఆర్థిక సర్వే–ఐఐ చదువుతున్నప్పుడు అది నన్ను చాలా నిరాశకు గురిచేసిందని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. ఆర్థిక శాస్త్రవేత్తలు కళ్లకు గంతలు కట్టుకోవడం వల్ల వారికి క్షేత్రస్థాయి వాస్తవాలను చూపించడం అవసరం. అప్పుడే వారికి రైతులు ఎందుకు చనిపోతున్నారో అర్థం అవుతుంది. లేకపోతే మనం ఆర్థిక సర్వేలాంటి చచ్చు విధాన పత్రాలను అందుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఆర్థిక సర్వేను తయారుచేసే ఆర్థికవేత్తల బృందం కలసి కనీసం ఏడాదికి 3 నెలలు గ్రామీణ ప్రాంతాల్లో గడపడాన్ని తప్పనిసరి చేయాలని నా సూచన. ఆ బృందానికి ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వం వహిం చాలి, నీతి ఆయోగ్ సభ్యులు ఆ బృందంలో సభ్యులుగా ఉండాలి. ఆర్థికవేత్తలకు/ఉన్నతాధికారులకు గ్రామీణ నాడి తెలియడం తక్షణ అవసరమని మీరు కూడా అంగీకరిస్తారనడం నిస్సందేహం. లేకపోతే, దశాబ్దికి పైగా దేశాన్ని పీడిస్తున్న ఘోరమైన వ్యవసాయ సంక్షోభం మరింతగా విషమిస్తుంది.
దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com